మన ఆత్మీయులు చనిపోయినప్పుడు దుఃఖించాలా?వద్దా? తెలుసుకుందాం.
ప్రాచీన చైనాలోని టుంగ్మెన్ వు అనే వ్యక్తి తన భార్యతో, కుమారుడితో నివసిస్తూ ఉండేవాడు. ఆ దంపతులు తమ పిల్లాడిని ఎంతో గారాబం చేసేవారు. ముఖ్యంగా టుంగ్మెన్ తన కుమారుడిని ఎప్పుడూ ఆటపాటలతో నవ్వించేవాడు. ఏది కోరితే అది తెచ్చి ఇచ్చేవాడు. ఏ లోటూ లేకుండా అతణ్ణి పెంచి పెద్ద చేశాడు.
కొన్ని ఏళ్ళ తరువాత... టుంగ్మెన్ కుమారుడు హఠాత్తుగా మరణించాడు. ఆశ్చర్యమేమిటంటే, టుంగ్మెన్ కంటి నుంచి ఒక చుక్క నీరు కూడా రాలేదు. ఆయన ముఖంలో దుఃఖ ఛాయలేవీ కనిపించలేదు. ఆయన భార్య మాత్రం కొడుకు మరణం గురించి దుఃఖించి, దుఃఖించి సొమ్మసిల్లింది. కానీ తనకన్నా తమ కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించిన టుంగ్మెన్లో ఎలాంటి బాధా కనిపించకపోవడం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఒకనాడు భర్తను ‘‘ఏమండీ! మన ఊర్లో ఏ తండ్రీ తన కొడుకును ప్రేమించనంతగా మీరు మన అబ్బాయిని ప్రేమించడం నాకు తెలుసు. అలాంటిది వాడు చనిపోతే మీ కంటిలోంచీ ఒక్క చుక్క నీరు కూడా రాలేదేం?’’ అని అడిగింది. అప్పుడు టుంగ్మెన్ ‘‘కొంతకాలం క్రితం నాకు కొడుకు లేడు. అప్పుడు నేను ఏడవలేదు. ఇప్పుడు వాడు చనిపోయాడు. ఇదివరకటిలా ఇప్పుడు కూడా నాకు కొడుకు లేడు. అప్పుడు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా! అప్పుడు ఏడవని నేను ఇప్పుడు మాత్రం ఎందుకు ఏడవాలి? ఆ రెండు స్థితులూ ఒకటే’’ అన్నాడు.
ఈ కథపై ఓషో (రజనీశ్) వ్యాఖ్యానం చేస్తూ ‘‘ఎంతో ప్రాముఖ్యం ఉన్న చిన్న కథ’’ అని చెప్పారు. సాధారణంగా ఒక వ్యక్తిని మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తే... ఆ వ్యక్తి మరణించినప్పుడు అంత ఎక్కువ దుఃఖం కలుగుతుందని అనుకుంటాం. కానీ ఇది దోషపూరితమైనదంటారు ఓషో. నిజానికి మనం ఒక వ్యక్తిని అమితంగా ప్రేమించి, అతణ్ణి సంతోషపెట్టడానికి ఎప్పుడు ఏమేమి చెయ్యాలో అలా చేసి ఉంటే, ఆ వ్యక్తికి ఎటువంటి కొరతా లేకుండా చూసుకుంటే... మనకు జీవితం పట్ల సరైన అవగాహన ఉన్నప్పుడు... ఆ వ్యక్తి మరణించినా మనకు ఏమాత్రం దుఃఖం కలుగదు. ఆ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అతణ్ణి లేదా ఆమెను సంతోషపెట్టడానికి శాయశక్తులా కృషి చేశాననే సంతృప్తి కూడా ఉంటుంది. అలా చేయకపోయి ఉంటే... చేయలేదనే దుఃఖం కలుగుతుంది.
తల్లితండ్రులను జీవితమంతా ప్రేమించి, గౌరవించి, శ్రద్ధగా సేవించి ఉంటే... వారు వృద్ధాప్యాన్ని పొంది, మరణానికి చేరువైనప్పుడు. ఆ మరణాన్ని వారూ, మనమూ కూడా సంతోషంగా స్వాగతిస్తాం. ఆ అనుబంధం సంపూర్ణమైనదనీ, సఫలమైనదనీ సంతృప్తి చెందుతాం. దుఃఖించం. ‘‘ఇది అనుభవంతో వివేకంతో తెలిసే విషయం’’ అంటారు ఓషో.
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment