Xx5. Xi. 1-3. 040123-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*ధర్మ సందేహం!*
➖➖➖✍️
*సత్య ధర్మాలు మానవ సమాజానికి దారిదీపాలని వేదం చెబుతున్నది.*
*‘సత్యం వద... ధర్మం చర’ అన్న జంట పదాలు అనాదిగా మానవ హృదయాల్లో మారుమోగే జేగంటలు.*
*సత్యమే జయిస్తుంది; ధర్మం ఉన్నచోట జయం ఉంటుంది అంటారు. సత్య ధర్మాలు జోడు గుర్రాలు. వాటి అనుబంధం శివపార్వతుల దాంపత్యం లాంటిది.*
*సత్యం మారదు, ధర్మం మారుతుంది అన్న వాదన ఒకటి వినిపిస్తున్నది.*
*ధర్మం అంటే దృఢమైనది, ధరించేది అని... పద్నాలుగు ధర్మాలున్నాయని శాస్త్రం చెబుతున్నది.*
*రాజధర్మం మొదలు దాసీధర్మం ఉన్నమాట నిజమే కావచ్చు. ఎవరి ధర్మం వారు సమంగా చేస్తే పేచీ ఉండదు.*
*చేయవలసిన పని మాని, చేయరాని పని చేపడితే ధర్మానికి గ్లాని, హాని కలుగుతాయి.*
*అలా జరగడం దాని తప్పు కాదు. దారి తప్పినవారిదే పూచీ. విపరీత బుద్ధులు ఉన్నవారు అదే పనిగా అధర్మాన్ని ఆచరిస్తూ, ప్రోత్సహిస్తూ ఆనందిస్తారు. వీరు ధర్మ ద్రోహులు. మరికొందరు ధర్మాత్ములుగా నటిస్తారు. వీరు ధర్మధ్వజులు.*
*కుఱుక్షేత్రంలో అర్జునుడికి ఎదురైన మొదటి శత్రువు ధర్మసందేహం.*
*శత్రుపక్షంలో కనిపించిన మిత్రపక్షాన్ని చూడగానే పక్షపాతం కలిగింది. అర్జున విషాద యోగం ఆరంభం అయింది. ధర్మసంకటం మొదలైంది పాండవ మధ్యముడికి. జగదేక ధనుర్ధరుడు కర్తవ్యం విస్మరించాడు. గాండీవ ధనుస్సు చేజారింది. కథ అడ్డం తిరిగింది.*
*సారథ్యం మాని ధర్మోపదేశం చేయవలసిన అవసరం ఏర్పడింది పాపం పార్థసారథికి.*
*స్వధర్మం వదలకూడదు, ‘నీవు క్షత్రియుడవు’ అని ఒక్క వాక్యంలో కర్తవ్యం బోధించాడు కృష్ణ పరమాత్మ విజయుడికి.*
*ధర్మం అంటే గుణం.*
*శబ్దం ఆకాశధర్మం.*
*చలనం వాయుధర్మం.*
*ప్రకాశం అగ్నిధర్మం.*
*ప్రవాహం జలధర్మం.*
*గంధం పృథ్వీధర్మం.*
*మౌలిక ధర్మాలు మారవు.*
*దేశ కాల పాత్రలను బట్టి శారీరక, మానసిక, ప్రాణిక ధర్మాలు మారినంత మాత్రాన ధర్మం మారిపోతుందా? మసిబారినా, మసకబారినా, మట్టిలో వాలినా, మాణిక్యం తన నిజధర్మాన్ని వదలదు. నీ ధర్మాన్ని వదలడం మహా పాపం. దానికన్నా చావే మిన్న- అని హెచ్చరించాడు మాధవుడు.*
*పులి లేడిని వేటాడటం జీవన ధర్మం.*
*అది ఆహారానికే పరిమితం. వినోదం కోసం మనిషి పులిని వెంటాడి వధించడం అధర్మం.*
*శరీరపోషణ కోసం హింస చేపట్టడం అధర్మం. ఆత్మరక్షణ కోసం అయితే ధర్మమే.*
*ధర్మాలకు మూలం వేదం. సమాజ శ్రేయస్సు కోరి ఋషులు, దార్శనికులు ధర్మ నిర్ణయం చేశారు. స్మృతుల ద్వారా క్రియాశీల, వ్యవహారపరంగా వాటిని రూపొందించారు. వాటిని అమలు పరచడానికి ఆచార వ్యవహారాలను, ప్రాయశ్చిత్తాలను ప్రతిపాదించారు. శారీరకంగా, మానసికంగా రుచి, శుచి సంతరించుకునేలా నియమ నిబంధనలు నిర్దేశించారు.*
*ఆనాటి కుల ధర్మాలు సామాజిక ప్రగతి కోసం ప్రాజ్ఞులు నిర్ణయించిన వృత్తి ధర్మ విభాగినులు. మతాలు మానసిక ఆత్మోల్లాస రసాయనాలు.*
*ధర్మాన్ని రక్షిస్తే అది మనిషికి సురక్షాకవచం.*
*ధర్మం తప్పితే శిశుపాలుడి పాలిట సుదర్శనచక్రం.*
*ధర్మాన్ని నిలబెట్టడం, కూలగొట్టడం- మనిషికే చెల్లుతుంది. నహుష చక్రవర్తి నూరు యజ్ఞాలు చేసి, ఇంద్ర పదవి సంపాదించాడు.*
*అధర్మానికి పూనుకొని అజగరమై (కొండచిలువ)అడవిపాలయ్యాడు.*
*అతడి కొడుకు యయాతి ధర్మపాలన స్వర్గాధిపతినే మురిపించింది. *
*స్వర్గసుఖాలను తిరస్కరించి భూలోక స్వర్గాన్ని ఆవిష్కరించాడు. *
*అదే మానవ ‘ధర్మం!’*✍️
- ఉప్పు రాఘవేంద్రరావు.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment