Friday, March 3, 2023

 "కలలో జరిగినవి కల్లలే అని మెలకువ రాగానే తెలిసిపోతుంది.. మరి మెలకువలో జరిగేవి వేదనలుగా మిగిలిపోతున్నాయి కదా ?"
"కలలో ఎలాగైతే సంఘటనలు మనల్ని కలవర పెడుతున్నాయో, ఇలలో కూడా సంఘటనలు అలాగే కలవరపెడుతున్నాయి. కల విషయంలో అది నాకు ఏర్పడింది కాదు అన్న వివేకం ఎలాగైతే ఆ కలవరపాటును కొనసాగనివ్వటంలేదో, ఇలలో కూడా ఆ సత్యం అర్ధమైతే దుఃఖం కొనసాగింపు ఉండదు. ఒక వ్యక్తికి కూతురు పెళ్ళి అయినట్లు కల వచ్చింది. పెళ్ళిలో ఎవరో తమకు మర్యాదలు సరిగా జరగలేదని అలిగారు. ఆ విషయం అప్పటికి ఆందోళన కలిగించే విషయమే గానీ కొనసాగేది కాదు. అందుకు కారణం అవన్నీ నాకు నిజంగా ఏర్పడినవి కావు కదా అన్న సత్యం అర్థం కావటమే ! మరి మన నిత్య జీవితంలో కూడా జరిగే పరిణామాలు అన్నీ నిజంగా ఎవరికీ అని ఆలోచిస్తే మనకు మెలకువలో కలిగే వేదనలు కూడా కొనసాగవు. ఏర్పడే బాధలైనా, సంతోషాలైనా నిజంగా నాకు ఏర్పడినవే అయితే అవి గాఢనిద్రలో కూడా నన్ను అంటిపెట్టుకుని ఉండాలి. కానీ అలా జరగడం లేదు కదా ! ఎవరైనా మనల్ని చెంప మీద కొడితే బాధ కలగడం సహజం. ఆ బాధ కూడా నొప్పితోపాటు పాటు పోవాలి. నొప్పి పోతుంది కానీ బాధ వెంటాడుతుంది. కారణం ఏమిటంటే మనమే దానిని అలా జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మనం ఎన్ని రోజులు బాధపడ్డా అది నిజంగా సంఘటనతో సమానం కాదు కదా ? మనకు ఈ వివేకం కలిగితే విషయాల వల్ల ఏర్పడుతున్న వేదనల నుండి విముక్తి లభిస్తుంది. అందుకు సులభమైన తరుణోపాయం భగవాన్ శ్రీరమణమహర్షి మహర్షి చూపించిన విచారణమార్గమే !"*

"వర్తమానంలో వాటిల్లుతున్న అనుభవాలు, జ్ఞాపకాలుగా మారి, భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంటే ఇక శాంతి ఎలా వస్తుంది ?"
"వర్తమానంలో సజావుగా జీవించే ప్రయత్నం చెయ్యాలి. మనకు గతాన్ని గురించి బాధ, భవిష్యత్తు గురించిన భయము, శాంతి లేకుండా చేస్తున్నాయి. ఇలలో మనకు ఏర్పడుతున్న అనుభవాల వల్ల కలిగే జ్ఞాపకాలన్నీ కలిసి భూత, భవిష్యత్తుల విషయంలో మనకు అనేక భావాలు కలిగిస్తున్నాయి. మనకు నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలు, బాధలు, దుఃఖాల కన్నా, జ్ఞాపకాలతో ఏర్పడే ఈ దుఃఖాల మోత ఎక్కువైంది. వీటికోసం మనం అనేక తాత్కాలిక తరణోపాయాలను ఆలోచిస్తున్నాం. ప్రతి తరుణోపాయంలోనూ కనిపించేది ఒక్కటే ధ్యాస మార్చటం. కలలోను, గాఢనిద్రలోనూ, ఇలలోనూ ఉన్నది నేనే. కలలో జరిగిన సుఖదుఃఖాలను వెంటనే మర్చిపోయినట్లుగా ఇలలో మర్చిపోలేక పోతున్నాం. అందుకు కారణం ఇలలో జరిగినవన్నీ నాకే జరిగాయని భావించటమే. కానీ నిజంగా అలా లేదు. గాఢనిద్రతో పోల్చుకుంటే కలకు, ఇలకు పెద్ద తేడా లేదు. అందుకే మెలకువ లక్షణాలను అర్థం చేసుకుంటే మనం సజావుగా వర్తమానంలో జీవించగలుగుతాం !"

No comments:

Post a Comment