Sunday, October 20, 2024

*****ఆత్రేయగీత* రెండవ భాగం “పరావిద్య - అపరావిద్య" - 2వ భాగము

 *ఆత్రేయగీత*

రెండవ భాగం

“పరావిద్య - అపరావిద్య" - 2వ భాగము

శ్రీ శాస్త్రి ఆత్రేయ 

అపరావిద్య - నాలుగు వేదాలలో, మొదటి మూడు భాగాలలో పేర్కొన్న కర్మలు.

పరావిద్య - నాలుగు వేదాలలో, చివరి భాగమైన ఉపనిషత్తులలో పేర్కొన్న జ్ఞానము.

ప్రతిజీవుడు సచ్చిదానంద శివస్వరూపుడే! ఆ సత్యాన్ని గ్రహించాలంటే ఆత్మభావంతో సాధనచెయ్యాలి.

ఎవరైతే అన్ని జీవులను ఆత్మలోనూ, ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి యెవ్వరియందు ద్వేషభావం వుండదు. ఆత్మే అన్ని జీవరాసులుగా వున్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా వుంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి, విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసుపోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడకు పోగలదు. ఒక్కచోటే వుంటుంది. అందువలన బాధగాని, మోహంగాని, ద్వేషంగాని కలగవు.

ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టీ, వ్యక్తివ్యక్తికీ ప్రపంచస్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలివ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ‌ మారలేదు. మార్పంతా చూసేవాడిని బట్టే వుంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తియొక్క మనసు విశాలమై విశ్వమంతటితోనూ ఏకం అవుతుంది.

అతడు అన్నింటి అంతరార్థాన్నీ గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనీషి, మనీషి అంటే మనసును వశం చేసుకొన్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు, అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందినవాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతడు
కేవలం ఆత్మ / పరమాత్మనే విశ్వసిస్తాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకొన్నవాడు కాబట్టి దేనికీ లొంగడు.

ఆత్మ స్థిరమైనదని, మనస్సు కంటే వేగవంతమైనదని, ఇంద్రియాలు దాన్ని పొందలేవు. అంటే విశ్వమంతా వ్యాపించియున్న ఆత్మ ఎక్కడకు కదలగలదు? కాబట్టి ఈ మనసు, శరీరం అన్నీ అందులో భాగమే కదా! అంటే మనసు ఒక వస్తువును చేరకముందే, ఆత్మ అక్కడ ప్రత్యక్షమౌతుంది, అంటే ఆత్మ స్థిరముగా ఉంటూనే మనను కన్నా వేగవంతమైంది.

ఇంద్రియాలు ఆత్మను గ్రహించలేవు కారణం చెవి, చర్మము, నాలుక, కన్ను, ముక్కు ఇత్యాది జ్ఞానేంద్రియాలు బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడానికే సృష్టింపబడ్డాయి. ఇవి పనిచేయాలంటే కదలని వస్తువు ఒకటి ఆధారముగా వుండాలి. ఒక వాహనం కదలాలంటే కదలని రోడ్డు, ఒక చలనచిత్రం చూడాలంటే ఒక కదలని తెర వుండాలికదా! అంటే ప్రాణం అనేది ఆత్మను ఆధారముగా చేసుకొని
ఇంద్రియాలు పనిచేసేటట్టు చేస్తుంది.

ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టీ, అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట, కాని ఈ విషయాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకోలేనప్పుడు అది మనకు దూరంగా వుంటుందని అర్థం. ఆత్మగా అది మనలో వుండి, పరమాత్మగా మన బయట ఉందన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది.

No comments:

Post a Comment