Friday, October 4, 2024

జ్ఞానసంపద

 ఆత్మీయ మిత్రులందరికీ శుభోదయం 🌱🌲🪴🌷🌾🌻

# జ్ఞానసంపద

🍁మానవ వికాస పరిణామ క్రమంలో మనిషి
ఆలోచనావిధానం అనేక మార్పులు చెందుతూ
వచ్చింది. ఆదిలో ఆకలి తీరితే
చాలనుకున్నాడు. తరవాత ఉండటానికి గూడు,
ఒంటిమీద బట్టను కోరుకున్నాడు. ఈ కోరికల
చిట్టా నెమ్మదిగా ఆస్తులు కూడబెట్టడం వరకూ
చేరింది. చివరికి జీవితమంటే ధనం
సంపాదించడం కోసం అన్నట్టయింది. ఏ
జ్ఞానంతో అయితే మానవ జీవితం వికాస
పరిణామాలు చెందిందో ఆ జ్ఞానం మరుగున
పడిపోయింది. జ్ఞానమే అసలు సంపదనే
వాస్తవం ఉనికిని కోల్పోయింది. 

🍁దైనందిన జీవితంలో మనిషి చేసే ప్రతి పనికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్ఞానమే ఆధారభూతం. చెడ్డ పనులు చేయడం చాలా సులభం. మంచి చేయడమే కష్టం. సులభమైనా సరే చెడ్డ పనులు చేయడం మంచిది కాదని తెలుసుకోవడమే జ్ఞానం. కొన్ని చెడు పనులు చేయడం వల్ల తాత్కాలికంగా లబ్ధి చేకూరుతుంది. అలాంటి సందర్భాల్లో ప్రలోభానికి గురై తప్పు చేయకూడదన్న సముచిత నిర్ణయం తీసుకోవడానికి జ్ఞానమే తోడ్పడుతుంది.

🍁యుద్ధానికి దిగినవారు యుద్ధనీతి పాటించాలి. కానీ, సాధారణంగా ఎవరూ పాటించరు. శివాజీ యుద్ధనీతిని విడిచిపెట్టలేదు. స్త్రీల జోలికి పోలేదు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయలేదు. ఇది సంస్కార రూపంలో ఉన్న శివాజీ జ్ఞానసంపద. నిజమైన జ్ఞానం మనిషిని ఎప్పుడూ ఉన్నత శిఖరాల దిశగా నడిపిస్తుంది.

🍁జ్ఞానం ఎప్పుడూ యథార్థస్థితికి దగ్గరగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు తెలుసుకోవడానికి దారిదీపంలా ఉపయోగపడుతుంది. మంచిచెడ్డల విచక్షణ చేసుకోవడానికి జ్ఞానమే ప్రథమ సోపానం. వివేకానందుడు తాను చెప్పిన బోధనలను కేవలం వినడమే కాకుండా ఆచరించమని కోరాడు. ఆయన వేదాంతం భౌతిక దృష్టితో కూడి ఉంటుంది. విశ్వమానవ ప్రేమ వంటి విషయాలు మాట్లాడటం కన్నా వాటిని ఆచరణలో చూపమన్నాడు వివేకానందుడు. వట్టి మాటలతో మానవాళికి మేలు జరగడo ఆచరణతోనే వందశాతం ప్రయోజనం కలుగుతుంది. 
జ్ఞానసముపార్జన ద్వారానే
వివేకానందుడు ఈ సందేశం ఇవ్వగలిగాడు.

🍁మానవ జీవితానికి అనేక కోణాలు. అందులో
కొన్ని మంచివి. మరికొన్ని చెడ్డవి. ఇవన్నీ మనిషిని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. పండ్ల బుట్టలోంచి నాణ్యమైనవి ఎంచుకున్నట్టు జీవితానికి ఉపయుక్తమైన వాటినే మనం తీసుకోవాలి. ఈ ఎంపిక జ్ఞానంతో కూడినదైనప్పుడే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. జీవించడానికి అనేక మార్గాలున్నాయి. ఎటువంటి మార్గాన్ని ఎన్నుకుంటాం అనేది మన ఆలోచనాసరళి మీద ఆధారపడి ఉంటుంది. సేవామార్గాన్ని ఎంచుకున్న మదర్ థెరెసా విశ్వవిఖ్యాతులయ్యారు. 

🍁జ్ఞానాన్ని కాంతితో పోల్చవచ్చు. వెలుతురు  లేని మార్గంలో గమ్యం అగోచరమైనట్లు జ్ఞానం లేని మనుగడకు అర్థం ఉండదు. ఎవరైతే జ్ఞానపథంలో పయనిస్తారో వారు ధన్యులు. ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుందో వారు నిజమైన సంపన్నులు.

🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment