Monday, January 20, 2025




 సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ ఫేస్బుక్ వాల్ నుండీ

*****

1000/- పెట్టి ఈపుస్తకం కొన్నాను ఈ ఆమ్నిబస్ ఎడిషన్‌ని. 

ఇదివరకే రోడ్డుమీద పదిరూపాయలకు కొన్న నా పాత కాపీ నా వద్ద వున్నా ఈ పుస్తకం నా పిల్లలకోసం కొన్నా

ఈ పుస్తకం కొనడానికి ప్రేరణ, ఇదిగో ఇదే రచయిత రాసిన ఒక వ్యాసం నుండి కొన్ని ముఖ్యమైన మాటలు మీకోసం యధాతధంగా- 

***********

ఒకాయన 
నా మిట్టూరోడి పుస్తకాలు నాలుగు కొనుక్కుని, 
నా జేబీలో 500 రూపాయలు కుక్కి 
" పాపం మీకు ఉద్యోగం కూడా లేదుగదా. మీకేదో హెల్ప్ అయినట్టు వుంటుందని.." అనేసి 
నా కల్లా పొడుగ్గా చూసినాడు.

చూసినారా? 
నా "ప్రొడక్టు"ను నాకు సహాయం చేయడానికి ఈయన కొనుక్కుంటున్నాడు. 
అదాయన మంచితనం కావచ్చు. 
కానీ, నాకు అవమానం. 
అట్లాంటి వాళ్లు ఎవ్వరూ నా పుస్తకాలు కొనుక్కోకూడదు. 
ఇది నా రోషం!

కర్ణాటక ప్రభుత్వాన్ని కాస్త ఆర్థికంగా ఆదుకున్నట్టు వుటుందని కాదు మనం మన దేహాలకు మైసూర్ శాండిల్ సబ్బు పూసుకునేది, దుర్వాసనను పోగొట్టుకోవడానికి!

*********

ప్రజా సాహిత్యం చదవడం వల్లా, చాలా మంచి రసాయనాలు వూరడం వల్లా మనకూ, మన కుటుంబాలకూ ఎన్నో ప్రయోజనాలున్నయి.
----

ఇంటర్ నుండి కాలేజీకే వెళ్లకుండా ఇంట్లోనే చదువుకొని ఐఏఎస్ పరీక్ష రాసి ర్యాంకర్గా నేషనల్ లెవల్లో నిలిచింది (తన కొలీగ్ కూతురైన దివ్యాంగురాలి గురించి). 

 అంటే నా పుస్తకాలు చదివేస్తే ఐఏయెస్‌లు అయిపోతారనేది కాదు నేనిక్కడ చెప్పేది! 

నేను మా వూరిమింద రాసిన పుస్తకాన్ని గానీ, స్కూల్ ఎడ్యుకేషన్ మింద రాసిన పుస్తకాలని కాని ఎందుకోసం మీరంతా శ్రద్దగా చదువుకోవాలంటే- చెప్తా వినండి.

******

నేనేగాని పార్లమెంటునైతే ఒక చట్టం తీసుకొస్తాను. అదేమంటే ఎలక్షన్లో నిలబడాలనుకుంటే అభ్యర్థులంతా ముందు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి. 

ఆ టెస్ట్ దేనిమీద వుంటుందంటే ప్రజల సాధకబాధకాల మీద! 

అప్పుడు ఆ టెస్ట్ పాసయ్యి ఎన్నికల్లో నిలబడాలంటే వాళ్లు ప్రజాసాహిత్యం అనే సిలబస్ వెతుక్కుని చదవక తప్పదు. 

అలా పాసయ్యి ఎమ్మెల్యేలూ, ఎంపీలూ అయితే

మునికన్నడు లాంటి బక్కరైతు కరెంటు కనెషన్ కోసం ఎమ్మెల్యే దగ్గరికి పోతే 
లంచం రూపాయి అడక్కుండా మునికన్నడ్ని కూర్చోబెట్టి పనిచేసిపెట్టి భోజనం అదీ పెట్టి సగౌరంగా, 
"మీవల్లేనయ్యా మాబోటివాళ్లం నాలుగు మెతుకులు రోజూ తినగలుగుతున్నం" అని చెప్పి పంపిస్తాడు.

పౌషికాహార లోపం వల్ల ఊపిరి పోగొట్టుకున్న వూదోణ్ణి గురించి తెలిసిన ఏ అధికారి గానీ, ఏ ప్రజా ప్రతినిధి గానీ సర్వశిక్ష అభియాన్ నిధుల నుంచీ, విద్యార్థినీ విద్యార్థుల సంక్షేమ హాస్టళ్ల నిధుల నుంచీ ఒక్క రూపాయి తినడు గాక తినడు.

********

పోకిరి సినిమా చూడ్డానికి పిల్లలేడిస్తే అది దేశానికి అరిష్టం. 

 ఇట్లాంటి పుస్తకాల కోసం పిల్లలు ఏడిస్తే అది సౌభాగ్యం. 

ఈ పుస్తకాలు మీ ఇండ్లలో వుంటే మీకు జరిగబోయే నష్టం ఏమైనా వుంటే చెప్పండి.

********

త్రిషమీదా, సరళమీదా, ఆ వెంకటేశ్వర స్వామి మీదా ఒక్క నిమిషంలో వుత్పలమాలలో ఒక పద్యం చెప్పమని ఆ ఆసామి సరదా పడతాడు. అవధాన చక్రవర్తులెవరైనా సరే, అరనిమిషంలో ఈ ముగ్గురినీ బంధించి పద్యం వినిపించేస్తారు.

ఆంధ్రదేశం ఏ కర్మ, ప్రపంచ దేశాల్లో వున్న తెలుగు ఆసామిలంతా "శభాష్ సరస్వతీ పుత్రుడా" అని ఎవరికి తోచిన గండపెండేరాలూ వారు తొడుగుతారు. 

కళాకారులకు అట్లా సత్కారం జరగడం మంచిదే. అప్పటికే స్వయంగా సంపన్నులైనప్పటికీ, కార్లున్నప్పటికీ, ఎసుట్లో బియానికి తడుముకునే అవసరం లేనప్పటికీ తలా కొంచెం తోచింది వారికి సమర్పించుకొంటున్నారు. 

అయితే నారప్ప కొడుకైన ఈ రైతుబిడ్డ దగ్గరికి వచ్చేసరికి కత వేరే రకంగా అడ్డం తిరుగుతోంది. 

రైతులమీద గారడీ విద్య పరదర్శించి పద్యాలు చెప్పలేను. 

నిదానంగా, నీరసంగా, దిగులుగా, పది సబ్బులు వేసి రుద్దింగ పోని బీద వాసనతో, మీ అందరికీ అర్థమయ్యేలాగా.. వరికోతలు కోసిగానీ, పనగొట్టి గానీ, శెనగచెట్లు పెరికిగానీ.. రాయలేని పుస్తకమిది.

********

ఒకసారి నేను అట్లా వైట్ అండ్ వైట్ వేసుకుని (దాయాది చనిపోతే పెట్టిన దినం నాటి బట్టలు వేసుకుని) పోతుంటే, "నీ పని భలేవుందే. పిల్లల దగ్గరకెళ్ళి పుస్తకాలమ్మి డబ్బులు బాగానే పెరుక్కుంటున్నావంట గదా" అని ఒక జర్నలిస్టు ఎగతాళి చేశినాడు.

ఒక రచయిత అయితే, నా కాళ్లకు బూట్లు చూసి, "కాళ్లకు బూట్లు! అబ్బో! సూటు కూడా కుట్టించుకోక పోయారా?" అని వెక్కిరించినాడు.

నేను ఆ ప్రొఫెసర్ కం రచయితతో, "అరికాళ్లు దబ్బ్బలు దబ్బలుగా పగిలిపోతే ఈ బూటు వేసుకోవాల్సి వచ్చింది సార్" అని తలొంచుకుని సంజాయిషీ ఇచ్చినాను. 

*********

ప్రజలకు... పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆ బలగోపాలానికి ఎంతగానో ఉపయోగపడే ఇన్ని పుస్తకాలు రాసినా... నా అప్పు నేను తీర్చుకోలేని స్థితికి నెట్టి.. అజాను బాహువైన ఈ చెక్కు ముందు (సన్మానంచేస్తూ ఇచ్చింది!) నన్నుమరుగుజ్జులా, నంగినంగిగా, బిత్తర బిత్తరగా నిలబెట్టిన ఆంధ్రదేశంలోని యావనంది పాఠకులను నేను క్షమించలేకపోతున్నాను.

బూతుపాటలు, బూతు నవలలు రాసినవాళ్లను బంగళాల్లో కూర్చోబెట్టి, నన్ను అద్దెకొంపలో పడేసినందుకు కూడా చాలా నిష్టూరపోతున్నాను. "బీదవారి ఙ్ఞానం తృణీకరించబడును" అనే బైబిలు వాక్యం నా విషయంలో అతికినట్టు సరిపోతుంది.
---

భవిష్యత్తులో నా గుండెకు ఆపరేషన్ చేసుకోవల్సి వస్తే ఇలా చందాలతో గాక, దరిద్రంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి గాక, ఇంకా వికారంగా కమ్మసంఘం వారి నిధులనుంచి కాకుండా.. నా రెక్కల కష్టంతో, నేను పుస్తకాలు అమ్ముతూ వచ్చిన డబ్బులతొ .. ఆ ఆపరేషన్ ఏదో చేయించుకొనే భాగ్యాన్ని కల్పించవలసిందిగా మీరంతా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను.

**********

ఉపసంహారం: 

ఈ పుస్తకం నా బీటెక్ చదివే కొడుకులకోసం కొన్నాను. 

మొన్న సంక్రాంతికి వచ్చినప్పుడు పెద్దోడు తీసుకుపోయాడు. 

రోజూ ఒక ఒక్క కథైనా చదివుతాడట నిద్రపోయే ముందు. 

వాడన్నాడు, నువ్వు చెప్పినట్లు నవ్వుతూ చదివినట్లే వుంటుంది, చివరకు కన్నీళ్ళు వస్తాయి అన్నాడు. 

నిన్ననే చెప్పాడు "వాడు వాళ్లమ్మని పట్టుకుని ఏడ్చింది చదివి నేనూ ఏడ్చేశాను నిన్నరాత్రి" అని. 
 
ఎదుటివారిజీవితాలకు స్పందించేలా పెంచడం కన్నా పిల్లలపెంపకంలో పెద్ద లక్ష్యం ఏముంటుంది? అటువంటి పుస్తకాలకన్నా గొప్ప పుస్తకాలు ఏముంటాయి?!

No comments:

Post a Comment