Friday, January 3, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

64. అసావాదిత్యో బ్రహ్మా

ఈ ఆదిత్యుడే బ్రహ్మము (అథర్వణవేదం)

సనాతన ధర్మం సూర్యోపాసనను ప్రధానంగా బోధిస్తోంది. సర్వదేవతాశక్తులు సూర్యునిలోనే ఉన్నాయి. సౌరశక్తి వివిధ విధాలుగా పృథ్విపై ప్రసరించి పనిచేస్తోంది.
ఈ భూమిలో ప్రతి వస్తువు తన ఉనికినీ, రూపురేఖల్నీ సూర్యశక్తి నుండే గ్రహిస్తోంది.వృక్షజల సస్యాదులే కాక, జంతుజాలం, మానవులు అందరూ ప్రాణశక్తిని సూర్యుని నుండే గ్రహిస్తున్నారు.

(పరమాత్మ లక్షణాలన్నీ సూర్యునిలో గోచరిస్తాయి. “ఒక సూర్యుడు
సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక", దేనికీ అంటని సాక్షి
లక్షణం, సర్వశక్తిప్రదాయకత్వం, సర్వసమత్వం- ఇవన్నీ పరమాత్మ
లక్షణాలే. ఇవి ఆదిత్యునిలో గోచరిస్తాయి.

“ఆదిత్య” శబ్దానికి ప్రధానంగా “అఖండమైన తేజస్సు” అని అర్థం.
"అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోయం" అని ఆత్మ 'అఖండమైన
జ్యోతి'గా 'గీత'లో వర్ణింపబడింది.)

వర్షప్రదాత, అన్నప్రదాత సూర్యభగవానుడు. సూర్యుడొక్కడే అయినా ఆయన నుండి లభించే కిరణజాలాల్లో అనేకానేక శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. వాటి నుండే
వివిధ పదార్థాలు, వాటి ప్రయోజనాలు ఏర్పడుతున్నాయి.

విష్ణు, రుద్ర, బ్రహ్మ, అరుణ(లలిత), సుబ్రహ్మణ్య, గణేశ, గోవిన్ద, శివ, రవి,
భాను ఇవన్నీ సూర్యుని తెలియజేసే నామాలు. ఈశ్వర చైతన్యం మనకు
సూర్యరూపంలో లభిస్తుంది. అందుకే పరమేశ్వరుని తమ అభీష్ట దేవతారూపాలలో ఆరాధించే ఎవరైనా ఆ రూపాన్ని సూర్యమండలంలో ధ్యానించి ఉపాసించడం సర్వశ్రేష్టంగా అన్ని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

సర్వదేవతామయుడైన పరబ్రహ్మయే 'ఆదిత్యుడు' అని వేదం స్పష్టం చేస్తోంది.అగ్నియందు సర్వదేవతలను ఆవాహనం చేసి ఆరాధించే సనాతన సంస్కృతి-సూర్యుని సహజాగ్నిగా, బ్రహ్మాగ్నిగా భావించింది. ఆయనలో సర్వదేవతలను సంభావించి
నమస్కరించితే చాలు-సర్వదైవాలూ సంతోషిస్తారు. కర్మసాక్షి, ప్రత్యక్ష బంధువు,జగచ్చక్షువు-అంటూ భారతీయులు ఎంతో ప్రేమగా ఆరాధించుకునే దైవం సూర్యభగవానుడు.

సూర్యమండలం వేదమండలం, దైవమండలం. 'సూర్యనారాయణుడు' అని విష్ణువుగా ఆరాధించినా, 'భానుమండలమధ్యస్థా' అని అరుణగా లలితాంబను కొలుచుకున్నా,సౌరమండల మధ్యస్థుడైన 'సాంబశివుని'గా ఉపాసించినా, గాయత్రిగా అర్చించినా
సూర్యునిలోని పరమేశ్వరచైతన్యంలో మన వ్యష్టి చైతన్యాన్ని అనుసంధానం చేయడమే.తద్వారా మన ప్రాణశక్తి దివ్యశక్తితో తేజరిల్లుతుంది.

త్రిసంధ్యలలో అందరూ తమ అభీష్టదైవాన్ని సూర్యుని యందు ధ్యానించి ఆరాధించాలని వైదికశాస్త్రాలు వివరిస్తున్నాయి. 'సూర్యునిలో నన్ను భావించి
ఆరాధించేవారు-స్వగృహంలోకి యజమాని ప్రవేశించినట్లుగా నాయందు సాయుజ్యం
చెందుతారు' అని పద్మపురాణంలో శివవచనం.

సూర్యమండలాధిష్ఠాన దైవం - సప్తాశ్వరథారూఢుడు. “ఏకో అశ్వో సప్త నామ”- ఒకే అశ్వం ఏడుగా వ్యవహరింపబడుతోంది అని వేదం సుస్పష్టంగా బోధించింది.
'అశ్వం' అంటే వ్యాపించి (వేగంగా ప్రయాణించునది' అని అర్థం. ఇది కాంతికిరణాన్ని తెలియజేస్తుంది. ఒకే కాంతి ఏడుగా విశ్లేషింపబడుతుందని - అవే గుఱ్ఱాలుగా అభివర్ణించబడ్డాయని వేదహృదయం. శబ్దశక్తికి కూడా సూర్యుడే ఆధారం. అందుకే ఆ ఏడుగుఱ్ఱాలను గాయిత్రీ, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి వంటి ఏడు ఛందస్సులుగా వేదం వర్ణించింది.

సూర్యుడు 12 మాసాలలో 12 విధాలుగా ప్రసరించే చైతన్యమే ద్వాదశాదిత్యస్వరూపాలు. సర్వగ్రహాలను శాసించే సూర్యుడు మహేశ్వరుడే కదా! 

అయితే- ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి. ఊళ్ళో అందరి ఇళ్ళల్లో దీపాలున్నా మన ఇంటిదీపం మనకు ముఖ్యం. అలాగే మన పుడమికి గోచరించే సూర్యుడే మనకు దైవం. మన ఇంటి దీపాలలో మన వెలుగును గ్రహించినట్లుగా,
మనకు గోచరించే సూర్యునిలో భగవంతుడు మనకోసం ప్రతిష్ఠితుడై ఉన్నాడు.

పరమాత్మ లక్షణాలన్నీ సూర్యునిలో గోచరిస్తాయి. "ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలిక", దేనికీ అంటని సాక్షి లక్షణం, సర్వశక్తిప్రదాయకత్వం,
సర్వసమత్వం - ఇవన్నీ పరమాత్మ లక్షణాలే. ఇవి ఆదిత్యునిలో గోచరిస్తాయి.

"ఆదిత్య" శబ్దానికి ప్రధానంగా “అఖండమైన తేజస్సు" అని అర్థం.
“అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోయం" అని ఆత్మ 'అఖండమైన జ్యోతి'గా 'గీత'లో వర్ణింపబడింది.

"సూర్య ఆత్మా జగతః" - జగత్తుకే 'ఆత్మ' సూర్యుడు. దేహానికి ఆత్మ ఎలాగో, ప్రపంచానికి ఆదిత్యుడు అలాగ. సూర్యోపాసన మనలోని ఆత్మను ఆవిష్కరించుకొనే
విద్య. బుద్ధిగా, దశ ఇంద్రియాలలో చైతన్యంగా ప్రసరించే ఆత్మ-ద్వాదశాదిత్య
స్వరూపం కదా! ఉపనిషద్విద్య సైతం "అంతరాదిత్యోపాసన"గా మనలోని ఆదిత్య తేజాన్ని గ్రహించమన్నది.   

No comments:

Post a Comment