☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
77. సహృదయం సాంమనస్యమవిద్వేషం కృణోమి వః
హృదయాలు కలిసి మంచి మనస్సుతో విద్వేషాలు లేకుండా మీరంతా ఉండాలి(అథర్వవేదం)
'భావన' అనే అంశానికి చాలా ప్రాధాన్యముంది. మంచి సంకల్పం, మంచి ఆకాంక్ష-ఇవన్నీ భావనాపరమైన విషయాలు. అందువల్లనే మంచిని కోరుకునే
దివ్యభావాలు వైదిక సాహిత్యంలో పుంఖానుపుంఖాలుగా వెలువడ్డాయి.
'శుభాకాంక్ష' అనే సంస్కృతి సలక్షణంగా వేదాలలో గోచరిస్తుంది. ప్రతి వ్యక్తీ ఒక చైతన్యశక్తి. వ్యక్తి నుంచి ప్రసరించే భావనకీ, వాక్కుకీ, దృష్టికీ శక్తి ఉంటుందనడానికి కారణం అతనిలో ప్రసరించే అద్భుత చైతన్యమే. ఈ చైతన్యాన్ని పవిత్ర సాధనతో,నియమపాలనతో శుద్ధం చేసుకున్నవాని వ్యక్తిత్వం శక్తిమంతమవుతుంది. అటువంటి వాని భావ-వాక్ - దృష్టులు ప్రపంచాన్ని మంచిగా ప్రభావితం చేస్తాయి. అంటే సత్సంస్కారాలు గల వ్యక్తి ప్రకటించే ఆకాంక్షలు సత్ప్రభావాన్ని కలిగిస్తాయి.
దుష్టసంస్కారాలు దుష్ప్రభావానికి కారణమవుతాయి.
( గగనం, భువనం, పరిసరాలు, పంటపొలాలు, వృక్షాలు, నదులు,
సముద్రం అన్నీ శాంతంగా ఉండాలి... అనే విస్తృతమైన శాంతిమంత్రాలు సకల విశ్వంతో మానవ సంబంధం ఎలా ఉందో స్పష్టం చేస్తాయి. మనిషికీ, ప్రకృతికీ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తాయి.తద్వారా ప్రపంచంతో వ్యక్తికి ఉన్న విడదీయరాని ప్రేమబంధాన్ని బలీయం చేస్తాయి.)
ఈ మంచి, చెడుల భావనా ప్రకంపనలు వాతావరణాన్నీ, ప్రకృతిని సైతం స్పందింపజేస్తాయి. ఈ సూక్ష్మరహస్యం తెలిసిన వైదిక ఋషులు 'శుభాకాంక్షల'ను
ఒక అద్భుత ప్రక్రియగా మలిచారు.
శుభాకాంక్షల పేరుతో వేలంవెర్రి హడావుడి, వ్యాపారం కాకుండా ఒక సక్రమ పంథాలో ప్రకృతినీ, ప్రకృతిశక్తుల్నీ శాసించే దేవతాశక్తుల్ని స్పందింపజేసి, విశ్వహితాన్ని కలిగించే దిశగా ఈ శుభాకాంక్షలు ప్రాచీన భారతావనిలో వర్థిల్లాయి. భావనాశక్తిని శబ్దశక్తితో ప్రకటించి ఆకాంక్షలను మంత్రాలుగా ప్రతిష్ఠించారు.
సనాతనమైన ఈ భావనా పరంపర గమనిస్తే - అత్యంత ప్రాచీనకాలంలో ఇంత పరిపక్వతని సాధించిన ఆర్షవైభవానికి జోహారులర్పించకుండా ఉండలేం.
భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
“చెవులతో మంచినే వినాలి - కనులతో మంచినే చూడాలి" అని అంతరార్థం.
ఇందులో మనకు జరిగే మంచి అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కలిగే
మంచితనమే. “మంచి వార్తలు వినాలి. మంచి దృశ్యాలు చూడాలి" అనే భావనలో
“లోకంలో మంచి సంఘటనలే జరగాలి" అనే ఆంతర్యం దాగి ఉంది.
( ఈ దేశంలో మాటలో పొరపాటున కూడా అమంగళాలు రాకుండా
జాగ్రత్త పడేవారు. ఏదైనా వస్తువు లేకపోతే 'నిండుకుంది' అంటాం,
దీపం ఆరితే 'ఆరిపోయింది' అనే అపశబ్దం వాడకూడదనీ,
"కొండెక్కింది, ఘనమయ్యింది" వంటి మాటల్ని వాడేవారు. అంటే
శుభాకాంక్షను ఏదో ఒక లాంఛనంగా కాక, నిత్య జీవిత విధానంగా
మన సంస్కృతి మలచుకుంది.)
"ద్యౌః శాంతిః అంతరిక్షః శాంతిః పృథివీ శాంతిః వనస్పతయః శాంతిః”...
గగనం, భువనం, పరిసరాలు, పంటపొలాలు, వృక్షాలు, నదులు, సముద్రం అన్నీ శాంతంగా ఉండాలి... అనే విస్తృతమైన శాంతిమంత్రాలు సకల విశ్వంతో మానవ సంబంధం ఎలా ఉందో స్పష్టం చేస్తాయి. మనిషికీ, ప్రకృతికీ ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తాయి. తద్వారా ప్రపంచంతో వ్యక్తికి ఉన్న విడదీయరాని ప్రేమబంధాన్ని బలీయం చేస్తాయి.
“సంగచ్ఛధ్వం సంవదధ్వం” - కలిసి నడుద్దాం, కలిసి పలుకుదాం. సుమనస్సు, సౌమనస్యం - మంచి మనస్సుతో అందరం ఏక హృదయులమై బ్రతుకుదాం -
వంటి భావనలో కలిసి బ్రతికీ, సంపదలను పంచుకు బ్రతికే సమానత్వ ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
“పశ్యేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతమ్” వంటి మంత్రాలు, “బ్రతికున్నంతకాలం ఇంద్రియాలన్నీ సక్రమంగా
పనిచేస్తూ ఆనందంగా బ్రతుకుదాం” అనే గొప్ప శుభాకాంక్షలు ప్రకటిస్తున్నాయి.నిత్యం మంచినే సంకల్పించమని, మంచినే భావించమనీ బోధించాయి పురాణాలు.విపరీత ప్రభావాలను మనసులోకి రానీయవద్దని, ఎంత కోపం వచ్చినా అమంగళాలను
పలుకవద్దనీ వేదపురాణాలు శాసించాయి.
అందుకే ఈ దేశంలో మాటలో పొరపాటున కూడా అమంగళాలు రాకుండా జాగ్రత్త పడేవారు. ఏదైనా వస్తువు లేకపోతే 'నిండుకుంది' అంటాం, దీపం ఆరితే 'ఆరిపోయింది' అనే అపశబ్దం వాడకూడదనీ, “కొండెక్కింది, ఘనమయ్యింది" వంటి
మాటల్ని వాడేవారు. అంటే శుభాకాంక్షను ఏదో ఒక లాంఛనంగా కాక, నిత్య జీవిత విధానంగా మన సంస్కృతి మలచుకుంది.
“మధు వాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః" - గాలి అమృతం వలె, నదులు
అమృతం వలె స్వచ్ఛమై, ఆహ్లాదకరమై అనుగ్రహించాలి".
“సూషాచమే సుదినంచమే” - మంచి ఉషస్సు, మంచిరోజు లభించాలి" - ఇలా సనాతన శుభకామనలు అనంతం.
మంచి భావాలను నిరంతరం కలిగి ఉంటే మన హృదయపుటంతరాళాలలో
క్రమంగా ఇసుమంతైనా దుష్టసంస్కారాలు మిగలవు. అందుకు నిత్య శుభాకాంక్షల జీవితాన్ని గడిపే విధంగా సంకల్పిద్దాం.
No comments:
Post a Comment