Vedantha panchadasi:
భ్రమాధిష్టానభూతాత్మా కూటస్థాసఙ్గచిద్వపుః ౹
అన్యోన్యాధ్యాసతోఽ సజ్గీధీస్థ జీవోఽ త్ర పూరుషః ౹౹ 5 ౹౹
5.భ్రమకు ఆధారమైన కూటస్థమే సకల జీవులయందలి ఆత్మ,అది అసంగము చైతన్యస్వరూపము అవికారి.అన్యోన్యాధ్యాస వలన బుద్ధితో సంపర్కము కలిగినపుడు అది జీవుడు పురుషుడు అనబడును.
వ్యాఖ్య :-కూటస్థము,అసంగము,
చిద్రూపము అయిన తత్త్వము పరమాత్మ.
అతడే ఈ శరీరానికి ఇంద్రియములకు అధిష్టానమైనవాడు.అసంగుడైనప్పటికి,అన్యోన్యాధ్యాసం కారణంగా బుద్ధియందు అవస్థితుడై ఉంటాడు.అతడినే ఈ శ్రుతిలో "పురుషుడు" అని వ్యవహరించారు.
"స వా ఆయం పురుషః సర్వాసు పూర్షు పురిశయః "
- బృహ.ఉప .2-5-18.
(అతడు సమస్త శరీరాలు అనే పురుషులయందు శయనిస్తూ ఉంటాడు కాబట్టి పురుషుడు)
మాయాకార్యమగు బుద్ధి మాయ వలనే మిథ్య.ఆ బుద్ధి యందలి ప్రతిఫలనము జీవుడు కనుక జీవుడు కూడా మిథ్యయే.
బుద్ధితో కూటస్థమునకు కలిగే సంపర్కము కూడా మిథ్యయే.
కానీ, బ్రహ్మమును గూర్చిన జ్ఞానము కలిగే వరకు జీవుడు,బుద్ధి అన్నీ సత్యములుగనే ఉండును.
రాత్రి,పగలును మిథ్యయే. భూమి పరిభ్రమణము వలన ఏర్పడినవి గనుక.ఈ భూమిని వదలి అంతరిక్షమున ప్రవేశించినచో రాత్రి లేదు పగలు లేదు.
కానీ భూమిపై ఉన్నంత కాలము రాత్రి , పగలు "సత్యము" లే.
ఆనందరూపమయిన ఆత్మకు బుద్ధి విముఖంగా ఉండటం వలన,విషయాలలోకి దిగటం వలన బుద్ధి చంచలమయిన సుఖదుఃఖాలకు లోనవుతుంది.
విషయానుభవం మాని బుద్ధి క్షణకాలం శాంతమై అంతర్ముఖమయితే బుద్ధిలో ఆనందస్వరూపమయిన ఆత్మ ప్రతిబింబించును.
అందువలన ఆనందం కలుగుతుంది.అది విషయం వలన వచ్చిన ఆనందమని భ్రాంతి పడతాము.కాని అది మన ఆనంద స్వరూపమే.
సాధిష్ఠానో విమోక్షాదౌ జీవోఽ ధిక్రియతే నతు ౹
కేవలో నిరధిష్ఠాన విభ్రాన్తేః క్వాప్యసిద్ధితః ౹౹ 6 ౹౹
6. అధిష్ఠానమగు కూటస్థముతో కూడిన జీవుడు కర్తయై మోక్షమును ఇహలోక పరలోక సుఖములను కోరును.
అధిష్ఠానాంశ సంయుక్తం భ్రమాంశ మవలమ్బతే ౹
యదా తదాఽ హం ససారీత్యేవం జీవోఽ భిమన్యతే ౹౹7౹౹
7.జీవాత్మ అధిష్ఠానంతో సహా, భ్రమాంశయొక్క ఆధారాన్ని గ్రహించినప్పుడు తనను తాను సంసారినని అనుకోవటం మొదలు పెడతాడు.
భ్రమాంశస్య తిరస్కారా దధిష్ఠాన ప్రధానతా ౹
యదా తదా చిదాత్మాహ మసజ్గోఽ స్మీతి బుద్ధ్యతే ౹౹8౹౹
8.విచారణచే భ్రమాంశమగు శరీరములను నిరాకరించుటచే అధిష్ఠానము,ఆధారము అగు కూటస్థబోధ ప్రధానమగును.
వ్యాఖ్య:-సాధారణముగా చిదాభాసమే జీవుడుగ వ్యవహృతమైననూ ఇచట కొంత భేదము చూపబడినది. ఆధారమగు కూటస్థము, ప్రతిఫలనమగు చిదాభాసము, ప్రతిఫలించే అంతఃకరణము ఈ మూడూ కలిసి జీవుడనబడును.
వీనియందు అన్యోన్యాధ్యాసచే జీవునకు కర్తృత్వబోధ కలిగి మోక్షాదులను అన్వేషించును. కేవలము చిదాభాసుడు అట్లు చేయలేడు ,కారణం- (అంతః) కరణము లేకపోవుట చేత.
అధిష్టానంతో కూడిన -
కూటస్థ చైతన్యంతో కూడిన -
చిదాభాసమైన జీవుడే మోక్షానికి అవసరమైన సాధనాలను అనుష్ఠించటానికి అధికారి.
పురుష శబ్దానికి చిదాభాసరూపమైన జీవుడని అర్థం చెప్పకుండా అధిష్ఠాన రూపంలో ఉండే కూటస్థమని చెప్పుచున్నారు.అంటే -
అధిష్ఠానమనేది వుంటేనే తప్ప భ్రాంతి అనేది ఉండదు కాబట్టి !
- కేవలము చిదాభాసము మాత్రము ఉండజాలదు.
అధిష్ఠానమగు కూటస్థముతో కూడిన జీవుడు భ్రమాంశమగు అంతఃకరణము, సూక్ష్మస్థూలాది శరీరముతో తాదాత్మ్యమును భావించినపుడు ఈ శరీరముల సుఖదుఃఖములు తనవనీ,
"నేను" అనీ, తనను తాను సంసారిననీ అనుకోవడం మొదలు పెడతాడు.
ఆ స్థితిలో అతడు చిదాభాసతో కూడిన దేహాదులను స్వస్వరూపంగా భావించి -
ఆ దేహేద్రియాదులే తానని అనుకుంటాడు.ఆ విధంగా సంసారిననే భావాన్ని పొందుతాడు.
మళ్ళీ విచారణచే భ్రమాంశను తిరస్కరించి - త్యజించి - అధిష్ఠానమైన కూటస్థ చైతన్యాన్ని గ్రహించినప్పుడు
"నేను నిర్వికారిని",
"చిద్రూపుడను" అనే జ్ఞానాన్ని పొందుతున్నాడు.అంటే,
జీవుడు స్థూల,సూక్ష్మ దేహాదులతో కూడిన చిదాభాసను మిథ్య అని తెలుసుకొని,
ఆ మిథ్యా జ్ఞానాన్ని అనాదరం చేసినప్పుడు ఆత్మస్థితిని పొంది
"అసంగుడనైన చిదాత్మను "నేనే" అని గ్రహించి సంగరహితుడననీ తెలుసుకుంటాడు.
కావున ,అధిష్ఠానముతో కూడిన జీవునకే బంధమోక్షాలు సంభవమవుతాయికానీ,
కేవలము చిదాభాసము మాత్రము ఉండజాలదని ఉద్ధేశము.
No comments:
Post a Comment