☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
80. స్వస్తి ప్రజాభ్యః
ప్రజలకు మేలు కలుగుగాక (వేదవాక్యం).
అత్యంత ప్రాచీన కాలం నుంచే కాలగణనంలో అద్భుతమైన శాస్త్రీయమైన విజ్ఞానం కల దేశం మనది. ఖగోళ విజ్ఞాన ఆధారంగా ఇక్కడి కాలగణన ఉంది. దేశంలో
భిన్న భిన్న ప్రాంతాలకు లభించే జ్యోతిర్మండల ప్రభావం కూడా భిన్నభిన్నంగానే ఉంటుంది. అందుకే ఇక్కడ భిన్నమైన 'కాలమానాలు' ఉన్నాయి. కొందరిది సౌరమానమైతే, కొందరిది చాంద్రమానం. ఇంకొందరిది బార్హస్పత్యమానం. ఈ మానాలు ఎలా ఉన్నా, వీటన్నిటికి మూల విజ్ఞానం ప్రాచీనమైన జ్యోతిర్ జ్ఞానమే.గ్రహ నక్షత్ర విజ్ఞానంలో దేశమంతా ఒక్కటే.
( బ్రాహ్మణ శబ్దం కుల వాచకం కాదు. 'బ్రహ్మ' శబ్దానికి 'జ్ఞానం, బుద్ధి' అని
అర్థం. 'బ్రాహ్మణులు' అంటే సమాజంలో మేధావులు. వారు ఎవరైనా కావచ్చు. సత్త్వ గుణసంపన్నులైన మేధావులే 'బ్రాహ్మణులు' అనేది అచ్చమైన వైదిక నిర్వచనం, వీరు ఏ దేశపు సమాజంలోనైనా ఉంటారు.)
చంద్రమానాన్ని అనుసరించి ఒకసారి, సౌరమానం ప్రకారం ఇంకొన్నాళ్ళకి నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నా పంచాంగ సూత్రం మాత్రం రెండిటికీ ఒక్కటే.
ఏ తిథి, ఏ వారము చెడ్డవి కావు. ఏది ఎందుకు అనుకూలమో అనేది
తెలుసుకోవాలి. అదే పంచాంగజ్ఞానం. నేలంతా ఒకటే అయినా కొన్ని నేలలు పంటలకి అనుకూలం. కొన్ని కావు. కొన్ని... కొన్ని పంటలకే అనుకూలం. అలాగని నేలని పనికిరానిదని అనం కదా. అదేవిధంగా 'జలం' అని సామాన్యంగా వాడినా సముద్రజలం, నదీజలం, తాగేజలం, సాగు నీరు, పశువుల్ని కడిగేనీరు, మనల్ని
కడుక్కొనే నీళ్ళు... ఇన్ని తేడాలున్నట్లే సూక్ష్మమైన కాలంలోనూ అనేక శక్తి భేదాలున్నాయి.వాటిని తెలియజేసే విజ్ఞానం పంచాంగాలలో దాగి ఉంది.
ఒక ప్రాంతానికి ఒక అధిపతి ఉన్నట్లుగా ప్రకృతి శక్తులకీ, కాలశక్తులకీ అధిపతులుంటారు. వారు అత్యంత సూక్ష్మరూపులు (శక్తి స్వరూపమే సూక్ష్మం కదా!).
వారినే దేవతలంటారు. అలా తిథి, వార, నక్షత్రాదులకు అధిష్టాన
దేవతాశక్తులుంటాయి. ఒక రాజ్యంలో సంపద కావాలంటే దానిని ఏలే రాజుగారి అనుమతీ, అనుగ్రహం కావాలి. అలాగే ప్రకృతి శక్తీ, కాలశక్తీ మనకు అనుకూలించాలంటే వాటి అధిపతులైన దేవతల అనుగ్రహం కావాలి.
అందుకే కాలం మలుపులో ఆ దేవతలందరినీ స్మరించి ప్రార్థిస్తాం. 'తిథి' మొదలైనవి స్మరించడం చేత ఆ దేవతలు సంతోషించి దీవిస్తారు. కాలాన్ని జడంగా కాక, మనల్నీ
విశ్వాన్నీ శాసించే మహాశక్తిగా దర్శించిన విజ్ఞానంలోని సంప్రదాయ బలమిది.మనకు పరంపరగా ప్రసిద్ధిచెందిన స్వస్తి వాక్యాలనే ఇక్కడోసారి స్మరిద్దాం.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయేణ మార్గేణ మహీం మహీశాః
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం,
లోకాస్సమస్తా స్సుఖినోభవన్తు.
కాలే వర్షతు పర్జన్యః
పృథివీ సస్యశాలినీ,
దేశోయం క్షోభరహితో,
బ్రాహ్మణాః సన్తు నిర్భయాః॥
ఇవి గొప్ప శుభాకాంక్షలు, అయితే, స్థూలంగా చూస్తే 'గోబ్రాహ్మణేభ్యః', 'బ్రాహ్మణాఃసన్తు నిర్భయాః' వాక్యాలు సంకుచితంగా చెప్పినట్లు అనిపించవచ్చు కానీ సత్యాన్ని సత్యంగా దర్శిద్దాం.
'స్వస్తి ప్రజాభ్యః' అని ప్రారంభించి, 'లోకాస్సమస్తా' అని చెప్పిన ఋషి ఇలా సంకుచితంగా ఆలోచించడు, మరి ఉద్దేశమేమిటి? ఇక్కడ బ్రాహ్మణ శబ్దం కుల వాచకం కాదు. 'బ్రహ్మ' శబ్దానికి 'జ్ఞానం, బుద్ధి' అని అర్థం. 'బ్రాహ్మణులు' అంటే సమాజంలో మేధావులు. వారు ఎవరైనా కావచ్చు. సత్వ గుణసంపన్నులైన మేధావులే
'బ్రాహ్మణులు' అనేది అచ్చమైన వైదిక నిర్వచనం, వీరు ఏ దేశపు సమాజంలోనైనా ఉంటారు. యజ్ఞద్రవ్యాలను సమకూర్చి, పాడీ పంటా నిలిపే సత్త్వగుణ జంతువులు
గోవులు.
( సత్త్వగుణం, మేధ - ఈ రెంటినీ కాపాడితే దేశానికి క్షేమం. మేధావులు లోకక్షేమాన్ని కోరే సత్త్వగుణ సంపన్నులు. వారు లోకశ్రేయం కోసం ధర్మాన్ని, సత్యాన్నీ చెప్పడానికి
భయపడకూడదు. మేధావులకు వారి ఆలోచనల్నీ, విజ్ఞానాన్నీ నిర్భయంగా ప్రకటించే స్వేచ్ఛను సమాజం కల్పించాలి. మేధావులకి సేచ్ఛనివ్వని సమాజానికి ప్రగతి ఉండదు.
ఈ హెచ్చరికని ఏనాడో చేసిన భారతీయ భవ్యసంస్కృతి మనది.)
“ప్రజలందరికీ మేలు కలుగుగాక (సు + అస్తి = స్వస్తి).
పాలకులు భూమిని న్యాయబద్ధంగా పాలించుగాక! సత్త్వ గుణ సంపన్నులైన ప్రాణులకు, మేధావులకు శుభమగుగాక! లోకులందరూ సుఖింతురుగాక! మేఘాలు సకాలంలో వర్షించుగాక! భూమి సస్యశ్యామలమై శోభిల్లుగాక! ఈ దేశంలో కల్లోలాలు లేకుండా శాంతి కలుగుగాక! మేధావులు నిర్భయంగా ఉందురుగాక!”
ఇవి విశ్వజనీనమైన స్వస్తి వాక్యాలు.
No comments:
Post a Comment