Vedantha panchadasi:
పరోక్ష మపరోక్షం చ జ్ఞానమజ్ఞాన మిత్యదః ౹
నిత్యపరోక్షరూపేఽ పి ద్వయం స్యాద్దశమే యథా ౹౹22౹౹
22.ఆత్మ నిత్యము అపరోక్షముగ సాక్షాత్తుగ తెలియబడుచునే ఉన్నది. అయినా
జ్ఞానము-అజ్ఞానము
పరోక్షము-అపరోక్షము అని రెండును దానికి అన్వయింపబడుచున్నవి.కథయందలి పదవ వాని యందు వలెనే.
నవసంఖ్యా హృతజ్ఞానో దశమో విభ్రమాత్తదా ౹
న వేత్తి దశమోఽ స్మీతి వీక్ష్యమాణో ఽ పి తాన్నవ ౹౹23౹౹
23.లెక్కించిన తొమ్మిదియను సంఖ్యచే జ్ఞానమును పోగొట్టుకొని పరిభ్రాంతుడైన పదవవాడు,
తాను తొమ్మిదిమందిని చూచుచున్నను తానే పదవవాడని తెలియజాలడు.
న భాతి నాస్తి దశమ ఇతి స్వం దశమం తదా ౹
మత్వా వక్తి తదజ్ఞానకృతమావరణం విదుః ౹౹24౹౹
24.పదవవాడు తానే అగుటచేత,తనకెదురుగా ఆ పదవవానిని చూడలేడు.
దీనినే అజ్ఞానకృతమైన ఆవరణమందురు.
వ్యాఖ్య:-
జ్ఞానము - అజ్ఞానము ఈ రెండూ ఆత్మయందు ఉండటాన్ని అంగీకరించాలి గదా !
అనే శంకను
దశమ మనుష్యుని దృష్టాంతంతో పరిహరిస్తున్నారు.
కథ: పదిమంది మూర్ఖులు ప్రయాణము చేయుచు ఒక నదిని దాటారు.అందరూ దాటారో లేదో అని లెక్క చూచుకొనగ ప్రతివాడూ తొమ్మిదిమందినే లెక్కింపగలిగెను,తనను లెక్కించుకొనకపోవుటచే.
దానితో వారు పదవవాడు నదిలో మునిగి పోయెనని ఏడ్చుచుండగా బాటసారి ఒకడు వారిలో ఒకనిచే తొమ్మిదిమందిని లెక్కింపజేసి లెక్కించిన వాని తలపై గట్టిగా మొట్టి ఇదిగో పదవవాడు అని చూపెను.
స్వప్రకాశం,చిద్రూపత్వం వల్ల ఆత్మను నిత్యప్రత్యక్షంగా అంగీకరిస్తారు.కానీ,
'అయమ్' అనే పదం యొక్క బలంతో ప్రత్యక్షమని అంటే,
దాని పరోక్షత్వాన్ని కూడా అంగీకరించాల్సి ఉంటుంది.
పరోక్షజ్ఞానము -అపరోక్షజ్ఞానము అట్లాగే,
జ్ఞానము - అజ్ఞానము ఇట్లా ఈ రెండూ దశమ పురుషునితో కనిపించినట్లుగా ఒక్కసారిగా ఉండటం నిత్యము అపరోక్షరూపముగల కూటస్థునియందే సంభవం.
పదవవాడైన అజ్ఞానిని గూర్చిన దృష్టాంతం -
లెక్కింపబడ్డ వ్యక్తులకు సంబంధించిన తొమ్మిది సంఖ్యచేత బుద్ధి చెడిపోయిన పదవ వ్యక్తి ప్రత్యక్షంగా ఆ తొమ్మిదిమందిని చూస్తూ కూడా భ్రాంతివల్ల తనను పదవవానినిగా గుర్తించటం లేదు.ఇట్లాగే,
నిత్యము అపరోక్షరూపములో ఉంటున్నా,పదవవానిలో కూడా అజ్ఞానము ఉత్పన్నం కావచ్చు.
ఆ అజ్ఞానానికి(భ్రాంతికి)
కారణమైన అజ్ఞానజన్యమైన ఆవరణం -
అజ్ఞానం కారణంగా ఆ పదవవాడు ,తానే పదవవాడైనప్పటికి
"నాకు పదవవాడు కనిపించుటం లేదు" అనిగాని,
"పదవవాడు లేడు"అని గాని అంటున్నాడు.అతడీ విధంగా అనటానికి కారణం ,
అజ్ఞానకృతమైన ఆవరణం అని గ్రహించాలి.
పరోక్షజ్ఞానము:-బుద్ధితో సమపార్జించిన జ్ఞానమంతా (పర+అక్ష)పరోక్ష జ్ఞానమే.
పర+అక్ష అంటే ఇతరులకన్ను.
ఇతరుల కన్నులతో చూసినది పరోక్షజ్ఞానం.
అపరోక్షజ్ఞానం:-స్వయంగా తన కన్నులతో చూసినది.
అ+పరోక్ష+జ్ఞానం =స్వానుభవం.
నద్యాం మమార దశమ ఇతి శోచన్ర్పరోదితి ౹
అజ్ఞాన కృతవిక్షేపం రోదనాదిం విదుర్భుదాః ౹౹25౹౹
25.పదవవాడు నదిలో మరణించెనని దుఃఖించుచు పెద్దగా ఏడ్చుదురు.ఈ ఏడుపులు పెడబొబ్బలనే విద్వాంసులు అజ్ఞానకృతమైన విక్షేపము అందురు.
న మృతో దశమోఽ స్తీతి శ్రుత్వాప్తవచనం తదా ౹
పరోక్షత్వేన దశమం వేత్తి స్వర్గాదిలోకవత్ ౹౹26౹౹
26. చావలేదు,పదవవాడు బ్రతికే ఉన్నాడు అని ఆప్తులనుండి విని,స్వర్గాది లోకముల ఉనికిని గూర్చి శ్రుతివాక్యముల ద్వారా తెలిసికొనినట్లే పదవవానిని గూర్చి పరోక్షముగ తెలిసికొనును.
త్వమేవ దశమోఽ సీతి గణయిత్వా ప్రదర్శితః ౹
అపరోక్షతయా జ్ఞాత్వా హృష్యత్యేవ న రోదితి ౹౹27౹౹
27.పదవవాడవు నీవే అని వానిచే లెక్కింపజేసి చూపగా అపరోక్షముగ సాక్షాత్తుగ తెలిసికొని హర్షమునొందును. ఇక ఏడువడు.
వ్యాఖ్య:-అజ్ఞానానికి(భ్రాంతికి) కారణమైన అజ్ఞానజన్యమైన ఆవరణన విక్షేపం గురించి -
నాకు పదవవాడు కనిపించటం లేదని పదవవాడే అంటున్నాడు.దీనినే అజ్ఞానాకృతమైన ఆవరణంగా గ్రహించాలి.
ఆ సమయంలో పదవవాడున్న స్థితినే "విక్షేపం" అంటారు.
"పదవవాడు నదిలో మునిగి పోయాడు,చనిపోయాడు"అనుకొని ఏడుస్తూ శోకిస్తున్నాడు.
ఆ విధంగా ఆ పదవ వ్యక్తి ఏడుస్తూ దుఃఖించటాన్నే విద్వాంసులు అజ్ఞానాకృతమైన విక్షేపం అంటారు.
అప్పుడు యథార్థవాదియైన వాడొకడు ఆ పదవవ్యక్తి యొక్క అజ్ఞానాన్ని అసత్వాంశాన్ని పోగొట్టాలి.
ఆప్తుడు - గురువు (యధార్థవాదియైన ఆ పురుషుడు)మిగతా తొమ్మిది మందిని లెక్కించి,పదవవాడవు నీవే ! అని చెప్పి విశ్వాసాన్ని కలిగించాడు.
అప్పుడా పదవవాడు
"నేనే పదవవాడను" అని ప్రత్యక్షంగా - అపరోక్షరూపంలో తనను తెలుసుకొని దుఃఖం నుండి నివృత్తుడై ఏడవటం,దుఖించటం మానివేస్తున్నాడు.
సంతోషిస్తున్నాడు.ఇది అపరోక్షజ్ఞానం.
ఆత్మను దర్శించలేని అజ్ఞానదశలో మానవునికి మాయపొర కప్పినది.అదియే
ఆవరణ యనబడును.
సత్యమైన ఆత్మను అజ్ఞానావరణ ఆవరించగనే మాయా మోహితుడైన జీవుడు చెదిరిన అంతఃకరణ గలవాడై విక్షేపమును పొందును.
రజ్జువును చూడలేకపోవుట ఆవరణకాగా,
ఉన్న రజ్జువులో లేని సర్పమును చొప్పించుట విక్షేపమైనది.
ఈ ఆవరణ, విక్షేప దోషములచే రజ్జువును సర్పముగ దర్శించునట్లు
అనాత్మను ఆత్మగాదర్శించును.
ఇది జ్ఞానముతో పోతుంది.
జ్ఞాన స్వభావమేమంటే జ్ఞానం ప్రసరిస్తున్న వస్తువు మీద అంతవరకు ఉన్న అధ్యాసగాని అజ్ఞానము గాని పోతుంది.
అధ్యాసను తెలిసి అజ్ఞాన పరిధినుండి విడివడిన వ్యక్తి ఆత్మవిదురుడై తరించ గలడు.
No comments:
Post a Comment