*కొత్తట! ....హేఁవిటో మరి!*
*జగన్* నాటకం ముగిసింది!
*చంద్రోదయం* అయ్యింది!
ఒకచో *కమలం* నవీనమయ్యింది!
సమస్యలు మాత్రం ఎక్కడివక్కడే ఉన్నాయి
మరి
*క్రొత్త* హేఁవిటో!?
*ట్రంప్* మళ్ళీ వచ్చాడు ఏవేవో చెప్పి!
*ప్రక్కలో బల్లెం* తో
*ఎర్రజెండా* యుద్ధం
చేస్తూనే ఉంది!?
*పాలస్తీనా* పాహి పాహి అంటోంది!
*ఇజ్రాయెల్* ఎగిసి యెగిసి దూకుతోంది!
ఇలాతలమంతా చోద్యం చూస్తూనే ఉంది!
మరి
*క్రొత్త* హేఁవిటో!
అర్థరాత్రి నడిరోడ్డుమీద నడవగలగడం ఎలాగూ మిథ్య!
అంతకంటే మిథ్య నాలుగు గోడల మధ్య రక్షణ అతివకు!
మరి
*క్రొత్త* హేఁవిటో!?
*ఆటల్లో గెలుపూ ఓటమీ మామూలేగా!*
ఒకచో ఎర్రతారలు,
మరొకచో వెండి తారలూ
ఇంకొకచో వాద్యాలకు మూగనోము పట్టించి కొందరూ నింగిలోని తారలయ్యారు!
రూపాయిని అందరి పాపాయిని చేసినాయన కూడానూ!
జాతస్య హి మరణం ధ్రువం కదా!
మరి
*క్రొత్త* హేఁవిటో!?
*మణిపూర్* లో మానిని మానం మంట కలిసింది!
కమలాన్ని కళవళపడజేసారు!
దేశమంతా అట్టుడికింది!
బంగాళం కంగాళీ అడ్డా అయ్యింది!
కానీ
చేతులూ కాలవు!
సైకిల్ పంక్చరూ అవ్వదు!
కత్తులూ కొడవళ్ళూ పైకి లేవవు!
గడ్డిపోచలు త్రాళ్ళూ పేనవు ముకుతాడు వేసేందుకు!
ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే!
మరి
*క్రొత్త హేఁవిటో!?*
నింగీ నేలా చుక్కలూ
చంద్రుడూ సూరీడూ
కొండా కోనా
ఎండావానా
అన్నీ అలాగే ఉన్నాయి!
మరి
*క్రొత్త* హేఁవిటో!?
కూటికి కటిక పేదలు దేశంలో కోకొల్లలు!
అయినా *పూలకు* కాసుల గలగలలు!
రూపాయి రాను రాను బక్క చిక్కిపోతోంది!
అయినా
*అభివృద్ధి* ప్రచారం మరీ దుక్కతన్నేస్తోంది!
ఇది షరా మామూలే కదా!
మరి
*క్రొత్త* హేఁవిటో!?
వేంకన్న ఆదాయం ఆకాశం దాటేసిందెప్పుడో
వేల్పుల వేడుకలూ పోటీ పడుతున్నాయి!
జగన్నాథుని రత్న భాండాగారం తలుపు తెరిచాం!
లెక్కలు చెప్పడం మాత్రం యథావిధిగా మరిచాం!
ఇవన్నీ సర్వసాధారణమే గదా!
మరి
*క్రొత్త* హేఁవిటో!?
సెల్ ఫోన్ హల్ చల్ మనుషుల్లో ఎక్కువయ్యింది!
ఆత్మీయుల మధ్య మౌనం ఎనిమిదో వింతయ్యింది!
వృద్ధాశ్రమానికీ ముందుగానే రిజర్వేషన్ సౌకర్యం వచ్చేసింది!
ఆన్ లైన్ లో చదువులు!
ఆఫ్ లైన్ లో బ్రెయిన్ లు!
ఈ మార్పులు సజీవాలేగదా!
మరి
*క్రొత్త* హేఁవిటో!?
క్రొత్త హేఁవిటా?
ఉందిగా
సంవత్సరం మారిన క్యాలండరు!
*క్రొత్త క్యాలండర్ శుభాకాంక్షలు చెల్లాయికీ, ఆత్మీయులందరికీ*
*మౌళి పాలక*
*జయపురం*
*ఒడిశా*
*01012025*
No comments:
Post a Comment