కవిత
// కాలం గాయం //
డా.పొనుగోటి రవికుమార్
..... ....
కాలం రాచపుండు
అది రగులుతూనే ఉంటుంది నిరంతరం గాయమై!
గాలి స్తంభించినట్లు
కాలం నిలవదు నిలకడగా
దాని పోకడ దానిదే !
ప్రాణం పోకడ తెలియదు
కానీ
కాలం రాకడ కోసం
వేయి కనులతో
లక్ష దీపాలను వెలిగించి
కోటి కాంతుల కోసం
క్షణక్షణం కణం కణం
వెర్రికేకలతో
పిచ్చిచూపులతో ఎదురుచూస్తుంటాం
కాలం
జారుడుబండపై
బాల్యం
కనులు మూసి
తెరిచే లోపల గతంలోకి జారుకుపోయి కూరుకుపోతాం! భవిష్యత్తు మీద భరోసాతో
నిచ్చెనమెట్ల పాత జ్ఞాపకాలను నిలువునా ఎక్కుతూ
నిజాలని తొక్కుతూ
అబద్దాలను నిక్కుతూ
పావుశేరు పంచదార కలుపుకొని చేదు బ్రతుకుల్ని
గుటుకు గుటుకు మంటూ మింగుతూనే ఉంటాం
ముదిరిపోయి ముడతలు
పడిన కాలానికి
ముక్కుతూ ములుగుతూ
రంగులు అద్దుకుంటు
మసక బారిన డ్రెస్సింగ్ మిర్రర్ కి
సువాసన ద్రవ్యాలు జల్లుతుంటాం! పాత జీవితాల్ని
సరికొత్త సీసాలోకి ఒంపుకుని గొంతులో నింపుకొని
దాహం తీరని బతుకులను తడుపుకుంటాం
బాధల్ని ముక్కలు చేయలేక
కేకు ముక్కల్ని కసిగా
కట్ చేసి కథనరంగంలో
కత్తిని జలుపిస్తూ
కేకలు వేస్తుంటాం!
పాత బతుకుల
మెతుకుల్ని పారబోసి
ఇంతింత బిరియాని మెతుకుల్ని నోట్లోకి కుక్కేసి స్ప్రైట్ తో
నాలుక తడుపుకొని
ఇట్స్ క్లియర్ అని
చేతులను చేతులతో కడుక్కొని పొద్దున్నే థమ్సప్ ను మేల్కొల్పుతుంటాము
అక్కడెక్కడో
చర్చి గంట మొత్తుకుంటుంది
రెండో రాకడతో
కాలానికి మూడిందని !
మసీదు మైకు
జాము పొద్దు ముందు
అజాగా మేల్కొల్పుతుంటుంది !
సుప్రభాతం సుతారంగా
వేకువనే గుడిలోనుండి
గుండెల్లోకి వెలువవుతుంది! కాలమానం
అందరికీ ఒకటి కాదు
కొందరికి దుఃఖం
మరికొందరికి సౌఖ్యం
వాడెవడో డైరెక్టర్ అన్నట్లు
'కాలం ఎవడిని వదలదు
అందరి సరదాలు తీర్చేస్తుందని'
కానీ
ఈరోజు కాలం సరదాలన్నీ
మనమే తీరుస్తాం
నిలకడలేని మనుషులుగా నిజాయితీగా లేచి
నిలబడతాం కనబడతాం
అపరాత్రి అని లేదూ
అర్ధరాత్రి అని లేదూ
ఎవడో తాగుతాడు
మరెవడో వాగుతాడు
ఇంకెవడో తూలుతాడు
అదంతా కాలమహిమే
తావీదు మహిమ కాదు
ఏది మారినా
తలరాత మారదన్నట్లు మూఢనమ్మకంతో
వెర్రి ఎక్కుతుంటాం!
కాలం
ఎన్ని క్యాలెండర్లుగా మారినా
మన క్యారెక్టర్
మారనంత కాలం
కాలం కాలమే
మనం మనమే
అంతెందుకు గురూ
గాయం రాచపండు
నిరంతరం కాలమై
రగులుతూనే ఉంటుంది!
(01.01.2025)
No comments:
Post a Comment