Thursday, January 23, 2025

 Vedantha panchadasi:
విక్షేపోత్పత్తితః పూర్వమపి విక్షేప సంస్కృతిః ౹
అస్త్యేవ తదవస్థాత్వ మవిరుద్ధం తతస్తయోః ౹౹39౹౹

39. విక్షేపము ఉత్పత్తి అగుటకు పూర్వము  కూడా విక్షేప సంస్కారములు ఉండనే ఉన్నవి.కనుక మొదటి రెండు దశలును విక్షేపము యొక్ష దశలే అనుట విరుద్ధము కాదు.

బ్రహ్మణ్యారోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి ౹
న శఙ్కనీయం సర్వాసాం బ్రహ్మణ్యేవాధిరోపణాత్ ౹౹40౹౹

40. బ్రహ్మముపై ఆరోపింపబడుట చేత బ్రహ్మము యొక్క దశలని శంకింపరాదు.
ఏలన అన్ని ఆరోపములకూ అధిష్ఠానమూ బ్రహ్మమే.

వ్యాఖ్య:- అజ్ఞానము,ఆవరణము అనే దశల్లో విక్షేపమనేదే లేనప్పుడు (చిదాభాస లేనప్పుడు)వాటిని విక్షేపం యొక్క అవస్థలు అనటంలోని అభిప్రాయం ఏమిటి ? అంటే...

విక్షేపరూపమైన చిదాభాసయొక్క ఉత్పత్తికి పూర్వం కూడా దానియొక్క సంస్కారం ఉండనే ఉంటోంది -
అంటే చిదాభాస సంస్కార రూపంలో ఉంటోందన్నమాట.
కాబట్టి అజ్ఞానాన్ని,ఆవరణను విక్షేపం యొక్క అవస్థలని అనటంలో తప్పేమీ లేదు.

అజ్ఞానాన్ని,ఆవరణను చిదాభాస యొక్క అవస్థలనటం కంటే ,పరబ్రహ్మ యొక్క అవస్థలనే అనవచ్చు గదా ! అంటే -

బ్రహ్మమునందు ఆరోపితమైనందువల్ల,ఈ అజ్ఞానం,ఆవరణ అనేవి బ్రహ్మము యొక్క అవస్థలౌతాయా ? అని శంకించ నవసరం లేదు.
ఎందు చేతనంటే,అన్ని అవస్థలూ బ్రహ్మమందే ఆరోపితమౌతున్నాయి - అంటే,
సమస్తమూ అధిష్ఠాన రూపమైన బ్రహ్మమందే ప్రకల్పితమై ఉన్నాయి కాబట్టి !

మహాప్రళయాంతంలో కూడా పూర్వకల్పంలో ఏ శక్తులుండేవో వాటి శేషమే ఉంటుంది.ఆ శేషం నుండే సృష్టి మళ్ళీ జరుగుతుంది.

పూర్వసృష్టిలో ఏ కర్మలు చేసారో మళ్ళీ జన్మలెత్తినా వారివారి కర్మఫలాలకు అనుగుణంగానే జన్మప్రాప్తి ఉంటుందని గ్రహించాలి.

వర్ణాశ్రమధర్మాలు విచ్ఛిన్నమవుతూ ఏదో విధంగా ఆవిర్భవమవుతున్నా,
శరీర ధర్మాలు ఒక నిర్ణీత వ్యవస్థ(పద్ధతి)ప్రకారమే ఉంటాయి.అంటే -

చెవులే వింటాయి ,నోటి ద్వారా వాక్ ప్రకటితమవుతుంది,
కన్నే చూస్తుంది .
 ఇలా ప్రతి యుగంలోను పంచేంద్రియాలు వాటి వాటి పనులు చేస్తాయి.కాని,ఒక ఇంద్రియం పని మరో ఇంద్రియం చెయ్యటంకాని, ఆరవ ఇంద్రియం ఉండటంకాని జరగలేదు.

కాబట్టి ఏ యుగంలోనైనా పరమాత్మ యొక్క రూప కల్పనలోనే సృష్టి జరుగుతుంది.హిరణ్యగర్భుడు,యుగాలు మారినా పరమేశ్వరుని మాయామయ స్వరూపంగా తన శక్తిని కోల్పోడు.

అందుచేత మాయ మొదలు అన్ని ఆరోపములకూ అధిష్ఠానము బ్రహ్మమే.

సంసార్యహం విబుద్ధోఽ హం నిఃశోకస్తుష్ట ఇత్యపి ౹
జీవగా ఉత్తరావస్థా భాన్తి న బ్రహ్మగా యది ౹౹41౹౹

41.(ఆక్షేపము)నేను సంసారిని నేను జ్ఞానిని శోకరహితుడను సంతుష్టుడను అనే తరువాతి అవస్థలు జీవునకు గదా బ్రహ్మమునకు చెందవు గదా.

తర్హ్యజ్ఞోఽ హం బ్రహ్మ సత్త్వభానే మద్దృష్టితో న హి ౹
ఇతి పూర్వే అవస్థే చ భాసేతే జీవగే ఖలు ౹౹42౹౹

42.(సమాధానము)అనినచో నేను అజ్ఞానిని నాకు బ్రహ్మము భాసించుట లేదు అనే మొదటి రెండు దశలు కూడ జీవునకే చెందవలయును కదా.

అజ్ఞానస్యాశ్రయో బ్రహ్మేత్యధిష్ఠానతయా జగుః ౹
జీవావస్థాత్వమజ్ఞానాభిమానిత్వాదవాదిషమ్  ౹౹43౹౹

43.అధిష్ఠానముగ బ్రహ్మము అజ్ఞానమునకు ఆశ్రయమని పూర్వాచార్యులు చెప్పుదురు. కాని జీవుడు అజ్ఞానమునందు 
అభిమానముంచి నేను అజ్ఞానిని అని భావించును కనుక అజ్ఞానము జీవునదే అని చెప్పవచ్చు.

వ్యాఖ్య:-సమస్తమూ అధిష్ఠాన రూపమైన బ్రహ్మము అయిన ,
విక్షేపం ఉత్పన్నమైన తరువాతివైన అవస్థలు జీవాశ్రితాలుగా కనిపిస్తున్నాయి గదా !
పరబ్రహ్మాశ్రితాలు ఎట్లా అవుతాయి ? అనే శంకకు సమాధానం -

"నేను సంసారిని,కర్త్రత్వాది ధర్మాలతో కూడినవాడను,
నేను తత్త్వసాక్షాత్కారం పొందిన వాడను,
నేను శోక రహితుడను,నేను సంతుష్టుడను అనే ఈ విధమైన అవస్థలన్నీ -దశలన్నీ- అజ్ఞానదశ,ఆవరణ దశల తరువాతి కాలంలో జీవాశ్రితమై భాసిస్తున్నాయి.
జీవాశ్రితమై అనుభవంలోకి  స్తున్నాయి.   అంతేతప్ప,
బ్రహ్మాశ్రితమై భాసించటం లేదు. అంటే - ఇందుకు సమాధానం -

అటువంటప్పుడు
" నేను 
మూర్ఖుడను, బ్రహ్మముయొక్క సత్త(ఉనికి)  నా అనుభవములోకి రావటం లేదు"  అనే ఈ విధమైన, మొదట్లో ఉన్నట్టి అజ్ఞానం ఆవరణం ఈ రెండు అవస్థలూ కూడా నిశ్చింతగా,జీవాశ్రితంగా ప్రతీతమౌతున్నాయి.
అందుచేతనే,ఈ అవస్థలు విక్షేపానివిగా (చిదాభాసానికి సంబందించినవిగా)
అంగీకరించాలి.

అజ్ఞానమనేది చిదాభాసమైన జీవుని ఆశ్రయించినదైతే, పూర్వాచార్యులంతా బ్రహ్మాన్ని అజ్ఞానానికి ఆశ్రయం అని ఎందుకు చెప్పారు ? అంటే,ఇందుకు సమాధానం -

పూర్వాచార్యులు 
(సంక్షేప శారీరకాది గ్రంథాలలో)అధిష్ఠాన రూపంలో బ్రహ్మను అజ్ఞానానికి ఆశ్రయంగా చెప్పారు - సమస్త ఆరోపిత ప్రపంచానికీ ఆశ్రయం పరబ్రహ్మమే కాబట్టి !

నేను అజ్ఞానాభిమానినయిన
(చిదాభాసయైన జీవుడు అజ్ఞానాభిమాని కాబట్టి) అజ్ఞాన మనేది జీవాశ్రితం అన్నాను.అంటే అజ్ఞానమనేది జీవుని దశ అని చెప్పాను.

కాబట్టి పూర్వాచార్యులు చెప్పిన వచనంతో విరోధమేమీ లేదు. 

No comments:

Post a Comment