కాఫీ కబుర్లు సంఖ్య 858 (ఏప్రిల్ 01 - 2025) -- హేపీ ఏప్రిల్ -- కొత్త ఆంగ్ల సంవత్సరం 2025లో అపుడే నాలుగవ నెల ఐన ఏప్రిల్ లో ప్రవేశించిన సందర్భంగా ఏప్రిల్ కబుర్లు సరదాగా చెప్పుకుందాం. కొన్ని విశేషతలు ప్రత్యేకతలు కలగలిపిన మాసం ఏప్రిల్. భారతదేశ రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ లోనే జన్మించారు. తోబుట్టువులు దినోత్సవంతో పాటు మరికొన్ని ఇతర important days ఈ నెలలో ఉన్నాయి. శ్రీరామనవమి పండుగ నవరాత్రులు జరిగేది ఈ నెలలోనే. ఇది వసంత ఋతువులో ఓ భాగం. ఏప్రిల్ పూలు వెదజల్లింది, మే (నెల) పూలు తెచ్చింది.. అని ఓ పాత సామెత ఉంది. ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది ఈరోజునే అంటే ఎప్రిల్ 1 వ తారీఖు నాడే. పాఠశాల కళాశాల విద్యార్థులకు పెద్ద పరీక్షలు అయ్యాక సుమారు రెండు నెలలు వేసవి సెలవులు మొదలయ్యేది ఏప్రిల్ లోనే. ఏప్రిల్ & మే మండుటెండల మాసాలు.. పూర్తి వేసవిలో వస్తాయి గనుక. ఇక ఈరోజు ఏప్రిల్ 1న ఆల్ ఫూల్స్ డే అంటారు. చిలిపి సరదా ఆటపట్టించే పనులు ఈరోజున చేయడం పరిపాటి. ఇది ఎక్కువగా పిల్లల్లో యువతరంలో కానవస్తుంది. నీ చొక్కా వెనకాతల గొంగళీపురుగు ఉందని భయపెట్టడం, ఇప్పి చూసేసరికి (ఉండదు గనుక) ఏప్రిల్ ఫూల్ అని ఆట పట్టించడం వంటి సరదా కొంటె పనులు ఈరోజు చేస్తారు. ఓ చాక్లెట్ రేపర్ లో ఓ చిన్నరాయి చుట్టి ఇవ్వడం, ఇప్పి చూసేక ఏప్రిల్ ఫూల్ అనడం వంటివి 8వ తరగతిలో ఈరోజు నేను చేసిన చిలిపి పనులు. ఆ అబ్బాయి మా క్లాస్ టీచర్ కి పిర్యాదు చెయ్యడం, ఐదు నిమిషాలు నన్ను బెంచీపై నిలబెట్టడం.. ఇప్పుడొక సరదా జ్ఞాపకం. 1964లో బిశ్వజీత్ సైరాబాను హీరో హీరోయిన్లుగా వచ్చిన హిందీ హిట్ చిత్రం ఏప్రిల్ ఫూల్. శంకర్ జైకిషన్ స్వరపరిచిన టైటిల్ సాంగ్ తో పాటు అన్ని పాటలు సూపర్ హిట్సే. అక్కినేని నాగేశ్వరరావు కేరీర్ టాప్ హీరోగా దేదీప్యమానంగా వెలిగిపోతున్న రోజుల్లో ఓ తెలుగు సినీ వారపత్రిక.. నటనకి స్వస్తి చెప్పబోతున్న నటసామ్రాట్.. అంటూ ఏప్రిల్ 1న వెలువడ్డ ఆ పత్రికలో (పేరు గుర్తులేదు) మొదటి పేజీలోనే ఓ కథనం ప్రచురించింది. చివర.. మిగతా వెనుక పేజీలో.. అని ఉంది. వెనుక పేజీ చూశాక అనేకమంది అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.. కారణం.. మొదటి పేజీ ఏప్రీల్ ఫూల్ పేజీ అని ఉంది. అభిమానులను పాఠకులను ఆ పత్రిక ఈవిధంగా ఫూల్స్ చేసి ఆటపట్టించింది. ఆ తర్వాత మరో యాభై ఏళ్లు అక్కినేని సినీ నట జీవితం కొనసాగింది. యీ ఏప్రిల్ ఫూల్స్ డే సంస్కృతి రెండు శతాబ్దాల క్రితం రోమన్ లో మొదలై అన్ని దేశాలకు పాకింది. లవ్వర్స్ కూడా ఒకరికొకరు ఫూల్స్ చేసుకుంటూ ఈరోజు గడుపుతారు. నా రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టింది యీ ఏప్రిల్ ఒకటినే (1971). ఈవిధంగా ఈరోజు నాకు ఓ memorable day. ఆంగ్లంలో ఓ చిన్న సరదా కథ.. Am I a fool.. అని రాశాను. గానీ ఎవ్వరికీ చూపించలేదు ధైర్యం చాలక. కొన్నాళ్ళ తరువాత మా ఆంగ్ల లెక్చరర్ అవసరాల రామకృష్ణారావు గారికి చూపిస్తే రెండు మూడు చిన్న సవరణలు చేసి బాగుంది అని చెప్పడంతో నాకు ధైర్యం వచ్చింది. క్రమంగా సినీ అడ్వాన్స్, స్క్రీన్, కారవాన్, విజయచిత్ర, హాసం, తెలుగు వెలుగు పత్రికలలో నా ఉత్తరాలు, అభిప్రాయాలు నేను పంపినవి వచ్చాయి. 1991-92 ప్రాంతాల్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఆంగ్ల దినపత్రికలో ఓ 15 వరకు నా లెటర్స్ వేసేరు. 1978-79 లలో రెండు విఫల ప్రేమకథలు కూడా రాసి ఉంచుకున్నాను. గానీ ఏ పత్రికకి పంపలేదు. ఇవి ఏప్రిల్ & ఏప్రిల్ ఒకటి ప్రత్యేకతలు. అన్నట్లు .. రాజేంద్ర ప్రసాద్, శోభన నటించిన.. ఏప్రిల్ 1 విడుదల.. సినిమా 90వ దశకంలో వచ్చింది. ఏప్రిల్ ఫూల్ సరదాలు ఇప్పుడు అంతగా లేవు. ఈతరం వాళ్ళకి అంతగా తెలియక పోవచ్చు కూడా. ఎవర్ హేపీ మంత్ గా యీ ఏప్రిల్ మనందరికీ ఉండాలని కోరుకుందాం.. ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
No comments:
Post a Comment