అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-463.
4️⃣6️⃣3️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*48. వ శ్లోకము:*
*”సహజం కర్మ కౌన్తేయ! సదోషమపి న త్యజేత్l*
*సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాఃll”*
“ఓ అర్జునా! మానవులకు తమ స్వభావసిద్ధమైన కర్మ దోషములో కూడినది అయినను, స్వధర్మమును వదలకూడదు. ఎలాగంటే అగ్ని ఎంతటి ప్రకాశాన్ని ఇస్తున్నా అగ్ని పొగతో కప్పబడి ఉన్నట్టు, ఈ లోకంలో చేయబడే ప్రతి కర్మ కూడా ఏదో ఒక దోషముతో కప్పబడి ఉంది.”
```
కర్మల గురించి మరి కొంచెం వివరంగా చెబుతున్నాడు పరమాత్మ. పరిశుద్ధమైన కర్మ అంటూ ఏదీ లేదు. అన్ని కర్మలు మూడు గుణముల హెచ్చుతగ్గులతో కప్పబడి ఉంటాయి. కాబట్టి ప్రతి కర్మలోనూ ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. అగ్ని పవిత్రమైనది. ప్రకాశాన్ని ఇస్తుంది. వెలుగును ఇస్తుంది. కానీ అగ్ని పక్కనే పొగ కూడా ఉంటుంది. పొగ ఉందని చెప్పి అగ్నిని వదిలిపెట్టలేము కదా. అలాగే ప్రతి కర్మలో వాటి గుణముల భేదములను అనుసరించి ఏదో ఒక దోషం ఉండనే ఉంటుంది. ఏదో దోషం ఉందని చెప్పి ఆయా కర్మలు చేయకుండా ఉండకూడదు. ఆ దోషములను వదిలిపెట్టి కర్మలు చేయాలి కానీ ఏదో దోషం ఉందని మొత్తం కర్మనే వదలడం మంచిది కాదు. నిష్కామంగా, ఫలాపేక్ష లేకుండా చేస్తే, కర్మఫలములను భగవంతుడికి అర్చిస్తే, ఆ కర్మలలో దోషం ఉన్నా, ఆ కర్మల వాసనలు అంటవు. ఇక్కడ కర్మ అంటే విహిత కర్మ అంటే చేయదగిన కర్మ అని అర్థం. చేయకూడని కర్మల గురించి ఇక్కడ చెప్పడం లేదు. చేయదగిన కర్మలలో గుణభేదము వలన దోషములు ఉన్నా వాటిని పరమాత్మ పరంగా చేస్తే, వాటి వాసనలు మనకు అంటవు అని చెబుతున్నాడు పరమాత్మ.
ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, మనం దైనందిన జీవితంలో మనకు తెలియకుండా జీవహింస చేస్తుంటాము. కాళ్ల కిందపడి ఎన్నోజీవులు మరణిస్తుంటాయి. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా పంచ మహాయజ్ఞములు చేయమన్నారు.
1. బ్రహ్మయజ్ఞము (దేవతలను ఆరాధించడం, శాస్త్రములు చదవడం, వినడం)
2. పితృయజ్ఞము అంటే పితృదేవతలను ఆరాధించడం, జలతర్పణములు, పిండప్రదానములు చేయడం.
3. దేవ యజ్ఞము అంటే సకల దేవతారాధన, హోమములు చేయడం, పూజలు, వ్రతాలు చేయడం.
4. భూతయజ్ఞము అంటే సాటి ప్రాణులకు ఆహారం పెట్టడం.
5. మనుష్య యజ్ఞము అంటే బ్రాహ్మణులకు, అతిధులకు, పేదవారికి భోజనం పెట్టి తృప్తి పరచడం, వీటి వలన మనకు తెలియకుండా చేసిన పాపములు నశించిపోతాయి.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment