*"చద్దన్నాల బ్యాచ్ !"*
💐💐💐💐💐💐
మా చిన్నప్పుడు, మా ఇంట్లో ఉన్న మా ఐదుగురు పిల్లకాయలకీ "చద్దన్నాల బ్యాచ్" అని పేరు.
అంటే...పొద్దున్నే ఇస్కూల్ కి వెళ్ళాల్సిన బడి పిల్లలందరికీ, బ్రేక్ ఫాస్టుగా చద్దన్నం పెట్టేవాళ్ళన్నమాట ! కాఫీ ఉప్మాలు, ఉప్మా పెసరట్లు, పూరీ కూరలు, అప్పటికింకా మధ్యతరగతి జనబాహుళ్యంలోకి రాలేదన్న మాట !
కాబట్టి, రాత్రి అన్నం ఒండేటప్పుడే, రాత్రి ఇంట్లో అందరూ తినడానికి సరిపడా వండేసి, పొద్దున్నే పిల్లకాయలు ఊరగాయలు - పెరుగుతో లాగించడానికి వీలుగా, ఇంకో అరవీశ బియ్యం అత్తెసరుగా పడేసేవారు.
ఆ చద్దన్నాలు మిగిలిన వంటసామాగ్రితో కలవకూడదు కాబట్టి, దానికి పక్క వసారాలో "చద్దన్నాల గూడు" అని ప్రత్యేకంగా కట్టించిన ఏర్పాటు ఉండేది.
పళ్ళు తోముకుని, స్నానాల్లాంటివి కానిచ్చి, ఆవురావురుమంటూ, చద్దన్నాల వసారా గూట్లోంచి చద్దన్నం బయటికి లాగి, అందరం బాసింపట్లు వేసుక్కూర్చుని, చద్దన్నాల మీటింగు పెట్టుకుని, జోకులేసుకుంటూ, దానికి న్యాయం చేసి, స్కూలుకి పరిగెత్తడం...నిన్న మొన్నలా ఉంది...
పొద్దున్నే ఆ చద్దన్నం పడకపోతే, తిక్కగా ఉండేది.
అన్నట్టు, చాలామంది పిల్లల తల్లులు కూడా, ఒక వయసు వచ్చేదాకా ఆ చద్దన్నం అలవాటు మానుకోలేక, అలాగే కానిచ్చే వారని...చరిత్ర చెబుతోంది !
💐💐
ఇప్పుడు, ఈ నవయుగంలో, ఖరీదైన, ఆధునిక బ్రేక్ ఫాస్ట్ ల కాలంలో, వంటలకోసం అస్సలు శ్రమ పడక్కర్లేకుండా, అన్ని రకాల వంటలకి, పిండివంటలకి, రెడీమేడ్ గా ఇడ్లీలకి, దోశలకి, గారెలకి, పెసరట్లకి, చపాతీలకి, పరాటాలకి, అన్ని రకాల పిండివంటలకి కావలసిన పిండిలన్నీ, వాళ్ళే రుబ్బేసి, కలిపేసి, అవి పాడైపోకుండా ఆధునిక శాస్త్ర పరిజ్ఞానంతో నిల్వ ఉండేట్టు వాటిలో ఏవేవో కలిపేసి, అమ్మేస్తుంటే...వాటిని కష్టపడి కొని తెచ్చుకుని, ఫ్రిజ్జుల్లో పెట్టుకుని, మైక్రోవేవుల్లో వేడి చేసుకుని, లేక టిఫిన్లుగా తయారు చేసుకునే ఈ రోజుల్లో...చద్దన్నాల గొడవ ఎందుకొచ్చిందీ అంటే...
💐💐
సెల్ ఫోన్లు తెరవగానే, గుంపులు గుంపులుగాను, విడివిడిగాను, ప్రత్యక్షమయ్యే వైద్యనాథులు, తమ ఉచిత ప్రజాసేవలో భాగంగా, అప్పటి మా చద్దన్నం మహిమను ఇప్పుడు గుర్తించి, మన జీర్ణప్రక్రియకి ఉపయోగిస్తూ, మేలుచేసే మంచి "గట్ బ్యాక్టీరియా", రాత్రి వండి, గూట్లో దాచిన (ఫ్రిజ్ లో కాదు) అన్నం నిండా చేరిపోయి, దాన్ని తిన్నవాళ్ళందరికీ మీదుమిక్కిలిగా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, చక్కరవ్యాధి నుండి అన్ని రోగాల్ని ఉఫ్ఫుమని ఊదేస్తుందని ఊదరగొట్టేస్తుంటే, ఆమధ్య జగపతిబాబు కూడా ఒద్దికగా కూచుని, చద్దన్నం తిని చూపించాడు కాబట్టి, "సర్లే, వాళ్ళెందుకు చెప్పారో" అనుకుని, మా ఇంట్లో మళ్ళీ ఒక చిన్న చద్దన్నం గూడు ఏర్పాటు చేశాం !
ఈమధ్య, అమెరికాలో కూడా, చద్దన్నం మహత్యం తెలుసుకుని, వెయ్యి రూపాయలకి ఒక చద్దన్నం ప్యాకెట్ కూడా అమ్ముతున్నారుట !
అందుకే, ఇడ్లీలు, దోశలు, ఓట్స్ ఉప్మాలు, పొంగళ్ళు, గోధుమ ఉప్మాలు, కొన్నాళ్ళుగా పక్కన పెట్టేసి, ఇంట్లో ఉన్న "విశిష్ట పౌరులిద్దరం" మళ్ళీ కొన్నాళ్ళుగా చద్దన్నం మీద పడ్డాం !
ఇప్పుడు మా ఇంట్లో మళ్ళీ మేమే "చద్దన్నం బ్యాచ్" అన్నమాట !
ఏంటో...వేళకి ఆ చద్దన్నం పడకపోతే, తిక్కగా ఉంటోంది !
ఆ తిక్క తీరిపోతే, జీవితనావ హాయిగా సాగిపోతోంది...
కాకపోతే తేడా ఏంటంటే...
చిన్నప్పుడు చద్దన్నమే మాకిష్టమైన ఆహారం...
ఇప్పుడు ఆ చద్దన్నమే మా ఆరోగ్య పీయూషం !
ఆరోగ్యమస్తు !
*వారణాసి సుధాకర్.*
💐💐💐💐💐💐
No comments:
Post a Comment