Friday, April 4, 2025

 "పరిప్రశ్న - గురుబోధ" 
- శాస్త్రి ఆత్రేయ.

ప. పరమాత్మ ఎవరు?
గు. అంతటా, అన్నింటిలో, అన్నికాలాల్లో విరాజిల్లే సద్వస్తువు!

ప. జీవుడు, పరమాత్మ ఒక్కటేనా?
గు. ఇరువురికి ఉపాధిలో తేడావున్నా, చైతన్యాంశ మాత్రం ఒక్కటే!

ప. జీవుని దేహంలో పరమాత్మ నిజంగా వున్నాడా?
గు. దేవాలయమనే జీవుని దేహంలో, “ఆత్మస్వరూపంగా” వుంటాడు పరమాత్మ!

ప. ఆత్మను ఎలా గ్రహించగలం?
గు. నేనున్నాను! అని నీ చేత అనిపిస్తున్నది నీ ఆత్మే!

ప. ఆత్మే భగవంతుడా?
గు. అవును, ఆత్మే భగవంతుడు! ఆత్మ కంటే భిన్నంగా వుంటే అతడు “పరమాత్మ” కాలేడు!

ప. భగవంతునికి ఆకారం లేదా?
గు. పరిమళానికి ఆకారం లేదుగానీ, పువ్వుకి వుందికదా! అవ్యక్తమైన నిరాకారం, సాకారంగా వ్యక్తమౌతోంది! అదే జీవుడు!

ప. భగవంతుణ్ణి చూచేనని చెప్పడం అబద్దమా?
గు. అబద్దం కాదు, అది నిజమే! అయితే వారు చూసింది ఏంటి? అంతటా వ్యాపించివున్న చైతన్యమా! లేకా వారు ఉపాసించే సాకార దైవమా!

ప. అయితే భక్తుడు భగవంతుణ్ణి ఎలా దర్శించాలి?
గు. భక్తుడు భగవంతుణ్ణి ఒక ప్రత్యేకమైన రూపంలో దర్శించాలని ఆశించకూడదు! అతణ్ణి సర్వత్రా దర్శించే ప్రయత్నం చెయ్యాలి!

ప. ఆత్మజ్ఞానం లేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేమా?
గు. అసలు తానెవడో తనకు తెలియకుండా, భగవంతుణ్ణి తెలుసుకోవడం అసాధ్యం! భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ముందు తాను భగవంతుడు కావాలి!

No comments:

Post a Comment