అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
భగవద్గీత… ధారావాహిక-462.
4️⃣6️⃣2️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
(సరళమైన తెలుగులో)
*18. మోక్ష సన్యాస యోగము*
(పదునెనిమిదవ అధ్యాయము)
_________________________
*47. వ శ్లోకము:*
*”శ్రేయాన్స్వధర్మోవిగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్l*
*స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్॥”*
“తనకు నిర్దేశింపబడిన ధర్మము అంటే స్వధర్మము గుణము లేనిదిగా కనపడినప్పటికినీ, కష్టతరమైనప్పటికినీ, ఇతర ధర్మములు ఎంత మంచివిగా కనపడినప్పటికిన్నీ, పరధర్మము కంటే స్వధర్మము శ్రేష్టమైనదే అవుతుంది. స్వధర్మాన్ని పాటిస్తే ఎటువంటి పాపము అంటదు.”
```
(ఇదే శ్లోకం మీకు మూడవ అధ్యాయం 35వ శ్లోకంగా కనిపిస్తుంది. ఆ శ్లోకాన్నే పదాలు మార్చి అదే భావాన్ని ఇక్కడ తెలియజేసారు వ్యాసుల వారు)
ప్రతి మానవుడికి ఒక ధర్మం, కర్తవ్యం ఉంటుంది. జంతువులకు కూడా ధర్మం ఉంటుంది. కుక్క విశ్వాసము. అది దాని ధర్మము. దాని ధర్మాన్ని అది ఎన్నటికీ విడిచిపెట్టదు. కాని మనిషి విశ్వాస ఘాతకం, నమ్మకద్రోహం చేయడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పాడు. క్రూర జంతువులకు క్రూరత్వం వాటి ధర్మం. ఆ క్రూరత్వాన్ని మానవుడు పుణికిపుచ్చుకున్నాడు. క్రూర జంతువులను మించి పోయాడు. పిల్లి తన తోటి పిల్లిని చంపదు. పులి సాటి పులిని చంపదు. కాని మానవుడు తన తోటి మానవుని చంపుతున్నాడు. అంటే మానవునికి తన స్వధర్మం కంటే పరధర్మం మీద మక్కువ ఎక్కువ. మానవ ధర్మం మానవత్వం, అందరినీ సమానంగా తన మాదిరి చూడటం. ఇది చాలా కష్టం. అందుకే మానవుడు అందరినీ భేదబుద్ధితోనే చూస్తున్నాడు. అంటే మానవులు ఎవరి ధర్మం వారు పాటించడం లేదు. పరధర్మాన్ని పాటిస్తున్నారు.
స్వధర్మం ఆచరించడం చాలా కష్టం. కాబట్టి స్వధర్మం పనికిరాదు అని అవివేకంతో అనుకుంటూ ఉంటారు. పరధర్మం చాలా మంచిది అని భావిస్తుంటారు. ఎలాగంటే విద్యార్థి ధర్మం పాఠశాలకు వెళ్లి కాలేజీకి వెళ్లి చదువుకోవడం, చదువుకున్న పాఠాలు రాత్రి వల్లెవేయడం. ఇది చాలా కష్టం. కాని స్కూలు కాలేజీ ఎగ్గొట్టి తిరగడం పరధర్మం, అది చాలా సుఖం. అలాగే ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమ తను విద్యుక్త ధర్మమును వదిలిపెట్టి స్వలాభం కోసం రాజకీయాలలో, ఇతర వ్యాపకాలలో పాల్గొంటున్నారు. రాజకీయ నాయకులకు ప్రజాసేవ ధర్మము. కాని వారు తమ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తాము ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకోవడం స్వధర్మం. అంటే నేను ఎవరు? కోహం? నేను వేరు దేహము వేరు అని తెలుసుకోవడం, నిష్కామ కర్మలు చేయడం, భగవంతుని సేవించడం. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం ఇది స్వధర్మం, ఇది చాలా కష్టం. నేనే ఈ శరీరము, ఇదంతా నాది, ఈ ప్రాపంచిక సుఖములు అనుభవిస్తాను, ఆస్తులు, భార్యాబిడ్డలు, బంధుమిత్రులే నా సర్వస్వం అనడం పరధర్మం. ఇది చాలా సుఖంగా ఆనందంగా ఉంటుంది.
ఆఖరుగా ఒక్క మాట. ప్రతి వ్యక్తికీ వివాహ బంధం ఉంటుంది. భార్యను సహధర్మచారిణిగా చూడటం భర్త ధర్మం. భార్యను వదిలిపెట్టి ఇతర స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం పరధర్మం. ఇదే సూత్రం స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భార్య భర్తలు ఎవరి ధర్మం వారు నిర్వర్తిస్తే, ఈ నేరాలు ఘోరాలకు ఆస్కారమే ఉండదు అని గ్రహించాలి. రాముడు స్వధర్మాన్ని పాటించాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. రావణుడు పరధర్మాన్ని ఆశ్రయించాడు. ఇతరుల సొత్తుకు ఆశించాడు. ఉన్న రాజ్యం పోయింది. తుదకు ప్రాణం కూడా పోయింది. ఇదే మంచి ఉదాహరణ.
ఎవరైతే కొంచెం కష్టమైనా స్వధర్మాన్ని పాటిస్తూ, పరధర్మం జోలికి పోకుండా ఉంటే, అతడికి ఎటువంటి పాపము అంటదు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే స్వధర్మము అంటే ఆత్మధర్మము. ఆత్మజ్ఞానం సంపాదించడం. అలా కాకుండా ధనసంపాదనే ధ్యేయంగా, ప్రపంచ జ్ఞానం మాత్రమే సంపాదించడం పరధర్మం.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment