మనిషికి సంకల్పశక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు. అది ఎలాగో తెలుసుకుందాం.
సంకల్పం అంటే.. 'చేయదలచుకున్న పనిని మనసా వాచా కర్మణా నమ్మి పూర్తి చేయ గలగడం' అంటారు దైవజ్ఞులు. ఆ పని ఐహికమైన అభివృద్ధి కావచ్చు.. ఆధ్యాత్మికమైన సాధన కావచ్చు! 'సంకల్పం అనేది ఆత్మ మనస్సుల సంగమం' అంటారు స్వామి వివేకా నంద. మనిషి ఆధ్యాత్మిక సాధనలో భగవంతుడి ప్రేమ అపారంగా పొందాలంటే, తనను తాను అన్నివిధాలా తీర్చిదిద్దుకోవాలి. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా త్రికరణ శుద్ధిగా అధి గమించాలి. 'తలపుల్లోగాని, వాక్కుతోగాని, చేష్టలతోగాని, ఏ ప్రాణికి అపకారం తలపెట్టను' అని మనసులో ప్రమాణం చేయాలి. సర్వశక్తిమంతుడు, సర్వవిదుడు, ప్రేమ సింధువు అయిన ఆ అంతర్యామిలో నేనొక భాగమనే భావనతో ఈరోజును ప్రారంభిస్తున్నాను' అని సంకల్పం చెప్పుకోవాలి. అలా ప్రతిరోజు చేయడం వల్ల ఆధ్యాత్మిక సాధనలో సాధ కుడు మరో మెట్టు ఎక్కుతూ ఉంటాడు. ఆ భగవంతుడి దయకు పాత్రుడవుతూ ఉంటాడు.
సంకల్పం వల్ల ఆలోచనలకు స్థిరత్వం సిద్ధిస్తుంది. మనం సంకల్పిం చిన ధ్యేయం దగ్గరవుతుంది. సాధారణంగా మనమందరం, జీవితంలో ఏ సందర్భంలోనైనా విజయాన్నే కోరుకుంటాం. అయితే కొంతమంది మాత్రమే దాన్ని సాధిస్తారు. కొంతమంది విజయం దిశగా పరుగు పెట్టి మధ్యలోనే ఆగిపోతారు. జీవితంలో జయాపజయాలకు కారణాలెన్ని ఉన్నా, సంకల్పశక్తి బలంగా లేకపోవడమే ఓటమికి ముఖ్య కారణమని చెప్పొచ్చు.
అలాగే మనిషి నైతికంగా బతకాలి, రుజుమార్గంలో నడవాలి- అనుకున్నప్పుడు సంకల్పబలం స్థిరంగా ఉండాలి. సంకల్పం బలంగా లేకపోతే గమనం పక్కదారి పడుతుంది. ఆలోచనలు స్థిమితంగా ఉండవు.
మద్యం తాగడం మంచిది కాదని , మాంసాహారం తీసుకోవడం కూడా మంచిది కాదని, మోసం చేయడం, అబద్ధాలు ఆడకూడదని ప్రతి మనిషికి తెలుసు. అది జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని, ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందని తెలుసు. అయినా మనిషి సరదాగా ప్రారం భించి క్రమంగా దానికి బానిసైపోతాడు. మానతానని ఎన్ని ప్రమాణాలు చేసినా నిలబెట్టు కోలేడు. సంకల్పబలానికి గొప్ప ఉదాహరణ.. గాంధీజీ! అడుగడుగునా అవాంతరాలు ఎదు రైనా మొక్కవోని దీక్షతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహనీయుడు. ఒక మామూలు వ్యక్తిని స్వాతంత్రోద్యమ సారథిని చేసింది కేవలం ఆయన సంకల్ప బలమే నన్నది జగమెరిగిన సత్యం. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా... చరిత్రలో ఇంకా ఎందరో మహానుభావులు కేవలం సంకల్ప బలంతోనే గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తిం చారు. తమ ధ్యేయాన్ని నెరవేర్చుకుని చరితార్థులయ్యారు. మనిషికి ఈ సంకల్పశక్తి బలంగా ఉంటే దేన్నైనా సాధించగలడు..
ఇన్ని సుగుణాలు మనిషికి ఆషామాషీగా రావు... మనసు నిలకడగా ఉండాలి, మనసు చేసే ప్రతి అలోచన పాజిటివ్ గా ఉండాలి... అందుకే కొంత సమయాన్ని సరైన సాధన కోసం కేటాయించాలి.
(మానస సరోవరం) కళ్లెం రామిరెడ్డి గారి సందేశానికి కొద్ది మార్పులతో వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలతో... పసుపుల పుల్లారావు..
No comments:
Post a Comment