*సీతాదేవి సందేశం.....*
*దుష్టశిక్షణ శిష్టరక్షణలో భాగంగా, రాక్షససంహారంతో పాటు రావణసంహారం చేసి, లోకకల్యాణం జరిపించడానికి జనియించింది జానకీదేవి. ఆమె జీవనంలోని అడుగడుగూ నేటి సమాజానికి ఆదర్శమై, అనుకరణ యోగ్యమైన జీవిత సందేశాలను అందిస్తుంది.*
*దివ్య సౌందర్యం, దేదీప్యమానమైన తేజం, అచంచలమైన పతిభక్తితత్వం, అసాధారణ పాతివ్రత్యం, ధర్మ పరాయణత్వం, నిర్భయత్వం, సౌశీల్యం, త్యాగం, సహనశీలత్వం, సౌహార్థం, సంయమనం, సేవాతత్వం, సదాచారం, సాహసం, శౌర్యం, వినయం, క్షమాగుణం, ఇలా లెక్కకు మిక్కిలిగా మేలి సుగుణాల రాశి సీతమ్మ.*
*తండ్రిమాట నిలపడంకోసం అరణ్యాలకు వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు రాముడు. సీత దగ్గరికి వచ్చి విషయాన్ని తెలిపి, సీతను అయోధ్యలో జాగ్రత్తగా ఉండమని, తాను అరణ్యాలకు వెళ్ళి వస్తానన్నాడు.*
*అందుకు సీత రాముడితో, 'సమస్తసుఖాలకు నిలయమైన రాజభవనాల్లో నివసించుటకంటే, స్వర్గాది లోకాల్లో విమానాల్లో విహరించుటకంటే, అస్టైశ్వర్యసంపదలతో అంబరమున హాయిగా సంచరించుటకంటే, ఎన్నికష్టాలు అనుభవించాల్సివచ్చినా పతి అడుగుజాడల్లో సాగిపోవడమే సతికి సుఖప్రదం, శుభప్రదం, ధర్మసమ్మతం. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా వాటికి నేను ఇష్టపడను. మీ వెంట ఉండటం తప్ప ఇంక నాకేమీ అక్కరలేదు. మీరు నాతో ఉంటే చాలు ఎంత కష్టమైనా నాకు సుఖంగానే అనిపిస్తుంది. అక్కడ మీకు ఏ విధంగాను భారంకాను. నీవు నాకు దూరమైతే నేను మరణించటం తథ్యం. నా ప్రార్థనను మన్నించి నన్ను మీవెంటే తీసుకు వెళ్లండి. సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా ఎప్పుడు భర్తవెంటే భార్య ఉండాలని, భర్త తోడులేనపుడు ఎంతటి సుఖమైనా వ్యర్థమేనని, భార్యాభర్తల శరీరాలు రెండైనా ఆత్మ ఒక్కటే అన్న చందంగా జీవించాలని చెప్పింది సీతమ్మ.*
*సీత అరణ్యాల్లో కూడా ఆనందంగా, నిర్భయంగా రామునితో ఉండేది. అడవుల్లో తపస్సు చేసుకునే ఋషులు, రాక్షసులు పెడుతున్న బాధలను శ్రీరామునికి వివరించి, వారిని కాపాడమని కోరారు. రాముడు రాక్షసులందరినీ సంహరించి వారిని కాపాడుతానని మాట ఇచ్చాడు. ఆ తరువాత రాముడితో దారి మధ్యలో, రాక్షసులతో అకారణ వైరం వద్దని, హింసకు దూరంగా ఉండి ప్రశాంతంగా తాపసధర్మాన్ని స్వీకరించి పద్నాలుగేండ్లు అరణ్యవాసం పూర్తి చేసుకొని అయోధ్యకు తిరిగి వెళదాం అనే ధర్మాన్ని సీతమ్మ భర్తకు బోధించింది. అకారణవైరం ఎప్పుడూ ఎవరితోనూ మంచిది కాదనేదే సీతాసందేశం.*
*యతివేషంలో వచ్చి సీతను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించి, తర్వాత తన నిజరూపాన్ని చూపి భయపెట్టిన రావణుడు లంకకు సీతను ఎత్తుకొని వెళ్ళి అక్కడ తన గొప్పదనాలు చూపి, రకరకాల ఆశలు పెట్టి, పరిపరి విధాలుగా భయపెట్టి, నయాన్నో, భయాన్నో సీతను లొంగ దీసుకోవాలి అని ప్రయత్నించిన రావణుడితో సీత ఇలా చెప్పింది. నేను రామపత్నిని, పతివ్రతను, ఆడసింహాన్ని, రాముని ముందు నీవు గడ్డిపరకతో సమానం. కోరి ప్రాణాలమీదికి తెచ్చుకోకు. నా పతియే నాకు దైవం. రాముడు లేనప్పుడు దొంగగా నన్ను అపహరించుకొని వచ్చావు. నీ ప్రాణాలు తీసి నా స్వామి నన్ను తీసుకు వెళతాడు. నా ప్రాణం పోయినా నేను రాముడిని తప్ప అన్యులను కన్నెత్తి కూడా చూడనని చెప్పింది. ఆపదలు ఎదురైనా మొక్కవోని నిర్భయత్వం, ప్రలోభాలకు లొంగని పతివ్రతాతత్వం, ఇవన్నీ కూడా నేటి సమాజానికి సీత ఇచ్చిన సందేశాలు ఎంతో మార్గదర్శకం.*
*హనుమంతుడు లంకలో ఉన్న సీతను ఎన్నో హింసలకు గురిచేసిన రాక్షసకాంతలను చంపేస్తాను, అనుమతి ఇవ్వమని అడిగాడు. అందుకు సీత హనుమా! వాళ్ళు రావణుడి దాసీజనం. వాళ్ళరాజు ఏమి చెప్పాడో అదే వాళ్ళు చేశారు. దోషం వాళ్ళది కాదు, ప్రభువుది. చెడు చేసినవానిపట్ల దయ ఉండాలి. అంతా మంచిగా ఉన్న వాడిమీద దయ ఎందుకు? కాబట్టి ఈ రాక్షసస్త్రీలపట్ల నేను దయతో ఉండాలి. నీవు ఇటువంటి వరం కోరకూడదు. వాళ్ళను చంపకూడదు. వీళ్ళందరికీ నారక్ష అని సీత హనుమంతుడితో పలికింది. ఇవి సీతమాతయొక్క దయ, క్షమాగుణాలు. భారతీయ స్త్రీలు ఇటువంటి గుణాలు కలిగి మంచి సంస్కారం కలిగి ఉండాలని సీత సమాజానికి సందేశాన్నిచ్చింది.*
*పద్నాలుగుసంవత్సరాల అరణ్యవాసానంతరం అయోధ్యలో పట్టాభిషేకానంతరం రాముడు సీత ఆనందంగా జీవిస్తున్నారు. సీత గర్భవతి అయ్యింది. మళ్ళీ లోకంలో ఎవరో సీతపై అపవాదు వేశారని వేగులు తెలపడంతో, రాముడు సీతను అడవుల్లో వదిలి రమ్మని లక్ష్మణుడితో కలిపి పంపాడు. గర్భవతియైన సీతను ఒంటరిగా అడవుల్లో రాముడి ఆజ్ఞ ప్రకారం వదిలి వెళ్ళిపోతున్న లక్ష్మణుడితో రాముడికి ఇలా తెలపమని, క్రింది విధంగా చెప్పింది.*
*లోకాపవాదం వల్ల రామునిపై వచ్చిన నిందను తొలగించడం భార్యగా నా ధర్మం. స్త్రీకి పతియే దైవం, బంధువు, గురువు, ప్రాణములకంటే మిన్న అన్నది. లోకులను కానీ, రాముణ్ణి కానీ, ఎవ్వరినీ సీత ఎన్నడూ నిందించని మహానుభావురాలు.*
*మానవుడిగా పుట్టి మాధవుడైన శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని మించిన మహోజ్వలమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకొన్న సీతాదేవి జీవితంలోని అడుగడుగు ఆదర్శమే. సీత స్త్రీ జాతికి గర్వకారణం. ఆమె చరిత్ర లోకోపకారం. ఆమె జీవితంలోని ప్రతి అడుగూ ఆదర్శం.*
*పైన వివరించినట్లు నేటి సమాజానికి సీతాదేవి ఇచ్చే అమూల్యమైన సందేశాలు లెక్కకు మిక్కిలి. ఆ సందేశాలు ఆచంద్రతారార్కం మానవజాతి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శనం చేసే అద్భుతమైన అఖండజ్యోతులుగా వెలుగొందుతూనే ఉంటాయి.*
*┉┅━❀꧁జై మాత్రేనమః꧂❀━┅┉*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🪷🦚🪷 🙏🕉️🙏 🪷🦚🪷
No comments:
Post a Comment