Thursday, April 3, 2025

 వర్ధంతి నివాళి.. -- రచయిత కథకుడు మధురాంతకం రాజారావు -- కథా రచయితగా మంచిపేరు గాంచిన కథకులలో మధురాంతకం రాజారావు గారిది అగ్రస్థానం.  ఈయన కథా శైలి ఓవైపు క్లాస్ గా ఉంటూ మరోవైపు ఆధునిక పోకడలకు దగ్గరగా ఉండటం ఓ విశేషం.  చిత్తూరు జిల్లాకి చెందిన ఈయన 1930 అక్టోబర్ లో జన్మించారు.  ఆంధ్రపత్రిక, భారతి పత్రికలలో వచ్చిన రచనలు వీరిపై మంచి ప్రభావం చూపడమే కాకుండా ఓ మంచి రచయితగా తీర్చిదిద్దాయి.  వీరి తొలి గేయ రచన ఆంధ్రపత్రికలోనే ప్రచురితమైంది.  ఓ పక్క ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మరోవైపు విశేషమైన సాహితీ సేవ చేశారు.  కొందరు పెద్ద రచయితల రచనల ద్వారా స్పూర్తి పొందుతూ తనదైన శైలిలో సుమారు 400 వరకు కథలు రాశారు.  ఈయనకి చాలా మంచిపేరు తెచ్చిన కథలు చాలా ఉన్నాయి.  కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులతో మరికొన్ని విశిష్ట పురస్కారాలు ఈయనని వరించాయి.  మధురాంతకం గారి మొట్టమొదటి కథకే (కుంపట్లో కుసుమం) సాహిత్య అకాడమీ అవార్డు లభించడం ఓ అరుదైన గొప్ప విశేషం.  కొన్ని నాటకాలు, గేయాలు, సాహిత్య వ్యాసాలు తో పాటు రెండు నవలలు కూడా రాశారు.  ఈయన మొదటి నవల..  త్రిశంకుడి స్వర్గం లో ఇతివృత్తం చాలా భిన్నంగా ఉంటుంది.  ఈ నవల విశేష పాఠకాదరణ పొందింది.  ఈయన కథల్లో బాగా పేరుతెచ్చినవి ఓ పది కథాసంపుటాలుగా విశాలాంధ్ర బుక్ హౌస్ ప్రచురించింది.  మధురాంతకం రాజారావు గారి జీవిత విశేషాలతో పాటు ఈయన కథలను పరిచయం చేస్తూ..  రచయిత సింగమనేని నారాయణ రచించిన పుస్తకం రాష్ట్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది.  ఈయన మంచి  అనువాద రచయిత కూడా.  తమిళ కన్నడ హిందీ ఆంగ్ల భాష లలో అనువాదం చేశారు.  ఇతర భాషా రచనలను కొన్ని తెలుగులోకి అనువదించారు.  ఈయన పలు రచనలు రష్యా వరకు వెళ్ళడం ఓ విశేషం.  ఈయన ఇద్దరు కుమారులకి కూడా తెలుగు సాహిత్యంలో ప్రవేశం ఉంది.  పెద్దబ్బాయి నరేంద్ర శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా ఉంటున్నారు.  చిన్నబ్బాయి మహేంద్ర అకాల మరణానికి లోనవడం తండ్రి మధురాంతకం రాజారావు గారు మానసికంగా కృంగిపోయారు.  తన 69వ ఏట 1999లో ఈరోజే.. ఏప్రిల్ 1 ఉదయం మరణించారు.  ఈయన కథా సంకలనాలు కొన్ని నేటికీ విశాలాంధ్ర బుక్ హౌస్ లో లభ్యమవుతున్నాయి..‌  26వ వర్ధంతి సందర్భంగా..  ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం..

No comments:

Post a Comment