డబుర ధనలక్ష్మి కథలు
కథ: వెన్నెల వాన
పల్లె వాతావరణం.ఉదయాన్నే ఇంటిముందు కళ్ళాపి చల్లి ఇంటి ఆడపడుచులు రంగవల్లులు వేస్తుంటే.మరో వైపు కోడికూతతో పల్లె మేల్కొంది
అదే పనిగా రింగ్ అవుతున్న ఫోన్ రింగ్ తో నిద్ర లేచింది అనంతలక్ష్మి. అటువైపు నుండి కొడుకు సాకేత్ "అమ్మా బాగున్నావా. ఆరోగ్యం ఎలా ఉందమ్మా. ఓ ఆరునెలలు కంపెనీ నన్ను జర్మనీ కు పంపిస్తోంది. మీ కోడలు మహతి కి తోడుగా ఉండగలవా అమ్మా.అసలే మహతి వాళ్ళమ్మ చనిపోయి నెల రోజులు కావస్తోంది. మహతి ఇంకా ఆ దిగులు లోనే ఉందమ్మా.వాళ్ళ నాన్న ఇప్పుడు మహతి వాళ్ళ అన్నయ్య ఇంట్లో ఉంటున్నాడు.అన్నాడు బాధగా
"బాగున్నారా. సరేలే. ఇక్కడ పనులన్నీ చక్కబెట్టి రెండురోజుల్లో బయల్దేరి వస్తాను అంది అనంతలక్ష్మి
థాంక్స్ అమ్మా అంటూ కాసేపు వేరే విషయాలు మాట్లాడి ముగించాడు
మహతి తో ఉండాలంటే నే ఎక్కడలేని నీరసం ఆవహించింది అనంతలక్ష్మి లో. కానీ తప్పని పరిస్థితి. ఈ మధ్యనే మహతి తల్లి కాలం చేసింది. తను ఇంకా ఆ బాధలోనే ఉంటుంది.
ఏది ఏమైనా మహతి ముభావంగా ఉంటుంది.
అయినా తప్పదు వెళ్ళాలి కదా... అనుకుంది అనంతలక్ష్మి
@@@@@@@
అనంతలక్ష్మి భర్త రమణ కూడా ఈ మధ్యనే కాలం చేసాడు. అనంతలక్ష్మి దంపతులకు ఒక్కగానొక్క కొడుకు సాకేత్ అంటే ఎంతో ప్రేమ.
సాకేత్ చిన్నప్పటి నుంచి తెగ అల్లరి చేసేవాడు. ఇంటిపట్టున కుదురుగా ఉండక గొడవలు తీసుకొచ్చేవాడు.
ఊర్లో ఉన్న స్కూల్ లో ఐదవ తరగతి వరకు చదివాడు.
వేసవి సెలవులు వచ్చాయంటే సాకేత్ తల్లిదండ్రుల చేతికి చిక్కేవాడు కాదు.ఎప్పుడూ చెట్లెమ్మట ఎక్కి దిగుతూ ..చెరువు లో ఈతకు వెళ్ళేవాడు. చాలా సార్లు ప్రాణ గండాలు తప్పాయి కూడా.
ఇక ఇలాగే ఉంటే సాకేత్ భవిష్యత్తు ఏమవుతుందో అని కంగారు పడి దూరంగా ప్రైవేటు రెసిడెన్షియల్ స్కూల్ లో చేర్పించారు.
మొదట్లో ఉండనని గొడవ చేసినా చివరకు ఇక తప్పదని చదువుపై ఇష్టం పెంచుకున్నాడు సాకేత్. అలా అల్లరి తగ్గి చదువు పై దృష్టి పెట్టడంతో చదువులో చురుగ్గా తయారయ్యాడు.
హాస్టల్ మహాత్మ్యం ఏమో సాకేత్ అల్లరి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. సాకేత్ సెలవులకు ఇంటికి వచ్చినా అల్లరి ఉండేది కాదు. పైగా అల్లరి స్థానం లో పెద్దరికం వచ్చింది. తల్లిదండ్రుల విలువ వారి ప్రేమ ఎంత విలువైనవో తనకు హాస్టల్ లో ఉన్నప్పుడే తెలుసు. అందుకే ఎంతో మార్పు.
సాకేత్ ఇంటిపట్టునే ఉంటూ తల్లికి సాయంగా ఉంటూ కబుర్లు చెప్తూ గడిపేవాడు. తల్లి చేతి వంటను మెచ్చుకుంటే తల్లి అనంతలక్ష్మి మురిసిపోయేది. అనంతలక్ష్మి కి కూడా కొడుకంటే పంచ ప్రాణాలు. అనంతలక్ష్మి దంపతులకు సాకేత్ ను వదిలి ఉండడం కష్టంగా అనిపించినా సాకేత్ భవిష్యత్తు బాగుండాలని మనసుకు నచ్చ చెప్పుకునేవారు
సాకేత్ తండ్రి రమణది బట్టల వ్యాపారం. టీవీఎస్ బండిపై ఊరూరా తిరుగుతూ బాగానే సంపాదించే వాడు. ఒక్కగానొక్క కొడుకు అని సాకేత్ ను గారాబంగా చూస్తున్నా క్రమశిక్షణ కు ప్రాధాన్యత ఇచ్చేవాడు రమణ .
అలా సాకేత్ చదువు పూర్తయి పూనాలో ఉద్యోగం లో చేరాడు. అక్కడే తనతో పాటు జాబ్ చేసే మహతి నచ్చడంతో ముఖ్యంగా ఆమెది కూడా ఆంధ్రప్రదేశ్ కావడంతో పెళ్ళి ప్రస్తావన తీసుకొచ్చాడు సాకేత్.
మహతి కూడా అంగీకారం తెలిపింది. పెద్దల సంప్రదింపుల తో పచ్చటి పందిరిలో సాకేత్ మహతి పెళ్ళి బంధంతో ఒకటయ్యారు.
ఇక పెళ్ళి జరిగినప్పటి నుండి మహతి అనంతలక్ష్మి మనసుల్లో ఎన్నో సందేహాలు.
మహతి కూడా అనంతలక్ష్మి తో ఎక్కువ గా మాట్లాడేది కాదు. ప్రశ్న కు తగ్గ సమాధానంగా ఉండేది వారి సంభాషణ. సాకేత్ మహతి పెళ్ళి జరిగాక వారం రోజులపాటు మాత్రమే అనంతలక్ష్మి ఇంట్లో ఉన్నారు. తరువాత ఉద్యోగ బాధ్యతల వల్ల వెంటనే ఉద్యోగం లో చేరిపోయారు సాకేత్ మహతి.
కాలం ఎపుడూ ఒకేలా ఉండదు.
కాలం ఎన్నో పరీక్షలు పెడుతుంది . తట్టుకుని నిలబడి తేనే ముందుకు సాగుతాం. అలాగే అనంతలక్ష్మి ఇంట అనుకోని విషాదం.
రమణ కు రెండు కాళ్ళు చచ్చుబడిపోయాయి. కదలలేని పరిస్థితి.
ఇక అనంతలక్ష్మి దిగులు పడిపోయింది. సాకేత్ తండ్రి ని పూర్తి ఆరోగ్యంవంతుడిని చేయడం కోసం ఎంతో డబ్బు ఖర్చుపెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చూపించాడు.అయినా ప్రయోజనం లేకపోయింది.
ఇది ఇలా ఉంటే మహతి స్వతహాగా ఎక్కువగా మాట్లాడేది కాదు. కానీ అనంతలక్ష్మి అన్నా వదినలు ఓసారి పూనా వెళ్ళి ఓ నాలుగు రోజులపాటు సాకేత్ తో ఉన్నారు. ఇంటికి తిరిగొచ్చాక అనంతలక్ష్మి వాళ్ళ వదిన మహతిపై ఉన్నవీ లేనివీ చెప్పి మహతి అణకువైన అమ్మాయి కాదన్నట్టు చెప్పింది. అనంతలక్ష్మి మనసు నొచ్చుకుంది. అప్పటికే మహతితో ఫోన్ లో పొడిపొడిగా మాట్లాడే మాటలు కూడా తగ్గించేసింది అనంతలక్ష్మి.
రమణ ట్రీట్మెంట్ కోసం ఎనిమిది ఎకరాలున్న పొలంలో రెండెకరాలు అమ్మాల్సి వచ్చింది.అయినా రమణ ను కాపాడుకోలేక పోయారు. ఓ ఉదయం రమణ తుదిశ్వాస విడిచాడు. అనంతలక్ష్మి తోడును కోల్పోయింది.సాకేత్ మహతి వచ్చారు.అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇల్లు శోకసంద్రమైంది. సాకేత్ కు తండ్రి లోటు ఎంతో వెలితిగా అనిపించింది.
రమణ అనంతరం పంట చేను పై వచ్చే కౌలు డబ్బుతో అనంతలక్ష్మి జీవనం కొనసాగించేది.
ఒకప్పుడు సాకేత్ ను చదివించినపుడు కూడా ఖర్చుకు వెనుకాడలేదు అనంతలక్ష్మి దంపతులు.
ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా సాకేత్ మహతి ల డబ్బు వారి కి సరిపోతోంది. పైగా అడపాదడపా సాకేత్ ఖర్చులకు అనంతలక్ష్మి డబ్బు సర్దుతోంది.
ఇలా ఉండగా మహతి తల్లి కి బోన్ క్యాన్సర్ చివరి దశ అని హాస్పిటల్ పరీక్షల్లో తేలింది. ఎక్కువ డబ్బు అవసరమైంది. సాకేత్ పొలంను అమ్మకానికి పెట్టమని తల్లి అనంతలక్ష్మి కి చెప్పాడు. కౌలు చేస్తున్న వ్యక్తి ఇంకా తమ ఒప్పందం మూడు సంవత్సరాలు ఉందని అంతవరకు అమ్మడానికి వీలు లేదని పంచాయితీ పెట్టించాడు.ఇక పొలం అమ్మకం కుదరలేదు. అనంతలక్ష్మి ఉంటున్న ఇల్లు పల్లెలో ఉంది కాబట్టి ఆ ఇల్లు అమ్మినా పెద్దమొత్తంలో డబ్బేం రాదు.
ఇలా ఉండగా మహతి తల్లి విపరీత అనారోగ్యానికి గురై మరణించింది.
అదే సమయంలో అనంతలక్ష్మి మోకాలి నొప్పి వెన్నునొప్పితో బాధపడుతుండడం వల్ల అంత్యక్రియలకు వెళ్ళ లేకపోయింది.
అత్త అనంతలక్ష్మి డబ్బు సర్దకపోగా కనీసం తల్లి అంత్యక్రియలకు కూడా రాలేదని మనసులో ఎంతో బాధ పడింది మహతి.
అలా ఏవో కారణాలతో మహతి అనంతలక్ష్మి మధ్య దూరం మొదలైంది.
@@@@@@@
భర్త వెనుకగా ఇంట్లో అడుగు పెట్టిన అనంతలక్ష్మి ని మాములుగా పలకరించింది మహతి.
క్షేమ సమాచారాలు అయ్యాయి.
రెండురోజుల్లో ఇద్దరికి చెప్పాల్సిన మంచి విషయాలు చెప్పి జర్మనీకి వెళ్ళాడు సాకేత్.
అత్తా కోడళ్ళ మధ్య అవసరానికి మాత్రమే సంభాషణ.
ఓరోజు మహతి ఆఫీస్ నుండి వచ్చేసరికి అనంతలక్ష్మి కనబడలేదు. వెంటనే అపార్ట్మెంట్ వాచ్మెన్ ను వాకబు చేసింది.అతను తెలియదన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది లిఫ్ట్ పనిచేయక తాను మెట్లు మీద నడిచి రావడం. వాచ్మెన్ సాయంతో లిఫ్ట్ ఓపెన్ చేస్తే అక్కడ స్పృహ కోల్పోయి పడిఉన్న అనంతలక్ష్మి కనిపించింది. మహతి గుండెల్లో వణుకు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళింది. గండం గడిచింది. అనంతలక్ష్మి స్పృహలో కి వచ్చింది.
అమ్మో ఎంత గండం గడిచింది. సమయానికి మహతి రాకపోయి ఉంటే భయంతోనే గుండె ఆగిపోయేది అనుకుంది అనంతలక్ష్మి.
మహతి పై అనంతలక్ష్మి కి కొంత సదభిప్రాయం ఏర్పడింది
మూడు రోజుల తర్వాత మహతి ఆఫీస్ నుండి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద మహతి కి ఎంతో ఇష్టమైన రొయ్యల ఇగురు కనిపించింది. అనంతలక్ష్మి మహతితో ,"నీకు ఇష్టం అని సాకేత్ చెప్పాడు. నేను రొయ్యలు తినను. నేను రొయ్యలు వండడం కూడా ఇదే మొదటిసారి. ఇదిగో ఆ రెండో ప్లాట్ అమ్మాయి మన తెలుగమ్మాయే. గోదారోళ్ళ అమ్మాయి శృతి. ఈ మధ్యనే పరిచయం అయ్యిందిలే. తనే చెప్తుంటే నేనే నీ కోసం వండా. తిని ఎలా ఉందో చెప్పు.అంటూ కొసరి కొసరి వడ్డించింది.
మహతి తినడం పూర్తయ్యాక "జన్మదిన శుభాకాంక్షలు మహతి " మొన్న రాత్రి సాకేత్ ఫోన్ చేసి చెప్పాడు . ఏదో ఆ గోదారోళ్ళ అమ్మాయి తోడు తీసుకొని ఈ చీర తీసుకొచ్చా. నీకు నప్పుతుందో లేదో చూడు అంటూ ఆప్యాయంగా మహతి చేతిలో ఓ చీర కవర్ ను పెట్టింది అనంతలక్ష్మి.
మహతి లో ఆశ్చర్యం ఆనందం ఒకేసారి కలిగాయి.
ఉదయం నుండి ఆఫీస్ లో తీరికలేని పని పైగా సాకేత్ ఆలోచనలతో తన పుట్టిన రోజును మర్చిపోయింది.
ఒక్కసారిగా అత్తయ్య చేతిని తన చేతిలోకి తీసుకుంది.మహతి కళ్ళు కన్నీటితో మసకబారడం చూసి " అరే..ఇంత చిన్న విషయానికేనా..."అంది.
అమ్మ గుర్తొచ్చింది అంది మహతి బాధ నిండిన గొంతుకతో..
అనంతలక్ష్మి కి మనసంతా భారమైంది.
సున్నితంగా తన చేతిని మహతి చేతిపై ఉంచి మౌనంగా ఉండిపోయింది.
ఆ మౌనంలో అనంతలక్ష్మి స్పర్శలో మహతి కి ఎంతో ఆత్మీయత...ఓదార్పు .
ఓ వారం రోజుల తరువాత మహతి అర్థరాత్రి దాహంతో ఫ్రిజ్ లోనుంచి వాటర్ బాటిల్ తీసుకెళ్తూ అత్తగారి గదిలో అర్దరాత్రి దాటినా లైట్ వెలుగుతుండడం తో గదిలోకి చూసింది. అనంతలక్ష్మి నిద్రపట్టక పడుకుని అటు ఇటుగా కదులుతుండడం గమనించింది. మహతి మనసులో "పాపం అత్తయ్య...ఆలోచనలు ఇంకా అనారోగ్యం తో నిద్రపట్టక ఇబ్బంది పడుతోంది అనుకుంది .
.మరుసటి రోజు రాత్రి"అత్తయ్యా నాకు నిద్రపట్టడం లేదు.కాస్త తోడుగా నాతోపాటు నా గదిలోనే పడుకుంటారా ఆ అని అడిగింది.
అందుకు అనంతలక్ష్మి "దానికేం...ఇకనుంచి నీ గదిలోనే పడుకుంటాలే అంటూ మహతి తో పాటే ఆ గదిలోనే నిద్రపోయేది
అనంతలక్ష్మి రాత్రి భోజనం చేయడం ఆలస్యం...మహతి గదిలో చేరి సాకేత్ తో కాసేపు ఫోన్ లో మాట్లాడి మహతి కి ఇచ్చేది.మహతి సాకేత్ తో మరికాసేపు ఫోన్ మాట్లాడేది.మహతి తోడుగా ఉందన్న భరోసా వల్లనో ఏమో అనంతలక్ష్మి త్వరగా గాఢనిద్రలోకి జారుకునేది.
ఆదమరచి నిద్రపోతున్న అనంతలక్ష్మి ని చూసి సంతోషంగా ప్రశాంతంగా నిద్రపోయేది మహతి.
మహతి ఉదయం నిద్రలేచి అనంతలక్ష్మి కి కాఫీ పెట్టి ఇచ్చేది.
మహతి నే ఉదయం టిఫిన్ వండి పెట్టేది.
మద్యాహ్నం లంచ్ ఆఫీస్ లో చేసేది.
మహతి ఆఫీస్ కు వెళ్ళగానే అనంతలక్ష్మి ఇంటిని శుభ్రం గా ఉంచేది.
వంటగదిలో సింక్ లోని పాత్రలు శుభ్రం చేసి అన్నం కూరలు వండిపెట్టేది.
మహతి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పని అలసటతో తోటకూర కాడలా వడలిపోయేది.
మహతి ఫ్రెష్ అయి రాగానే కొసరి కొసరి వడ్డించేది అనంతలక్ష్మి. "మహతీ.ఏంటా తినటం చిన్నపిల్లలా.
మరీ డైటింగ్ అదీ ఇదీ అని తక్కువగా తింటే నీరసం వస్తుంది. రాత్రిళ్ళు నిద్ర కూడా సరిగా పట్టదు.అంటూ మహతి కడుపు నిండా తినేవరకు కదల నిచ్చేది కాదు.
మహతి ఆఫీస్ కు వెళ్ళాక అనంతలక్ష్మి శృతితో కలిసి దగ్గరలోని సూపర్ మార్కెట్ లో కూరగాయలు ఇంటికి సరిపడా రేషన్ తీసుకొచ్చేది. కొద్దిరోజుల్లోనే మహతి ఇష్టాఇష్టాలు తెలుసుకున్న అనంతలక్ష్మి మహతి కి నచ్చినవే వండిపెట్టేది.
మహతి తన స్నేహితులతో కలిసి ఎక్కడికి వెళ్ళినా వెంట అనంతలక్ష్మి ని తీసుకెళ్ళేది.
మహతి కి సొంతంగా కార్ ఉంది.
పల్లె తప్ప సిటీ లైఫ్ తెలియని అనంతలక్ష్మి కి ఎన్నో కొత్త విషయాలు నేర్పించింది మహతి.
మహతి తానే కార్ డ్రైవ్ చేస్తూ రెస్టారెంట్ లకు పార్క్ లకు తీసుకెళ్ళడం అనంతలక్ష్మి జీవితంలో మరిచిపోలేని మంచి అనుభూతులు అనే చెప్పవచ్చు.
మహతి తన కోడలు అనే విషయం మర్చిపోయింది అనంతలక్ష్మి.బహుశా మహతి తనకు గత జన్మలో ఏదో బంధం ఉండవచ్చేమో లేక ఎన్నో జన్మల ఋణబంధమో అనిపించేది అనంతలక్ష్మి కి.
ఓసారి మహతి కి విపరీతమైన కడుపునొప్పి. ఆఫీస్ కు సెలవు పెట్టి తన గదిలోనే పడుకుండిపోయింది. అనంతలక్ష్మి వేడి పాలు తాగించింది.
తనకు తెలిసిన వంటింటి వైద్యం చేసింది.
మహతి కి కాస్త తెరపిగా అనిపించినా సాయంత్రానికి మరలా కడుపునొప్పి మొదలైంది.
హాస్పిటల్ కు వెళ్ళారు.
రిపోర్ట్స్ లో మహతి కి గర్భసంచి లో నీటి బుడగలు (దీనినే పీసీఓడీ అంటారు.) ఉన్నాయని ఉంది.
అనంతలక్ష్మి కి చాలా బాధనిపించింది. మహతి కి చిన్నవయసులోనే అనారోగ్య సమస్యలు ఉంటే ఎలా.ఇంకా ఎంత భవిష్యత్తు ఉంది అనుకుంది.
మరుసటి రోజు నుండి గర్భసంచి లో నీటి బుడగలు కరిగించేందుకు తన సొంత వైద్యం మొదలుపెట్టింది.
మహతి కి ఎక్కువ గా నీటిని తాగే అలవాటు నేర్పింది. నడక ఇంకా వ్యాయామం చేసేలా ప్రోత్సహించేది. క్రమం తప్పకుండా వాడే టాబ్లెట్ లు వల్ల మహతి కి పీసీఓడీ సమస్య పరిష్కారమైంది.
కాలం గిర్రున తిరిగింది
సాకేత్ తిరిగొచ్చాడు. మహతి అనంతలక్ష్మి ఎంతో ఆప్యాయంగా ఉండడం చూసి ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యాడు.
అపార్థాలు వీడిపోయి ఆ ఇల్లు నందనవన మైంది
తన ఊరికి బయలుదేరుతునచన అనంతలక్ష్మి ఎదుట వెళ్ళద్దంటూ కన్నీళ్ళు పెట్టుకుంది మహతి.
త్వరలో తిరిగి వస్తానంటూ నచ్చజెప్పి బయలుదేరింది అనంతలక్ష్మి.
ఊరికి వెళ్ళిన అనంతలక్ష్మి మొదటిసారి ఒంటరితనాన్ని చవిచూసింది. మనసంతా ఆవరించిన నిశ్శబ్దం ఖాళీతనాన్ని పరిచయం చేసింది. తమ దగ్గరకు వచ్చేయ్ మంటూ మహతి రోజూ ఫోన్ లు చేసేది.
ఇక అనంతలక్ష్మి పల్లెలో పనులన్నీ చక్కబెట్టి పూర్తిగా సాకేత్ మహతి ల దగ్గరే ఉండిపోయింది.
సాకేత్ మహతి ల ఆనందానికి అవధులు లేవు.
చూస్తుండగానే మహతి గర్భవతైంది. అనంతలక్ష్మి మహతిని కంటికి రెప్పలా చూసుకుంది.నెలలు నిండి మహతి కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇల్లు పిల్లాపాపలతో కళకళలాడుతూ బృందావనం అయింది.
బంధాలు సున్నితం. సర్దుకుపోగలిగితే అవి చెరకు చందం. ఎంత ఒత్తిడి చేసినా తీపినే ఇస్తాయి.
బయటి వ్యక్తుల అభిప్రాయాలకు అపార్థాలకు విలువ ఇవ్వకుండా మన వంతు బాధ్యతగా మనం ప్రవర్తించ గలిగితే సమస్యలు అవే సద్దుమణుగుతాయి.
బంధాలలో బతుకు పోరుతో చీకటి నిండినా అనుబంధాల వెలుగుతో జీవితంలో వెన్నెల వాన కురుస్తుంది.
మనసుకు ప్రశాంతత అందుతుంది.
ఉదయం లేచింది మొదలు ప్రపంచంతో ఓ యుద్దం మొదలవుతుంది. కనీసం నా అనుకునే మనుషుల మధ్యనే కదా మనసు సేద తీరేది.
మరి అలాంటి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు కాకుండా ఆప్యాయత లు అర్థం చేసుకోవడాలు ఉంటే ఆ ఇల్లు స్వర్గమే.
సమాప్తం
సర్వేజనా సుఖినోభవంతు
రచన: డబుర ధనలక్ష్మి
హిందూపురం
No comments:
Post a Comment