*'నమస్కారం' మన సంస్కృతి*
*'నమస్కారం' మన సంస్కృతి. దైవాన్ని గానీ, విద్యావృద్ధులను గానీ, వయోవృద్ధులను గానీ నమస్కారంతోనే గౌరవిస్తాం. ఈ నమస్కారంలో చాలా అద్భుత భావనలున్నాయి. "ఆరాధయితుః ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రహ్వభావో నమస్కారః" అని శాస్త్రకారుల నిర్వచనం.*
*ఆరాధించేవాడు అవతలివానిలోని గొప్పతనాన్ని గ్రహించినప్పుడు కలిగే సమభావమే నమస్కారం. భగవంతుని గొప్పదనాన్ని తలచుకొని అతని మహిమాతిశయాన్ని గుర్తించి భక్తుడు పొందే నమ్రభావన నమస్సు.*
*ఆ నమ్రభావనను వ్యక్తీకరించే పద్ధతులు అనేకం. శిరస్సువంచి, రెండు చేతులు దోయిలించి నమస్కరించడం ఎక్కువగా మన ఆచారం. ఆ దోయిలించడం కూడా సాధారణంగా హృదయానికి సమీపంలో చేస్తాం. దీనినే 'అంజలిముద్ర' అంటారు. హృదయాన్ని అంజలిగా సమర్పించడమే దీనిలో భావం.*
*"అంజలిః పరమాముద్రా దేవా క్షిప్రప్రసాదినీ" దేవతలు వెంటనే అనుగ్రహించేలా చేసే శక్తి 'అంజలి' ముద్రలో ఉంది. శిరస్సు ఆలోచనలకు స్థానం. 'చేతులు' ఆచరణకు సంకేతం. 'హృదయం' అంతరంగ స్థానం. ఈ మూడూ భగవత్భక్తిని అందుకొనేందుకు, భగవదర్పణం కావాలని ఈ ప్రక్రియలో అంతరార్థం శబ్దశాస్త్రంలో 'వర్ణవిపర్యయ న్యాయం' అని ఒకటుంది. హింస అనే శబ్దం, ఈ న్యాయాన్ని అనుసరించి 'సింహ'గా మారింది. హింసాలక్షణం అధికంగాగల జంతువు సింహమని అర్థం. అలాగే ఆ న్యాయాన్ని అనుసరించి 'మనస్' శబ్దమే 'నమస్' అయ్యింది. మనస్సును సమర్పించడమే నమస్సు. నమస్కారములో సమర్పణ మాత్రమే కలదు స్వీకరణ కూడావుంది... దేవతాశక్తిని అనుగ్రహించే మార్గం ఇదే...*
*"నమస్” సమర్పణ కనిపిస్తుంది. అతి ప్రాచీనమైన వైదిక భారతీయ సంస్కృతి అనాదికాలంలో ఆవిష్కరించిన అద్భుత ప్రక్రియ ఇది. శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అర్జునుడంటాడు. - "కస్మాచ్చతే ననమేరన్ మహాత్మన్"... "అసలు నీ తత్త్వం, మహిమ తెలిశాక నమస్కరించకుండా ఎవరు ఉండగలరు?"*
*తెలిశాక ఎలాగూ నమస్కరిస్తారు. కానీ నమస్కరిస్తే గానీ తెలియని అద్భుతత్వం భగవానునిది. నమ్రభావమున్నవాడే విశ్వచైతన్యాన్ని గ్రహించగలడు. గ్రహించాక ఆనందంతో నమ్రుడై జీవిస్తాడు.*
*ఇంత అర్థమూ, శక్తి ఉన్నాయి. కనుకనే నమస్కారాన్ని పంచప్రణవాలలో ఒకటి అన్నారు. పంచప్రణవాలు ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం.*
*ఇందులో మొదటి నాలుగింటికీ నియమాలు, పద్ధతులూ ఉన్నాయి. కానీ నమస్కారానికి ఏ పరిమితులూ లేవు. భక్తితో ఎప్పుడైనా ఎక్కడైనా ఆచరించవచ్చు. అందుకే దీనిని "ఆత్మయజ్ఞంగా" శివపురాణం వర్ణించింది.*
*నమస్కారం ఇతర ప్రణవాలవలె దేవతాహ్వాన వాచకం, మోక్షకారకం. వేదాలలో విశ్వవ్యాపకుడైన పరమేశ్వరుని పలువిధాల నమస్కరించిన భాగం "నమకంగా" ప్రసిద్ధి పొందింది.*
*విశ్వమంతా ఈశ్వరశక్తియే నిండి ఉన్నదనీ పలురకాల విశ్వరూపుని పలువిధాల నమస్కరించడమే ఆ మంత్రభాగంలో ప్రధానాంశం.*
*అన్నింటిలోనూ ఈశ్వరునే చర్శించి నమస్కరించే 'నమ్రత' వల్ల మనిషి మహోన్నతుడౌతాడని తాత్పర్యం.*
*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🌹🌹 🙏🕉️🙏 🌹🌹🌹
No comments:
Post a Comment