Sunday, April 6, 2025

 *విశ్వాసంతో సద్గురువును ఆశ్రయించిన మోక్షం సిద్ధించును* 

*కోటికర్మలు చేసినా ఆత్మానుభూతికి సహాయపడజాలవు. విచారణ వల్లనే మోక్షప్రాప్తి అని కిందటి శ్లోకంలో విస్పష్టంగా ప్రకటించారు. అయితే కర్మలవల్ల ఎందుకు ఆత్మాను భూతి కలగదు? చిత్తశుద్ధి తద్వారా జ్ఞానాన్ని పొందటం విచారణ చేయటం దీని ద్వారానే ఎందుకు మోక్షప్రాప్తి కలుగుతుంది? ఈ విషయాన్ని ఉపమానం ద్వారా నిరూపిస్తున్నారి శ్లోకంలో అసలు ఉన్నది నిరాకార, నిర్గుణ, నిరంజన, నిర్వికార, నిరీహ, సర్వవ్యాపక బ్రహ్మం ఒక్కటే. అది ఆనంద సాగరం. అదే నీవు. అయితే ఈ విషయం తెలియనందున అజ్ఞానం వల్ల నామరూపాలతో కూడిన ఈ దేహమే నీవని, నీకన్న అన్యులు అన్యమైనవి ఎన్నో ఉన్నాయని భ్రమ కలుగుతున్నది. దానివల్లనే భయాలు, దుఃఖాలు అన్నీ. ఇవన్నీ తొలగాలంటే ముందుగా నీ ఈ భ్రమ తొలగాలి. నీ నిజస్వరూపం బ్రహ్మమని తెలుసుకొని బ్రహ్మంగా ఉండిపోవాలి.* 

*అప్పుడే సర్వ భయాల నుండి, దుఃఖాల నుండి, బంధాల నుండి ముక్తి. ఈ విషయాన్ని వేదాంతంలో తరచుగా వినిపించే రజ్జు సర్పభ్రాంతి ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. మనం రాత్రి సమయంలో మసక మసక చీకటిగా ఉన్న దారిలో వెళ్తూ ఉన్నాం. ఒంటరితనం, కాస్త భయంగా కూడా ఉంది. అంతలో దూరంగా ఏదో మెలికలుగా పడి ఉన్నది. మనం నడుస్తూ చూస్తుంటే అది కొంచెం కదులుతూ ఉన్నట్లుంది. దానితో అది పాము అని అనుకున్నాం. అంతే భయం వేసింది. అసలే చీకటి భయం, కొంచెం పిరికితనం. దానికి తోడు ఒంటరి తనం, భయంతో అటూ ఇటూ పరుగులు పెడుతున్నాం. చీకట్లో ఏమీ కనబడటం లేదు. అంతలో ఏదో మొత్తగా కాలికి తగిలింది. వెంటనే పాము కాటు వేసిందనుకున్నాం. కెవ్వుమన్నాం. కొంచెం రక్తం కూడా కారుతున్నది. దానితో నొప్పి ఏడుపు లంకించుకున్నాం. ఈ భయమూ, బాధ, ఏడుపూ, అన్నీ కూడా అసలు సత్యం తెలియనందున అంటే అక్కడ ఉన్నది త్రాడేనని తెలియ నందున పాము అని భ్రమపడటం వల్ల కలిగినవి.* 

*మరి ఈ భయాలు, దుఃఖాలు, బాధలు అన్నీ ఏం చేస్తే తొలుగుతాయి. పాటలు పాడాలా, డాన్స్ వేయాలా, చెరువులో మునగాలా? భగవంతుని పూజించాలా? కర్రతో కొట్టాలా? ఎవరితోనన్నా చెప్పాలా? లేక ఏదైనా ముందు వేయాలా? ఏం చేస్తే తొలగుతాయి? ఇక్కడ ఏకర్మలూ పనిచేయవు. మరి? నీవు అది సర్పం అనే భ్రాంతిని పోగొట్టుకోవాలి. ఆ భ్రాంతి పోవాలంటే అది త్రాడు అని స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ పామును కాల్చివేసినా, నీ బాధ తొలగదు. అ జ్ఞానం పోవాలి, జ్ఞానం కలగాలి, నీకు బాగా తెలిసిన వాడు, నీ మేలు కోరేవాడు, ఆప్తుడు నీకు తటస్థపడి అది కేవలం త్రాడేనని పాము కానేకాదని గట్టిగా చెప్పగానే మనస్సు కుదుటపడుతుంది. అయినప్పటికీ అది పాములాగా కనిపిస్తున్నందున పూర్తిగా నమ్మకం కుదరదు. అయితే తన ఆప్తుడైన వాడు, హితుడైన వాడు చెప్పినందున కొంచెం ధైర్యం కలిగింది. కనుక నిదానంగా దాని దగ్గరకు వెళ్ళి ఒక్కక్షణం తేరిపార చూస్తాడు. అది కదలటం లేదనిపిస్తుంది. దానితో ఒక కర్రపుల్లతో దానిని కదిలిస్తాడు. నిర్జీవంగా ఉన్నదని తెలుసుకుంటాడు.* 

*చివరికి దానిని చేతితో పట్టుకొని చూస్తాడు. ఆఁ ! నిజమే. అది త్రాడేనని స్పష్టంగా తెలుసుకుంటాడు. దానితో అతని భ్రాంతి సర్పభ్రాంతి తొలగిపోతుంది. భ్రాంతి తొలగిపోవటంతో భయం, బాధ అన్నీ మాయం. ఇదే సర్వదుఃఖాల నుండి విముక్తి కలిగించే మార్గం. అలాగే మన నిజ స్వరూపం ఆత్మ అయితే నామరూపాలతో కూడిన, మనోబుద్ధులతో కూడిన జీవుడిగా అహంకారంగా భ్రమపడ్డాం. దానితోబాధలు, దుఃఖాలు, ఆశలు, కోరికలు, కొరతలు అన్నిర కాల బాధలు భయాలు కలిగినవి. ఇవి పోవాలంటే ఎన్ని కర్మలు చేసినా లాభం లేదు. కోరికలు తీర్చుకోటానికి కర్మలు చేస్తుంటే క్రొత్త కోరికలు పుడుతూ ఉంటాయి. దుఃఖాలు తొలగించుకోవాలని తప్పించుకునేందుకు ఏదో చేస్తుంటే క్రొత్త దుఃఖాలు వచ్చిపడుతూ ఉంటాయి. వీటికి అంతులేదు. మరెలా? తాను దేహాన్ని కాదని, బాధలకు దుఃఖాలకు లోనయ్యే జీవుణ్ణి కాదని గ్రహించినప్పుడే ఈ బాధల నుండి విముక్తి. అలా గ్రహించాలంటే నిజంగా తానెవరో తెలియాలి. తాను ఆనంద స్వరూప ఆత్మనని తెలియాలి. అజ్ఞానం తొలగాలి. ఆత్మజ్ఞానం కలగాలి. ఐతే ఎలా కలుగుతుంది? ఆప్తవాక్యం కావాలి. అదే శాస్త్ర జ్ఞానం, అనుభవజ్ఞానం ఉన్న ఒక సద్గురువు నీకు లభించాలి. ఆయన మీద నీకు విశ్వాసం ఉండాలి.*

 *శ్రీ ఆదిశంకరాచార్యుల వారి 'వివేకచూడామణి'* 

*┈┉┅━❀꧁హరే కృష్ణ꧂❀━┅┉┈*    
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️

No comments:

Post a Comment