చూపున్న మాట
ఉష్ణ ఉగ్రత... కావాలి భద్రత!
కొద్దిరోజులుగా భానుడు భగ్గుమంటున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. చెమట పట్టటం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది. లవణాలూ బయటకు పోతాయి. డీహైడ్రేషన్‌తో తలనొప్పి, మాటలు తడబడడం, స్పృహ కోల్పోవడం, వికారం, అలసట, రక్తపోటు అస్తవ్యస్తం కావటం, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. కలుషిత ఆహారం, నీటితో వాంతులు, విరేచనాలయ్యే ప్రమాదముంది. గుండె సమస్యలూ అదనం. వడదెబ్బ సరేసరి. ఏటా అనేకమంది దీని బారినపడి మరణిస్తున్నారు. కాబట్టి ఎండల నుంచి తప్పించుకుని, శరీరాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత.
ఈ సమస్యలతో జాగ్రత్త...
వడదెబ్బ
ఇది చాలా తీవ్రమైన సమస్య. చెమట పట్టే క్రమంలో రక్తంలోని ద్రవం ఆవిరవుతుంది. ఇది కొనసాగితే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ కుప్పకూలుతుంది. చివరికి చెమట పట్టడమూ ఆగిపోతుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత అతి వేగంగా పెరిగిపోతుంది. ఇదే వడదెబ్బ. కొందరికి 106 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత పెరగొచ్చు. ఇందులో చర్మం పొడిబారుతుంది. ముట్టుకుంటే శరీరం కాలిపోతుంది. నీరు, రక్తం పరిమాణం తగ్గటం వల్ల రక్తపోటూ పడిపోతుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియ కూడా అస్తవ్యస్తమవుతుంది. ఉష్ణోగ్రత 107 డిగ్రీలు దాటితే మాంసకృత్తులు, ఫాస్ఫోలిపిడ్లు కరిగిపోవచ్చు. మెదడు, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతినటం మొదలవుతుంది. క్రమంగా అవయవాలు విఫలమై ప్రాణాపాయమూ సంభవించొచ్చు. చాలామంది ఎండలోకి వెళ్తేనే వడదెబ్బ తగులుతుందని భావిస్తుంటారు. ఇది నిజం కాదు. వేడి గాలి, వేడి వాతావరణం ప్రభావంతో ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగలొచ్చు.
చికిత్స
వడదెబ్బ తగిలినవారి శరీరం చల్లబడేలా చూడటం ప్రధానం. ఎండలో ఉంటే వెంటనే నీడకు చేర్చాలి. వీలుంటే ఏసీ గదిలో పడుకోబెట్టాలి.
బిగుతైన దుస్తులు.. టెర్లిన్, పాలిస్టర్ దుస్తులు ధరిస్తే తొలగించాలి. వదులైన, కాటన్ దుస్తులు వేయాలి..
తడి గుడ్డతో ఒళ్లంతా తుడవాలి. ఐస్ ముక్కలను ప్లాస్టిక్ బ్యాగులో వేసి ఒళ్లంతా అద్దాలి.
లవణాలు, ఓఆర్‌ఎస్ కలిపిన నీరు తాగించాలి. మజ్జిగ, ఉప్పు, నిమ్మరసం మజ్జిగ, కొబ్బరి నీళ్లూ ఇవ్వచ్చు.
ఒళ్లు కాలిపోతోందని పారాసిటమాల్, ఐబూప్రొఫెన్ వంటి మందులు ఇవ్వకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు ఇవి ఉష్ణోగ్రతను తగ్గించవు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా జ్వరం పెరుగుతుంటే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. వడదెబ్బ చాలా త్వరగా ప్రాణాపాయానికి దారితీస్తుంది. కాబట్టి సత్వర చికిత్స అవసరం.
చెమట పొక్కులు
ఇది మామూలు సమస్యే కావొచ్చు గానీ దురద, మంట వంటి వాటితో తెగ ఇబ్బంది పెడుతుంది. మధుమేహం వంటి సమస్యలు గలవారికి చర్మ ఇన్‌ఫెక్షన్లకూ దారితీయొచ్చు. మన చర్మ కణాల్లో కొన్ని నిరంతరం చనిపోతుంటాయి, కొత్తవి పుట్టుకొస్తుంటాయి. మృతకణాలు కొన్నిసార్లు అలాగే ఉండిపోవచ్చు. దుమ్ము, మురికి వంటివీ అక్కడ చేరుకోవచ్చు. ఇవన్నీ స్వేద రంధ్రాలకు అడ్డుపడితే చెమట బయటకు రాకుండా లోపలే ఉండిపోతుంటుంది. చెమట పొక్కులకు కారణం ఇదే. ఎండాకాలంలో సహజంగానే చెమట ఎక్కువ పోస్తుంటుంది. ఇక అది బయటకు వచ్చే రంధ్రం మూసుకుపోతే.. అక్కడి చర్మం ఉబ్బిపోయి, చిన్న చిన్న పొక్కులు బయలుదేరతాయి. సాధారణంగా చెమట పొక్కులు పిల్లల్లో ఎక్కువ.
చికిత్స
నిజానికి చెమట పొక్కులు వాటంతటవే తగ్గిపోతుంటాయి. అయితే కొందరికి ఇవి చర్మం లోపలి పొరల్లోకీ వ్యాపించొచ్చు. చీము కూడా పట్టొచ్చు. అందువల్ల పొక్కులు ఉన్న భాగం పొడిగా ఉండేలా, రాపిడి పడకుండా చూసుకోవటం మంచిది.
పొక్కులు బాగా వేధిస్తుంటే కొన్ని పూతమందులు బాగా ఉపయోగపడతాయి.
మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారిలో అరుదుగా కొందరికి పొక్కులు ఇన్‌ఫెక్షన్లకు దారితీయొచ్చు. వీరికి అవసరాన్ని బట్టి యాంటీబయోటిక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
డీహైడ్రేషన్
తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో బయట తిరగడం వల్ల, శరీరంలోని నీరు చెమటరూపంలో బయటకు వెళ్తుంది. పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ స్థాయులు తగ్గిపోయి డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఫలితంగా శరీరంలోని లవణాలు, సూక్ష్మపోషకాలు తగ్గుతాయి. నాలుక మీద తేమ తగ్గిపోయి...పొడిగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. చిన్నారుల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
చికిత్స
శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవాలి.
కీరదోస, పుచ్చకాయ వంటి నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లతో పాటు, పండ్లరసాలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, మజ్జిగ తీసుకోవాలి.
మధ్యాహ్నం నిమ్మరసం తీసుకుంటే, శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
ఎక్కువసేపు ఎండలో తిరిగి రాగానే ఫ్రిజ్‌లోని నీటిని తాగడం కన్నా.. మట్టి కుండలోని నీరు ఉత్తమం.
కళ్లకు చేటే
వేసవిలో వీచే వడగాలులు చాలా ప్రమాదకరం. వేడికి కళ్లల్లోని తేమ సైతం ఆవిరైపోతుంది. ఫలితంగా కంట్లో ఇసుక వేసిన అనుభూతి కలుగుతుంది. కంటివద్ద చర్మం పొడిబారుతుంది. దుమ్ము, ధూళి కంట్లో పడితే కళ్ల దురద, మంటలు వస్తాయి. బలమైన సూర్యకాంతి వల్ల కార్నియా దెబ్బతింటుంది. నిరంతరం సూర్యకాంతిలో ఉంటే కంటి సమస్యలు కూడా పెరుగుతాయి.
చికిత్స
బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పకుండా సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
ఇంటికి చేరిన వెంటనే చల్లటి నీటితో మొహం కడుక్కోవాలి.
వీలైనంత వరకు కాలుష్యం, దుమ్ము ఉన్న ప్రదేశంలో తిరగకపోవడం మంచిది.
దురద, చికాకు, కళ్లు ఎర్రబడడం సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
కాళ్ల వాపు
ఎండాకాలం తొలిరోజుల్లో కొందరికి పాదాలు, మడమలు, కాళ్లు ఉబ్బుతుంటాయి. ఇది వేడిని అలవాటు చేసుకోవడానికి శరీరం చేసే ప్రయత్నమే. ఎండ, వేడిగాలి మూలంగా రక్తనాళాలు.. ముఖ్యంగా సిరలు వ్యాకోచిస్తుంటాయి. మరోవైపు అధిక వేడి కారణంగా శరీరానికి దూరంగా ఉండే కాళ్ల వంటి భాగాల నుంచి గుండెకు అంతగా రక్తం తిరిగి చేరుకోదు. దీంతో రక్తంలోని ద్రవం బయటకు వచ్చి పాదాలు ఉబ్బుతుంటాయి. కొందరికి చేతులు, వేళ్లు కూడా ఉబ్బొచ్చు. నిజానికిదేమీ పెద్ద సమస్య కాదు.
చికిత్స
కిడ్నీ, కాలేయ సమస్యలేవీ లేకపోతే కాళ్ల వాపునకు అంతగా భయపడాల్సిన పనేమీ లేదు. దీనికి ప్రత్యేకమైన చికిత్స కూడా అవసరం లేదు.
పాదాలు ఎత్తుగా ఉండేలా కాళ్ల కింద దిండు పెట్టుకొని పడుకుంటే సమస్య చాలావరకు తగ్గిపోతుంది. ఎక్కువసేపు నిలబడకుండా, ఒకేచోట కూచోకుండా చూసుకోవాలి.
ఇవి గుర్తుంచుకోండి
బయటకు వెళ్లే ముందే తగినంత నీరు తాగాలి. దాహం వేస్తేనే నీళ్లు తాగాలని అనుకోవద్దు. మనకు దాహం వేస్తుందంటేనే అప్పటికే ఒంట్లో ఎంతో కొంత నీరు తగ్గిందని అర్థం.
బాలింతలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకూడదు.
లేతవర్ణం, తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి. నలుపు దుస్తులు, మందంగా ఉన్న దుస్తులు ధరించకూడదు.
అల్కహాల్, టీ కాఫీ, సోడాలు వంటి డీ- హైడ్రేటింగ్ పానీయాలకు దూరంగా ఉండాలి
రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగుపానీయాలు తాగకూడదు.
బయటకు వెళ్లినపుడు విధిగా గొడుగు తీసుకెళ్లాలి. వెడల్పయిన అంచులున్న టోపీ ధరించాలి.
పెద్దవాళ్లు జాగ్రత్త!
పెద్ద వయసులో ఉన్న వారు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. కాబట్టి 60 ఏళ్లు దాటిన వారు ఎండలోకి రాకపోవడం మంచిది. బీపీ, షుగర్ ఉన్న వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.
ప్రొఫెసర్ శ్రీనివాసరావు, జనరల్ ఫిజిషియన్, విజయవాడ సర్వజనాసుపత్రి
ఈనాడు, అమరావతి
No comments:
Post a Comment