Sunday, April 6, 2025

 *🔊Reels: రీల్స్‌ అతిగా చూస్తున్నారా.. కంటిచూపుపై తీవ్ర ప్రభావం: వైద్యుల హెచ్చరిక*

*🔶షార్ట్‌ వీడియో, రీల్స్‌ అతిగా చూడటంతో ‘బ్రెయిన్‌ రాట్‌’ (Brain Rot)బారిన పడుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. తాజాగా కంటి సమస్యలూ పెరుగుతున్నట్లు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.*

*🍥ఇంటర్నెట్ డెస్క్‌: నేటి సామాజిక మాధ్యమాల(Social Media) యుగంలో రీల్స్‌(Reels) చూడటం ఓ వ్యసనంలా మారిపోయింది. కొంచెం టైం దొరికితే చాలు అంతా స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్‌, షార్ట్‌ వీడియోలు చూడటంలోనే మునిగిపోతున్నారు. అయితే, దీంతో విలువైన సమయం వృథా కావడమే కాదు.. ఆరోగ్యానికీ ముప్పేనంటూ పలు అధ్యయనాలు గగ్గోలు పెడుతున్నాయి. షార్ట్‌ వీడియోలు అతిగా చూడటంతో ‘బ్రెయిన్‌ రాట్‌’ (Brain Rot)బారిన పడుతున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేయగా.. తాజాగా కంటి సమస్యలూ(Eye Disorders) పెరుగుతున్నట్లు ప్రఖ్యాత కంటి వైద్య నిపుణుల హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి. ఇంతకీ వైద్యులేమంటున్నారు? ఈ సమస్యకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే?*

*💫స్మార్ట్‌ఫోన్‌తో మనిషి జీవితంతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకోవడం ద్వారా మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అదేపనిగా సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో షార్ట్స్‌, వీడియోలను చూస్తున్న వారిలో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉందని.. మరీ ముఖ్యంగా చిన్నారులు, యువతలో దృష్టి లోపాలు  పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం దిల్లీలోని యశోభూమి - ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ,  ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్‌ సొసైటీ సంయుక్త సమావేశంలో ప్రముఖ నేత్ర వైద్యులు పలు కీలక అంశాలను వెల్లడించారు.*

*💥అదో నిశ్శబ్ద మహమ్మారి.. జాగ్రత్త*

*🌀అధిక స్క్రీన్ టైమ్‌తో కంటిపై పడే డిజిటల్‌ ఒత్తిడి ఓ నిశ్శబ్దపు మహమ్మారి అని ఆసియా పసిఫిక్‌ అకాడమీ ఆఫ్‌ ఆప్తమాలజీ (ఏపీఏవో) 2025 కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ లలిత్‌ వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక హెచ్చరికలు జారీ చేశారు.  ‘‘ముఖ్యంగా రీల్స్ చూస్తూ గంటల తరబడి ఎలక్ట్రానిక్ పరికాలకు అతుక్కుపోవడంతో పిల్లల్లో కళ్లు పొడిబారిపోవడం (డ్రై ఐ సిండ్రోమ్‌), హ్రస్వదృష్టి (మయోపియా) పెరగడం, కళ్లు ఒత్తిడికి గురికావడంతో పాటు చిన్నప్పుడే మెల్లకన్ను రావడం వంటి కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఒక విద్యార్థి కంటి దురద, మసకగా కనిపిస్తుందంటూ మా వద్దకు వచ్చాడు. పరీక్షించి చూడగా.. ఇంట్లో ఎక్కువగా రీల్స్‌ చూడటం వల్ల అతడి కళ్లలో తగినంతగా కన్నీళ్లు రావడం లేదని గుర్తించాం. దీంతో వెంటనే అతడికి కంటి చుక్కలు వేసి.. 20 - 20 - 20 నియమాన్ని పాటించాలని సూచించాం’’ అని వివరించారు.*
  
*💥రీల్స్‌ చిన్నవే.. ప్రభావం జీవితాంతం*

*💠రీల్స్‌ చిన్నగానే ఉండొచ్చు.. కానీ కంటి ఆరోగ్యంపై అవి చూపే ప్రభావం మాత్రం జీవితాంతం ఉంటుందని ఆల్‌ఇండియా ఆప్తమాలాజికల్‌ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ హర్బన్ష్‌లాల్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ సమస్య తీవ్రతను వివరించారు.  ‘‘చిన్న, ఆకర్షణీయమైన రీల్స్‌ను ఎక్కువసేపు దృష్టి నిలిపేలా డిజైన్‌ చేస్తున్నారు.  స్థిరంగా అలా చూడటం వల్ల బ్లింకింగ్‌ రేటు 50శాతం తగ్గుతోంది. ఇది కళ్లు పొడిబారడానికి, దృష్టిలోపాలకు దారితీస్తుంది. ఈ అలవాటు నియంత్రణ లేకుండా కొనసాగితే మాత్రం దీర్ఘకాలిక దృష్టి సమస్యలకు, శాశ్వతకంటి సమస్యలకు దారితీస్తుంది’’ అని హెచ్చరించారు. రోజూ గంటలతరబడి స్క్రీన్స్‌కు అతుక్కుపోయే పిల్లల్లో ముందస్తు మయోపియా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పెద్ద వారు కూడా ఈ బ్లూ లైట్‌కు గురికావడం వల్ల తరచూ తలనొప్పి, మైగ్రేట్‌, నిద్రలేమి వంటి సమస్యల బారినపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అధ్యయనాల ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.*

*💥కంటిచూపే కాదు.. సంబంధాలూ దెబ్బతింటున్నాయ్‌ ..*

*🥏అధిక స్క్రీన్‌ టైమ్‌తో సామాజిక, మానసిక ఇబ్బందులు సైతం పెరుగుతున్నట్లు ఏఐవోఎస్‌ అధ్యక్షుడు, సీనియర్‌ ఆప్తమాలజిస్ట్‌ డాక్టర్‌ సమర్‌ బసక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌ను అదేపనిగా చూస్తుండటం వల్ల కంటిపై ఒత్తిడి, మెల్లకన్ను, కంటి చూపు మందగించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ఎక్కువ సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. నిరంతరం రీల్స్‌ చూడటం వల్ల సామాజిక ఒంటరితనం, మానసిక అలసట, మానసిక ఇబ్బందులకు గురైనట్లు గమనిస్తున్నట్లు చెప్పారు. రీల్స్‌లో మునిగిపోవడంతో  వాస్తవిక ప్రపంచాన్ని విస్మరించడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం, చదువు, పనిపై దృష్టి తగ్గడం వంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు.*

*💥20-20-20 రూల్‌ పాటిస్తే మేలు!*

*➡️కృత్రిమ కాంతి, వేగవంతమైన దృశ్య మార్పులు కంటిపై దుష్ప్రభావాన్ని చూపుతాయని ఏఐవోఎస్‌ కాబోయే అధ్యక్షుడు, సీనియర్‌ ఆప్తమాలజిస్ట్‌ డాక్టర్‌ పార్థా బిశ్వాస్‌ అన్నారు. ఇది పూర్తిస్థాయి ప్రజారోగ్య సంక్షోభంగా మారకముందే తీవ్రంగా పరిగణించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అధికంగా రీల్స్‌ చూడటం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.* 
    
*➡️మితిమీరిన, నియంత్రణలేని రీల్స్‌ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని. తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.* 
    
*➡️బ్లింక్‌ రేటు పెంచడం, స్క్రీన్‌లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్‌ చేయడానికి ప్రయత్నించడం, స్క్రీన్‌ సమయాన్ని తగ్గించడం,  క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి చర్యలతో దీర్ఘకాలిక నష్టాన్ని నివారించవచ్చు.*

*💥ఏమిటీ 20-20-20 రూల్‌?*

*🛟ప్రతి ఇరవై నిమిషాలకోసారి ఇరవై సెకన్ల విరామం తీసుకోండి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించండి. లేదా గంటకు అయిదు నిమిషాల పాటు మీ కళ్లకు తగినంత విశ్రాంతినివ్వండి.*

No comments:

Post a Comment