Monday, July 21, 2025

 167e4;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀3️⃣```ప్రతిరోజూ...
మహాకవి బమ్మెర పోతనామాత్య..
```
         *శ్రీమద్భాగవత కథలు*
                ➖➖➖✍️```
 
2.1. రఘువంశము: 

విశుద్ధమగు సూర్యవంశమున పరమ ప్రతాపుడును, యశస్వియును, దీర్ఘబాహుడును, పుణ్యశ్లోకుడును అగు ఖట్వాంగుడను రాజు పృథివిని పాలించుచుండెను. అతని పరిపాలన ప్రజలకానందము కలిగించుటయేకాక, ప్రజలు ప్రభువునే దైవముగా భావించి, విశ్వసించి గౌరవించుచుండిరి. మహారాజునకు ఏకైక పుత్రుడు కలడు. అతడే దిలీపుడు. 
కుమారుడైన దిలీపుడు దినదినాభివృద్ధిగాంచుచు, 
మహా తేజోవంతుడై తండ్రితో పాలన విషయాదులందు పాల్గొనుచు, దేశమందలి మంచిచెడ్డలను గమనించుచు, విచారించుచు, అతిశ్రద్ధాళుడై ప్రజలమధ్య పెరుగుచుండెను. కుమారుడు పెద్దవాడగుట చూచి యుక్తవయస్సుననే వివాహముజేసి కొంత పరిపాలనా బాధ్యత అతని తలపై పెట్టవలెనని సంకల్పించి, అన్నింటికీ సరిపడునట్టి కోడలు కావలెనని విచారించి, కడకు మగధ నందినియగు సుదక్షిణ అను కన్యతో అత్యంత వైభవముగా వివాహము జరిపించెను. సుదక్షిణ మహాగుణవంతురాలు. సాధ్వియును, సరళ హృదయయునై, పతిననుసరించుచు, ప్రాణసమముగ ప్రేమించి సేవించుచుండెను. పతియగు దిలీపుడు కూడను, మహా గుణవంతుడగుటచే ఆమెకెట్టి లోటునూ లేకుండ చూచుకొనుచు, పరిపాలనా విషయమున తండ్రిననుసరించుచు క్రమక్రమముగా తండ్రి బాధ్యతలన్నింటిని తానే చూచుకొనుచు కొంత విశ్రాంతిని కలిగించుచుండుట ఖట్వాంగుడు గమనించి తనలో తాను కుమారుని తెలివితేటలకును, శక్తి సామర్థ్యములకును ఎంతో సంతసించుచుండెడివాడు.

ఈవిధముగ కొంతకాలము గడచెను. ఖట్వాంగుడు సుముహూర్తమును నిర్ణయించి దిలీపునకు రాజ్యపాలనా పట్టము గావించెను. నాటినుండియు దిలీపు మహారాజను నామముతో సప్తద్వీపవతియగు వసుంధరకు ప్రభువై ధర్మపాలన  జరుపుచుండ, సకాల వర్షము కురిసి, సస్యశ్యామలమై సమృద్ధిగా పండి పాడిపంటలకెట్టి కొరతయు లేక నిత్యకల్యాణములతో, వేద పారాయణములతో, శాస్త్రసమ్మతమైన యజ్ఞయాగాది క్రతువులతో అన్ని జాతులవారు హాయిగా జీవించుచుండిరి.

కానీ మహారాజునకు దినములు సంవత్సరములు గడచుకొలది తనలో ఏదో అశాంతి బాధించుచుండినటుల అతని ముఖవర్చస్సు తెలుపుచుండెడిది. కొన్ని సంవత్సరములు గడచెను. ఇచ్ఛ నెరవేరునను ఆశ దినదినమునకు నీరసించెను.

ఒకనాడు తన రాణియగు సుదక్షిణతో తనలోని చింతను ఈరీతిగా వెలిబుచ్చెను: “ప్రియా! మనకింత వరకును సంతానము లేకపోవుటచే కొడుకులు లేరను చింతకంటెను ఇక్ష్వాకు వంశ ప్రసారమెట్లు కాగలదను విచారము నన్ను మరింత బాధించుచున్నది. దీనికి నేనొనరించిన ఏ పాపఫలమో కారణమయి ఉండ వచ్చును. దాని పరిహారార్ధమై ఏమి చేయవలెనో నాకు తోచుటలేదు. దైవ కరుణా కటాక్షమును అందుకొనుటకు తగిన మార్గమేదియో మన కులగురువగు వసిష్ఠులవారిని అడిగి తెలిసికొన వలెనని ఈనాడు నా మనసు తత్తరపడుచున్నది. ఇందుకు నీ ఉద్దేశ్యమేమి?” అని దిలీపుడు అడుగ సుదక్షిణ ఆలస్యము చేయక, ఆలోచించక, “నాథా! ఇదే ఆలోచన నాలోను చాలా దినములనుండి బాధించుచున్నప్పటికిని పతి ఆజ్ఞ లేక నా  తలంపును బైట పెట్టుట తప్పగునేమో అని నాలోనే నేను అణచుకొంటిని. తమ ఇచ్ఛననుసరించుటకు నేనెల్లప్పుడు సిద్ధమే అనునది తమకు విదితమే కదా. ఇందుకు ఆలస్యమెందుకు?” అని రాణి తన అంగీకారమును తెలుపగనే, దిలీపుడు రథమును సిద్ధము చేయించి, “ఈనాడు నావెంట పరివారము, రక్షక భటు లెవ్వరును రానక్కరలేద”ని ఆజ్ఞాపించి తానే రథమును నడుపుకొని గురుదేవులగు వసిష్ఠులవారి ఆశ్రమము చేరెను.

రథ శబ్దము వినగనే వెలుపలనున్న ఆశ్రమవాసులు లోనికి వెళ్లి గురువుగారికి తెలుప, వసిష్ఠులవారు ద్వారము చెంతకు వచ్చి దిలీపుని ఆశీర్వదించి కుశల ప్రశ్నలు గావించుచుండ, రాణి సుదక్షిణ చెంతనేయున్న అరుంధతీదేవికి నమస్కరించెను. అంత అరుంధతి ఆమెను ఆశీర్వదించి, ప్రేమతో కుశల ప్రశ్నలు గావించుచు లోనికి తీసుకొని వెళ్లెను. అంత, రాజుకూడను ప్రభు ధర్మము ననుసరించి, “ఆశ్రమ జనులకుకానీ, యజ్ఞ యాగాది సత్కర్మలకుకానీ, లేక ఆహార విహారములకుకానీ, ఎట్టి ఇబ్బందియు లేక అరణ్యమునందు క్రూర మృగముల బాధలులేక, తమతమ నిత్యానుష్ఠానములు సక్రమముగ జరుగుచున్నవి కదా?” అని గురువైన వసిష్ఠులవారిని, ఆశ్రమవాసులను కుశల ప్రశ్నలు గావించుచు, లోనికి వెళ్లి వారివారి ఆసనములు వారు స్వీకరించిరి.

అంత వసిష్ఠులవారు అచటున్న ఆశ్రమవాసులను తమతమ వసతులకు వెళ్ళమని ఆజ్ఞాపించి, రాజు తన ఆశ్రమమునకు రాణీ సమేతుడై వచ్చిన కారణమును తెలుపుమని అడుగ, రాజు తనకుగల కొరతను, విచారమును, వినయముతో విన్నవించి, తమ అనుగ్రహము తప్ప, ఇందుకు అన్యమార్గము లేదని ప్రార్థించెను.✍️
(సశేషం)
    🙏శ్రీ రామ రక్ష సర్వజగద్రక్ష🙏
జ్వాలా వారి విశిష్ట వ(ర)చనామృతం ‘శ్రీమద్భాగవత కథలు’   ```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment