Monday, July 21, 2025

 అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
*భగవద్గీత… ధారావాహిక-89.*
213d3;217e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀8️⃣9️⃣.```
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
``` 
                   *భగవద్గీత*
                  ➖➖➖✍️```
      (సరళమైన తెలుగులో)```

#మూడవ అధ్యాయము:
**కర్మయోగము.
————————————
*43. వ శ్లోకము:*

*“ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనాl*
*జహి శత్రుం మహాబాహోూ కామరూపం దురాసదమ్ll”*
```
కిందటి శ్లోకంలో నాలుగు తత్వాల గురించి చెప్పిన పరమాత్మ ఈ శ్లోకంలో బుద్ధి, ఆత్మ వీటి రెండింటి గురించి వివరిస్తున్నాడు. “అర్జునా! బుద్ధి కంటే ఆత్మ బలమైనది పరమైనది అని చెప్పానుకదా! ఆత్మ తరువాత బుద్ధి బలమైనదిగా తెలుసుకొని, బుద్ధితో మనసును, ఇంద్రియములను జయించి,(శమము,దమము పాటించి) ఈ రెండింటిని తన స్థావరములుగా ఏర్పరచుకొన్న జయించడానికి కష్టతరమైన, కామము అనే శత్రువును జయించు అని బోధించాడు.

ఇంతకు ముందు మనం నేర్చుకున్నాము. ఆత్మ ఒక్కటే, రెండు కాదు. ఆత్మ ప్రాపంచిక విషయములలో పడి తానెవరో తాను మరిచిపోయి, జీవాత్మగా మారి విషయ వాంఛలలో, కామ సుఖాలలో పడి కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు జీవుని లోని అహంకారము ఈ శరీరమే తాను అని భ్రమలో ఉంటుంది. కామానికి బానిస అవుతుంది. సుఖ దుఃఖములు అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరమే నేను అనుకోవడం, ఇదంతా నేనే చేస్తున్నాను, ఇదంతా నావల్లనే జరుగుతూ ఉంది, అన్నిటికీ నేనే కర్తను అని అనుకోవడమే సకల దుఃఖములకు మూలము. 
ఈ కామము ఎటుంటిది అంటే దురాసదము అయినది. జయించడానికి వీలుకానిది. అత్యంత బలమైనది. ఇంతకు ముందు శ్లోకంలో ఈ కామము అత్యంత పాపభూయిష్టమైనది, మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా నాశనం చేసేది అని తెలుసుకున్నాము. అటువంటి కామము మనలో ఉన్న బుద్ధిని కూడా వశం చేసుకొని జీవుడిని తన వైపుకు లాగుతూ ఉంటుంది. దీని కంతటికీ కారణం జీవుని అజ్ఞానము. తాను ఎవరో తాను తెలుసుకోలేకపోవడం. జీవాత్మ తాను ఎవరో తాను తెలుసుకున్న నాడు ఇంద్రియములు, మనస్సు బుద్ధి చెప్పినట్టు వింటాయి. అలా కాకపోతే అవిద్య, అజ్ఞానము వలన జీవుడు ప్రాపంచిక విషయములలో మునిగి పోయి, దానితో విడరాని బంధం పెంచుకుంటాడు. ఓ పట్టాన ఆ ముడి విడివడదు. ఎప్పుడైతే జీవాత్మ ప్రాపంచిక బంధనములు వదిలించుకొని పరమాత్మవైపు చూస్తాడో, తన స్వసరూపమైన ఆత్మ స్వరూపాన్ని పొందుతాడు. అప్పుడు ఇంద్రియములు మనస్సు ఇవన్నీ ఏమీ చేయలేవు.

నిజానికి దేహమునకు, ఇంద్రియములకు, మనస్సుకు, బుద్ధికి చైతన్యమును కలిగించేది ఈ ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ నుండి మనసు,బుద్ధి,శరీరము చైతన్యశక్తిని గ్రహిస్తున్నాయి. ఆత్మనుండి చైతన్య శక్తిని గ్రహిస్తున్న ఈ మూడు, విజృంభించి, ఆత్మనే శాసించే స్థితికి చేరుకుంటున్నాయి. దీనికంతా కారణం మనలో ఉన్న అజ్ఞానము. నేను ఆత్మస్వరూపాన్ని అనే సత్యాన్ని మరిచిపోయి ఈ దేహమే నేను అనే భ్రాంతిలో పడటం, ఆత్మజ్ఞానం కలిగిన మరుక్షణమే ఈ భ్రాంతి నశిస్తుంది.

దీనికి ఒకే ఒక ఉపాయం కూడా ఉంది. మనస్సును ఆత్మకు అనుసంధానం చేస్తే, చాలు. అప్పుడు ఇంద్రియములు నిర్వీర్యం అయిపోతాయి. కామం దానంతట అది నశించిపోతుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ! 
చాలా పొడవుగా ఉన్న రైలు ఏమి చేసినా ఆగదు. చిన్న బ్రేక్ వేస్తే ఆగిపోతుంది. అలాగే బలవంతమైన కామము, ఇంద్రియములు, మనస్సు కేవలం ఆత్మజ్ఞానము, తాత్విక జ్ఞానము అనే బ్రేక్ వేస్తే చాలు అన్నీ వాటంతట అవి ఆగిపోతాయి. ఒక్కొక్క ఇంద్రియమును అదుపుచేసేకంటే, లేక మనసును అదుపు చేసేకంటే, అన్నిటి కంటే పరమైన ఆత్మజ్ఞానం సంపాదిస్తే చాలు, బుద్ధి మనసు ఇంద్రియములు వాటంతట అవే అదుపులో ఉంటాయి. ఇదే పరమాత్మ ఈ అధ్యాయంలో మనకు విశదం చేసాడు. 

కాబట్టి శోకము అనే సాగరమును దాటతలచిన వారు, కామమును జయించదలచిన వారు, ముక్తిని పొందదలచిన వారు, ముందు తాను దేహము కాదు. నేను వేరు, దేహము వేరు అనే భావన అలవరచుకోవాలి. అది నిష్కామ కర్మ వలననే సాధ్యం అవుతుంది. నిష్కామ కర్మ వలన చిత్తశుద్ధి కలుగుతుంది. ఆత్మజ్ఞానము అలవడుతుంది. అప్పుడు మనసు ఆత్మలో లీనం అవుతుంది. అప్పుడు కామము ఏమీ చేయలేదు. అని పరమాత్మ బోధించాడు.

దీనితో కర్మయోగం ముగిసింది. సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ప్రతి మానవుడు తాను ఈ దేహము కాదు ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి. మనసును బయటకు పోకుండా ఆపి వెనకకు తిప్పి ఆత్మలో స్థిరంగా నిలపాలి. అప్పుడు బుద్ధి కూడా మనసును అనుసరిస్తుంది. మనస్సు బుద్ధి సాయం లేకపోతే ఇంద్రియములు వాటంతట అవి ఏమీ చేయలేవు. అప్పుడు కామము నిర్వీర్యము అవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు నేను ఈ శరీరం కాదు, నేను ఈ మనసు కాదు. నేను ఆత్మస్వరూపుడను అనే జ్ఞానం కలిగి ఉండాలి. మనసు, ఇంద్రియములు చేసే పనులను చూస్తూ ఉండాలి కానీ వాటిలో లీనం కాకూడదు. ఇదే ఆత్మజ్ఞానము. మోక్షానికి దారి. ఈ సందేశంతో పరమాత్మ కర్మయోగాన్ని సంపూర్ణం చేసాడు.

ఉపనిషత్తులయొక్క, బ్రహ్మవిద్యయొక్క, యోగశాస్త్రము యొక్క సారమయిన భగవద్గీతలో, కర్మ యోగము అను మూడవ అధ్యాయము సంపూర్ణము. ✍️```
*ఓం తత్సత్! ఓం తత్సత్!! ఓం తత్సత్!!!* 
```(సశేషం)
   🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 
 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)
.    *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
           🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment