217e4;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀7️⃣```ప్రతిరోజూ...
మహాకవి బమ్మెర పోతనామాత్య..
```
*శ్రీమద్భాగవత కథలు*
➖➖➖✍️```
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```
_________________________
*భాగవత జ్వాల*
*దశమస్కంధం*
```
ఒక దశమస్కంధం భాగవతానికి పరాకాష్ట వంటిది. సుదీర్ఘమై పూర్వ ఉత్తర భాగాలతో విలసిల్లే ఈ స్కంధంలో శ్రీకృష్ణలీలలు చాలా హృద్యంగా మన కనులముందు ప్రత్యక్షం చేస్తారు బమ్మెర పోతనామాత్యులు. దేవకీదేవి వసుదేవుల వివాహం, కంసుడికి ఆకాశవాణి హెచ్చరిక- అతడికి ఉద్రేకం కలగడం, వసుదేవుడి ప్రార్ధన, యోగమాయ మహిమ, బలరాముడి జననం, బ్రహ్మాది దేవతల స్తుతి, శ్రీకృష్ణ భగవానుడి జననం, వసుదేవుడు శ్రీకృష్ణుడిని నందవ్రజంలో యశోద నందుడి ఇంటికి చేర్చడం, కృష్ణుడు పూతనను చంపడం, శకటాసురుడిని కూల్చడం, తృణావర్తుడి మరణం, శ్రీకృష్ణుడి బాల్య క్రీడలు, మన్ను తినడం, ఆయన నోటిలో యశోదా దేవి సకల చరాచర ప్రపంచాన్ని చూడడం, రోటికి బంధించడం, ఆయన మద్దిచెట్లను కూల్చడం, నలకూబరుడు-మణిగ్రీవుల శాప విముక్తి, శ్రీకృష్ణుడు లేగలను మేపడం, వత్సాసుర సంహారం, బకారూపంలో వచ్చిన దైత్యుడి సంహారం, సర్పరూపదారి అఘాసురుడిని రూపుమాపడం, బ్రహ్మదేవుడు ఆవుదూడలను అంతర్ధానం చేయడం, బదులుగా కృష్ణుడు గోవత్సాలను-గోపాలబాలకులను సృజించడం, బ్రహ్మ శ్రీకృష్ణుడిని స్తుతించడం, గార్ధభాకారంలో వున్న ధేనుకాసురుడిని నిర్మూలించడం, కాళీయమర్దన, బలరాముడు ప్రలంబాసురుడిని చంపడం, శ్రీకృష్ణుడు దావాగ్నిని మింగడం, శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తడం, శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవి రాగాలతో లోకాలు ఊపేయడం, కృష్ణుడి సన్నిధికి గోపికలు రావడం, గోపికా వస్త్రాపహరణం, యమునానదీ తీరం వనంలో శ్రీకృష్ణుడు విహరించడం, గోవర్ధనోద్ధరణం, పోతన భాషలో జీవం పోసుకుంటాయి.
కంస సంహారం, సాందీపని వద్ద విద్యాభ్యాసం, జరాసందుడితో పోరాటం, ద్వారకకు రాజధాని మార్పు, ప్రేమించిన రుక్మిణీదేవి తనను రమ్మని లేఖ పంపడం, శ్రీకృష్ణుడు ఆమెను తీసుకుని పోయి వివాహం చేసుకోవడం దశమ స్కంధంలో ముఖ్య ఘట్టం. ఉత్తరభాగంలో ప్రద్యుమ్న జననం, సత్రాజిత్తుకు సూర్యుడు శమంతకమణిని ఇవ్వడం, దాన్ని అపహరించడానికి ఒక సింహం సత్రాజిత్తును చంపడం, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని కొనిపోవడం, మణిని కృష్ణుడే దొంగిలించాడని సత్రాజిత్తు నిందవేయడం, కృష్ణుడు తనమీద పడ్డ నిందను మాపుకోవడానికి జాంబవంతుడిని గెలిచి మణిని - ఆయన కూతురు జాంబవతిని తీసుకు రావడం, జాంబవతిని కృష్ణుడు వివాహమాడడం, సత్రాజిత్తుకు మణి ఇవ్వడం, సత్యభామతో పరిణయం, ఖాండవవనదహనం, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణలతో శ్రీకృష్ణవివాహం, నరకాసురవధ, పారిజాతాపహరణం, శివకేశవపోరాటం, బాణాసుర వధ, పౌండ్రకుని వధ, ధర్మరాజు రాజసూయయాగం, జరాసంధ శిశుపాల వధ, కుచేలోపాఖ్యానం, సుభద్రాపరిణయం, వృకాసురుడి వృత్తాంతం, కృష్ణార్జునులే నరనారాయణులని శ్రీమన్నారాయణుడు చెప్పే సంఘటనలు ఈ దశమ స్కంధంలో ఉంటాయి.
ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణుడు భూభారాన్ని తగ్గించి యాదవులకు పరస్పర వైరాన్ని కలగచేసి వారందరినీ అంతమొందించాలని అనుకోవడం; ఋషి శాప కారణాన యదుకులంలో ముసలం పుట్టడం; విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, నారదుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుడిని దర్శించడం; విదేహరాజుకు ఋషభపుత్రులైన నవయోగులతో జరిగిన చర్చ; నారాయణ ముని చరిత్ర, నారదుడు పురాతనమైన విదేహర్షభ సంవాదాన్ని చెప్పడం; ఋషభ కుమారుడైన కవి విదేహుడికి పరమార్థాన్ని బోధించడం హరి ముని, అంతరిక్షుడు చేసిన భాగవత స్వరూప ఉపదేశం; అవిర్హోత్ర, ద్రమీళుల భాషణ, నారాయణ ఋషి కథ; చమనకరభాజనులు చేసిన పరమార్థ ఉపదేశం; బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుడిని వైకుంఠానికి రమ్మని చెప్పడానికి రావడం; కృష్ణుడు దుర్నిమిత్తాలను చూసి యాదవులందరినీ ద్వారక నుండి ప్రభాస తీర్థానికి పంపడం కృష్ణుడు ఉద్దవుడికి పరమార్థ ఉపదేశం చేయడం; ధర్మనిరూపణార్ధం పెక్కు ఉపాఖ్యానాలను బోధించడం: అవధూత-యదు సంవాదం; నారాయణుడి లీలా విలాసమంతా తెలుసుకుని దారుకుడు వచ్చి ద్వారకానగర వాసులకు చెప్పడం; యదుకుల వినాశనానికి కారణమైన ముసలం పుట్టడం, శ్రీకృష్ణ బలరాముల వైకుంఠ యాత్రల కథలు వీనుల విందుగా ఉంటాయి. ఏకాదశ స్కంధంలోని అవధూత కథ అతడు తన ఇరవై నల్గురు గురువుల వద్ద నేర్చుకున్న పాఠాలు మనకు లభిస్తాయి.
ద్వాదశ స్కంధంలో యుగధర్మం, ప్రాకృతిక మొదలైన నాలుగు రకాల ప్రళయాల వివరణ; కలియుగరాజుల జన్మవృత్తాంతాలు; శ్రీవాసుదేవుడి లీలావతార విభూతులు; కలియుగంలో ధర్మచ్యుతి కలిగే తీరు; బ్రహ్మ ప్రళయ సంవిధానం; ప్రళయభేదాలు, తక్షకుడి కాటువల్ల పరీక్షిత్తు మృతి, జనమేజయుడి సర్పయాగం; వ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించడం; వేదాల విభాగ క్రమం; పురాణాల అనుక్రమణిక; పురాణాల శ్లోకసంఖ్యలు; మార్కండేయోపాఖ్యానం; సూర్యుడు ప్రతిమాసం భిన్న భిన్న నామాలతో పరిజనులతో రథ సంచారం చేసే క్రమం; చైత్రాది మాసాలలో సంచరించే ద్వాదశాదిత్యుల క్రమాన్ని తెలపడం ఉన్నాయి.
మరొక ఆశ్చర్యకరమైన అంశం ఏమంటే కలియుగం ఎలా ఉంటుందో ధర్మభష్టులైన రాజులు ఏ విధంగా దుర్మార్గులైపోతారో వివరించింది భాగవతంలోని చివరి భాగం. కలియుగంలో రాబోయే శివనాగ వంశం, నవ నందులు, మౌర్య- శుంగ వంశాల పాలన, కణ్వులు-ఇతర రాజులు వివరాలు ఉంటాయి. ఈ రాజులు స్వప్రయోజనాలను ఆశించి అధికారం చేపట్టే విధానం గురించీ భాగవతంలో వివరించారు. సదసద్వివేకం లేని మరి కొందరు కలియుగ రాజుల గురించి కూడా మనకు ఈ గ్రంధంలో తెలుస్తుంది. సుశర్ముడు అనే కణ్వవంశపు రాజును వృషలుడు అనే ఆంధ్ర జాతీయుడు వధించి అధర్మ మార్గంలో రాజరికం చేస్తాడని. ఆ తరువాత అతడి వంశీయులు 456 సంవత్సరాలు పరిపాలిస్తారని వివరించారు. అలాగే యవన తురుష్కాదులు, మురుందులు, గురుందులు, మౌన వంశ రాజుల, అభిరాదుల, బాహ్లికుల గురించీ వివరాలున్నాయి. చివరకు కలి ప్రభావం వల్ల ధర్మచ్యుతి జరగడం, కల్కి అవతారం, కృతయుగ ధర్మారంభం గురించీప్రస్తావిస్తారు.
పరమాత్మ సకల గుణాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, అఖిల లోకాధారుడు, ఆదిదేవుడు, త్రిదశాభివందితపాదాబ్జుడు, వనధిశయనుడు, ఆశ్రితమందారుడు, ఆధ్యంతశూన్యుడు. వేదాంతవేద్యుడు, విశ్వమయుడు, కౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుడు, శంఖచక్రగదాసిశార్ల ధరుడు, శోభనాకారుడు, పీతాంబరాభిరాముడు, రత్నరాజిత మకుట విభ్రాజమానుడు, పుండరీకాక్షుడు, మహనీయ పుణ్యదేవుడు అని సూతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని స్తుతించి, సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీకృష్ణునే తలచుకుంటూ, సన్నుతిస్తూ వుంటానని శౌనకుడికి చెప్పిన ఘట్టంతో భాగవతపురాణ రచన ముగుస్తుంది.
```
*వేద సారం*```
భాగవత కథా కథనం వేదవ్యాసుని వేద విభజన ప్రస్తావనతో ముగుస్తుంది. అంటే వేదాధ్యయనం చేయాలని అన్యాపదేశంగా మనకు మహాముని బోధిస్తున్నాడన్నమాట. ఆబోధనను జ్వాలానరసింహారావు అర్థం చేసుకున్నారు. వేదాలను తెలుగులో రచించిన దాశరథి రంగాచార్య పుస్తకాలను అధ్యయనం చేశారు. అనేక సంపుటాల్లో ఉన్న వేదవాఙ్మయాన్ని చదివి దాని సారాంశాన్ని వేదానుబంధంగా కేవలం 70 పేజీల్లో మనకు అందించారు. వేదాలతో భాగవతానికి ఉన్న అనుబంధాన్ని ఆవిధంగా అనుసంధించారు. వేదాలతో మొదలై, ఉపనిషత్తులు, భగవద్గీత, విష్ణు, లలితా సహస్రనామాలు, పద్దెనిమిది పురాణాలు, అనేకానేక ఉపపురాణాలు, వేదాలు నేర్చుకున్న ఋషుల బోధలు, ఇతిహాసాలు మన వారసత్వ సంపద. ఎందరు దోచుకున్నా తరిగిపోని సంపద. బుద్ధి లేక మనుషులు వదులుకుంటే తప్ప మనను వదలని మన సంస్కార కారణ సంపద. జ్వాలా నరసింహారావు, దాశరథి రంగాచార్య ప్రయత్నాన్ని, ఆయన వేద రచనాయజ్ఞ ఫల సారాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. మూడు సంవత్సరాల కాలంలో నాలుగు వేదాల అనువాదాన్ని 5 వేల పేజీలలో పూర్తిచేశారు దాశరథి. 70 సంవత్సరాల వయసులో ఇంతటి శ్రమ చేసి ఋగ్యజుస్సామాధర్వ వేదాల అనువాదం చేయగలగడం పరాత్పరుడి కరుణా కటాక్షం వల్లనే సాధ్యమైందని అన్నారు దాశరథి. వేదములు ఏనాటివో తెలియదు. వ్యాసభగవానుడు ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్లు కష్టపడ్డాడో తెలియదు.
మానవులు చెప్పనివి మునులు దర్శించినవి, తరువాత శిష్యపరంపరకు అందించినవి ఇవిగో ఈ విధంగా మనదాకా వచ్చినాయి. శృతి, స్మృతి ఆధారంగా, అంటే తాటాకులు, ఘంటాలు రాకముందు కాగితాలు కలాలు ఇంకులు లేకముందు కంప్యూటర్లు ఫాంటులు రావడానికి వేల సంవత్సరాల ముందు ఉదయించి, నిలిచి వెలిగిన దివ్యజ్ఞాన దీపాలు ఇవి. విద్య నదివలె ఉండాలన్నది వేదము. అంటే విద్య ఒకచోట నిలిచి ఉండకూడదు. నిరంతరం ప్రవహిస్తూ ఉండాల్సిందే. నదివలె అందరికీ ఉపయోగించాలి. మనకు పురాణాల్లో ఇంద్రుడు తపస్సులు భంగపరిచే స్వార్ధపరుడుగా కనిపిస్తాడు. కాని వేదాల్లో అతను గొప్ప కథానాయకుడు. స్వరాజ్యం గురించి ప్రభుత్వ సంక్షేమ కర్తవ్యాల గురించి వివరిస్తాడు. ప్రజారాజ్యం గురించి చెబుతాడు. ఆలోచనలను అవధులు లేని ఆకాశంతో సముద్రంతో పోల్చింది వేదం. అన్నమే బ్రహ్మమని చెప్పింది వేదం. జీవితం నిరంతర అన్వేషణ, సకల ప్రాణులు సమానమే అని చెప్పినవి. వేదాలు. మానవ సంబంధాలను వివరించినాయి వేదాలు.
ఒకటిగా ఉన్న వేదాలను వ్యాసుడు నాలుగు భాగాలుగా వర్గీకరించాడు. దేవతల గుణగణాలు వివరించే ఋగ్వేద సంహిత. యజ్ఞయాగాల వివరాలు చెప్పేది శుక్ల యజుర్వేద సంహిత, కృష్ణయజుర్వేద సంహిత, బ్రహ్మ జ్ఞానం వివరించేది సామవేద సంహిత, అనేకానే లౌకిక విషయాలు తెలిపేది అధర్వవేద సంహిత. సామ వేదాన్ని శాంతి వేదమని సంగీత వేదమని అంటారు. ఋగ్వేదము పరిపూర్ణ శాంతి యుత స్వయం సమృద్ధ సమాజాన్ని సృష్టించింది. స్త్రీలకు ఆస్తిహక్కు, కుటుంబ యాజమాన్యాన్ని ఇచ్చింది. అధర్వవేదంలో రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ వివరాలు ఉన్నాయి అని దాశరథి రంగాచార్య అనువాద సారాంశాన్ని ఇందులో చేర్చారు.
అడుగడుగునా ఇవన్నీ చదవడం తన పూర్వజన్మ పుణ్యమని పదేపదే ప్రస్తావించి తన భక్తిని చాటుకున్నాడు శ్రీ జ్వాలా నరసింహారావు. పన్నెండు స్కందాలలో ఉన్న సువిశాలమైన భాగవత కథా సాగరాన్ని చిన్న పుస్తకరూపంలో సంక్షిప్తీకరించి, ఇదిగో ఇదీ మీ భాగవతం అని జ్వాలానరసింహారావు మనకు అంకితం చేసిన మహాద్భుతం ఈ శ్రీమద్భాగవతం. రామాయణాన్ని మహారామాయణం. అనలేదు. ఒక్క భారతానికే మహాభారతం అనే విశేషణం ఉంది. భాగవతానికి వ్యాసుడు, పోతన కూడా శ్రీమద్భాగవతం అని నామకరణం చేశారు. ఇది శ్రీమంతమైనది. లక్ష్మీ ప్రదమైనది. లక్ష్మి అంటే ఇక్కడ మోక్ష జ్ఞానలక్ష్మి, సులక్ష్యలక్ష్మి. ఇది శ్రీమద్భాగవతం. శ్రీమంతమైన భగవంతుడి కథ, శ్రీమంతుడైన భగవంతుడి భక్తుల కథ. సృష్టి స్థితి లయ విన్యాసాల కథ.
జ్వాలా కలం ధన్యం, జ్వాలా ఆలోచన ధన్యం. జ్వాలా లో జ్వలిస్తున్న రచనా జ్వాల ధన్యం.. ఎందరి మనసుల్లోనో ఈ దివ్య దీప్తి జ్వాల అనేకానేక జ్ఞానభక్తి దీపాలను వెలిగించి పాపాందకార కూపాలను ధ్వంసం చేయుగాక.✍️
-ఆచార్య మాడభూషి శ్రీధర్.
(పూర్వ కేంద్ర సమాచార కమీషనర్ హైదరాబాద్.)
(సశేషం)
🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏
రచన:శ్రీ వనం జ్వాలా నరసింహారావు ```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment