అందరికీ సులభంగా అర్ధమయ్యే
రీతిలో…
*భగవద్గీత… ధారావాహిక-88.*
203d3;207e3;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀8️⃣8️⃣.
భగవద్గీత పఠనం…
మీ అన్ని సమస్యలకు పరిష్కారం…!
*భగవద్గీత*
➖➖➖✍️
(సరళమైన తెలుగులో)
#మూడవ అధ్యాయము:
**కర్మయోగము.
——————————————
*42. వ శ్లోకము:*
*”ఇంన్ద్రియాణి పరాణ్యాహురిన్ద్రియేభ్యః పరం మనఃl*
*మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సఃll*
```
“ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కన్నా మనసు గొప్పది. మనసు కంటే బుద్ధి గొప్పది. ఈ మూడింటి కంటే గొప్పది ఆత్మ. ఇది పెద్దల అభిప్రాయము.
పరమాత్మ ఇప్పటి దాకా ఇంద్రియములు, మనస్సు బుద్ధి గురించి చెప్పాడు. ఇప్పుడు వాటిలో తర తమ బేధములు తెలియజేస్తున్నాడు. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది. మనస్సు కన్నా బుద్ధి గొప్పది. బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. కిందటి శ్లోకంలో ఇంద్రియములను నిగ్రహించడం ముఖ్యం అని చెప్పాడు. మరి ఇంద్రియములను దేనితో నిగ్రహించాలి. దానికన్నా పవర్ ఉన్న దానితో నిగ్రహించాలి. ఒక అధికారి మాట వినకపోతే యం.యల్.ఏ. చేత చెప్పిస్తాము. అక్కడ పని కాకపోతే మంత్రి, అతనివల్ల కూడా కాకపోతే, ముఖ్య మంత్రి. అలాగా ఇంద్రియములను కట్టడి చేయాలంటే దానికన్నా గొప్పదైన మనస్సుతో కట్టడి చేయాలి. మరి ఇంద్రియములను మనస్సును కట్టడి చేయాలంటే బుద్ధి జోక్యం చేసుకోవాలి. అందుకే దేహము రథము, మనస్సు గుర్రాలు, బుద్ధి సారధి అన్నారు. సారథి గుర్రాలను తద్వారా రథాన్ని సక్రమమైన మార్గంలో నడపగలడు. ఈ మూడు కూడా మాట వినకపోతే ఆత్మజ్ఞానమే ముఖ్యం. ఆత్మజ్ఞానం కలిగితే ఈ మూడు మాటవింటాయి. కాబట్టి మనసును బుద్ధిని ఆత్మయందు నిలిపితే, ఇంద్రియాలు చచ్చినట్టు మాట వింటాయి. కాబట్టి మనసును బుద్ధిని ఆత్మయందు నిలిపి ఆత్మయందు రమించాలి. అదే శాశ్వత సుఖాని కలుగజేస్తుంది. కాబట్టి ఇంద్రియములను, మనోబుద్దులను నిగ్రహిస్తే, కామము దానంతట అది చచ్చిపోతుంది అని పరమాత్మ బోధించాడు.
ఈ శ్లోకంలో మరొక విశేషం కూడా ఉంది. ఒకదాని కంటే మరొకటి గొప్పది అని నిరూపిస్తున్నాడు పరమాత్మ. ఒక గీత ఉంది. దానిని పెద్దది చేయాలంటే దాని పక్కన మరొక చిన్న గీత గీస్తే చాలు. ముందు గీత పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే ముందు గీత పక్కన ఇంకొక పెద్ద గీత గీస్తే చాలు ఈ గీత చిన్నది అయిపోతుంది. కాబట్టి ప్రతి దానికి చిన్న పెద్ద తారతమ్యాలు ఉంటాయి. మామూలుగా స్థూల ప్రపంచంలో చిన్న దాని కంటే పెద్దది శక్తివంతంగా కనిపిస్తుంది. కానీ స్థూల సూక్ష్మవస్తువుల విషయంలో స్థూల వస్తువు కంటే సూక్ష్మ వస్తువు చాలా పవర్పుల్, కనపడే ఫాన్ కంటే కనపడని కరెంట్ చాలా పవర్ఫుల్, కనపడని కరెంట్ లేకపోతే కనపడే ఫాన్ తిరగదు. దీనినే మనం ఈ సృష్టికి అన్వయించుకోవచ్చు. అణోరణీయం మహతో మహీయాన్ అంటే పరమాత్మ అణువుకంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నవాడు అని అర్థం. అందుకే పరమాత్మ మనకు కనపడడు కాని అంతటా నిండి ఉన్నాడు. అన్నిటి కంటే బలవంతుడు, శక్తివంతుడు. ఆకాశం మనకు కనపడదు కానీ పరమాత్మ కంటే కొంచెం స్థూలం. దానికి ఒక గుణం ఉంది. అదే శబ్దము, హోరు. అనంతమైన ఆకాశంనుండి పుట్టిన శబ్దం. ఆకాశంకంటే స్థూలము వాయువు. అదీ అంతటా నిండి ఉంటుంది. దానికీ శబ్దం ఉంది. దానితో పాటు స్పర్శ ఉంది. దాని కన్నా స్థూలం అగ్ని, ఇది కనపడుతుంది. శబ్దం చేస్తుంది. స్పర్శ ఉంది వాటితో పాటు రూపం కూడా ఉంది. గాలి మాదిరి ఎక్కడ అంటే అక్కడ ఉండదు. పరిమితంగానే ఉంటుంది కానీ వ్యాపిస్తుంది. దాని కన్నా స్థూలం జలం. దీనికి శబ్దము, రూపము, స్పర్మ ఉన్నాయి వీటితో పాటు రుచి కూడా ఉంది. ఇది అగ్ని మాదిరి పైకి ఎగరలేదు. అంతటా వ్యాపించలేదు. నేలబారుగా ప్రవహిస్తుంది. దీని కన్నా స్థూలము భూమి. ఇది ఘనీభవించిన పదార్థము. దీనికి శబ్ద, స్పర్శ,రస, రూపములు ఉన్నాయి. వాటితో పాటు వాసన కూడా ఉంది. ఈ ఐదు పంచభూతముల కంటే శక్తి వంతమైనది అతి సూక్ష్మమైనది పరమాణు స్వరూపమైన ఆత్మ కాబట్టి స్థూలము కంటే సూక్ష్మశక్తి బలమైనది. దానినే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ.
ముందు శరీరము, అవయవములు ఇవి స్థూలములు, ప్రాపంచిక విషయములను గ్రహిస్తాయి. చూస్తాయి, వింటాయి, తాకుతాయి. దీని కన్నా సూక్ష్మమైనది మనసు. సంకల్పములు, వికల్పాలు చేస్తుంది. ఈ పని చెయ్యాలా వద్దా అని తర్కిస్తుంది. అలాగే మనసు మనిషిని భావోద్వేగాలకు గురి చేస్తుంది. మనసు చేసే పనులకు విచక్షణా జ్ఞానము పరిమితులు ఉండవు. మనసు చెప్పినట్టు ఇంద్రియాలు స్పందిస్తుంటాయి. ఈ మనసు చేసే సంకల్పవికల్పాలను, భావోద్వేగాలను, బుద్ధి, తనలో ఉన్న సంస్కారాన్ని విచక్షణాజ్ఞానాన్ని ఉపయోగించి అదుపు చేస్తుంది. ఆ బుద్ధికి శాస్త్రముల ద్వారా సంస్కారము, విచక్షణాజ్ఞానము, అలవడలేదనుకోండి. అప్పుడు బుద్ధి కూడా మనసును అనుసరిస్తుంది. అందుకే ‘బుద్ధిః కర్మానుసారిణీ’ అనే సామెత వచ్చింది. ఈ ప్రకారంగా శరీరము, మనస్సు, బుద్ధి ఒకదానిని మించి ఒకటి, ఒకదాని కంటే ఒకటి శక్తివంతంగా పనిచేస్తుంటాయి. వీటన్నింటి కంటే పరమైనది మరొకటి ఉంది. అదే ఆత్మ. అది మనస్సు బుద్ధి కంటే సూక్ష్మము. కాని వీటన్నిటికంటే బలమైనది. కానీ ఏమి చేయదు. అన్నిటినీ సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. మనలో ఒకదానికంటే మరొకటి శక్తివంతంగా బలంగా పనిచేసే నాలుగు తత్వాలగురించి వివరంగా తెలుసుకున్నాము.✍️```
(సశేషం)
🙏యోగక్షేమం వహామ్యహం🙏
రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం,
(రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment