Wednesday, August 27, 2025

 🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

*🌼 ఒక యోగి ఆత్మకథ-16*

*(🖌️రచన :- శ్రీ పరమహంస యోగానంద)*


*🌼4-అధ్యాయం*
*🌼హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం*

కాని, మా కొక బలమైన ఆధారంగా ఉన్న డబ్బును వాళ్ళు మా దగ్గరినుంచి తీసేసుకోగానే నా జతగాడు నిరాశావాదిగా మారిపోయాడు.

“అల్లాటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనక మనం నడక మొదలెట్టామంటే, చివరికి మనం చేరేది సాధువులుండే చోటికి కాదు- పెద్ద పులుల పొట్టల్లోకి!”

మరి మూడు రోజులకి అనంతుడూ, అమర్ వాళ్ళ అన్నయ్యా వచ్చారు. అమర్ అయితే, తేలికపడ్డ మనస్సుతో వాళ్ళన్నయ్యను ఆప్యాయంగా పలకరించాడు. నేను మాత్రం సమాధాన పరుచుకోలేదు. అనంతన్నయ్యకి ముట్టినవల్లా తీవ్రమైన నిందలకు మించి మరేమీ లేదు.

“నీ మనస్సు కెలా అనిపిస్తుందో నాకు తెలుసురా!” అంటూ మా అన్నయ్య నన్ను సముదాయిస్తూ అన్నాడు. “నేను నిన్ను కోరేదల్లా ఒకటే– కాశీలో మంచి జ్ఞాని ఒకాయన ఉన్నాడు; ఆయన్ని కలుసుకోడానికి నాతో కాశీ రమ్మనీ, నీ కోసం బెంగపెట్టుకున్న నాన్న గారిని ​చూడ్డానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమనీను. కావలిస్తే తరవాత సాగిద్దువుగాని, ఇక్కడ గురువు కోసం వెదకడం.”

ఈ విషయం దగ్గర అమర్, మా మాటల్లో కలగజేసుకుని, నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశమేమీ తనకి లేదని ఖండితంగా చెప్పాడు. కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు. కాని నాకు తెలుసు, నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని.

మేమంతా కాశీ వెళ్ళే రైలు ఎక్కాం. అక్కడ నా ప్రార్థనకు సాటిలేని, తక్షణ ఫలితం కనిపించింది.

అనంతన్నయ్య తెలివిగా, ముందే ఒక పథకం వేసి ఉంచాడు. హరిద్వారం వచ్చే లోపున, దారిలో కాశీలో ఆగి ఒక పండితుణ్ణి కలుసుకొని, తరవాత నాతో మాట్లాడేటందుకు ఏర్పాటు చేశాడు. నేను సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకొనేటట్టు చెయ్యడానికి ప్రయత్నిస్తానని ఆ పండితుడూ ఆయన కొడుకూ అనంతన్నయ్యకి మాట ఇచ్చారు.

అన్నయ్య నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు. పండితుడుగారి కొడుకు యువకుడే; ముంగిట్లోనే నన్ను మంచి ఉత్సాహంగా పలకరించాడు. నాకు సుదీర్ఘమైన వేదాంతోపన్యాసం ఇచ్చాడు. తనకు, దివ్యదృష్టి వల్ల నా భవిష్యత్తు తెలుసునని నొక్కి చెప్పి, సన్యాసిని కావాలన్న నా ఉద్దేశాన్ని చులకనగా కొట్టిపారేశాడు.

“నీ మామూలు బాధ్యతల్ని విడిచిపెట్టాలన్న పట్టుమీదే కనక నువ్వు ఉన్నట్లయితే, నీ కెప్పుడూ దురదృష్టమే దాపురిస్తుంది; దేవుణ్ణి దర్శించ ​లేవు! ప్రాపంచిక అనుభవాలు పొందనిదే నీ పూర్వకర్మను ఒక్క నాటికి తప్పించుకోలేవు,” అన్నాడాయన.

అందుకు సమాధానంగా, భగవద్గీతలో చెప్పిన అమృత వాక్కులు నా నోటినుంచి వెలువడ్డాయి. “ఎంతో దుష్కర్మ మూటగట్టుకున్నవాడు కూడా ఎడతెరిపి లేకుండా నన్ను ధ్యానించినట్లయితే, అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి. అతడు ధర్మాత్ముడయి శాశ్వత శాంతి నందుకుంటాడు. నన్ను నమ్ముకున్న భక్తు డెవడూ నశించడు. ఇది నిశ్చయమని తెలుసుకో!”


అయితే ఆ యువకుడు అంత గట్టిగా జోస్యం చెప్పేసరికి నాలో విశ్వాసం కొద్దిగా సడలింది. అప్పుడు గుండెనిండా భక్తి నింపుకొని మనస్సులో దేవుణ్ణి ఇలా ప్రార్థించాను:

“దయ ఉంచి నా మానసిక ఆందోళన పోగొట్టు- ఇక్కడే, ఇప్పుడే జవాబు చెప్పు- నన్ను సన్యాసిగా బతకమంటావా, సంసారిగానా? నీ ఉద్దేశం చెప్పు”

ఈ పండితుడుగారి ఇంటి ఆవరణకు వెలువల ప్రసన్న వదనుడయి ఉన్న ఒక సాధువును గమనించాను. దివ్యదృష్టి కలవాణ్ణని చెప్పుకొనే ఈయనకూ నాకూ తీవ్రంగా జరిగిన సంభాషణను ఆయన వినే ఉంటా డన్నది- నన్ను తన దగ్గరికి పిలవడంతో అర్థమయింది. ప్రశాంతమైన ఆయన కళ్ళలోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలువడుతున్నట్టు నాకు అనుభూతి కలిగింది. ​“బాబూ, ఆ అజ్ఞాని మాటలు చెవిని పెట్టకు. నీ ప్రార్థనకి జవాబుగా, ఈ జన్మలో నీకు నిర్ణయమయిన ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడు.”

కచ్చితమైన పరిష్కారంలా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే నాకు ఆశ్చర్యమే కాదు - కృతజ్ఞతాభావం కూడా పెల్లుబికింది. సంతోషంగా చిరునవ్వు నవ్వాను.

“ఆ మనిషి దగ్గర్నించి వచ్చెయ్యి!” అంటూ ముంగిట్లోంచి “అజ్ఞాని” నన్ను పిలుస్తున్నాడు. ఋషితుల్యుడయన నా మార్గదర్శకుడు ఆశీర్వాద సూచకంగా చెయ్య ఎత్తి మెల్లగా వెళ్ళిపోయాడు.

“నువ్వెంత పిచ్చివాడవో ఆ సాధువు అంత పిచ్చివాడు.” ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసినవాడు తల నెరిసిన పండితుడు. ఆయనా, ఆయన కొడుకూ నా వేపు సానుతాపంగా చూస్తున్నారు. “అతను కూడా దేవుడికోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచిపెట్టేశాడని విన్నాను.”

నేను ఆ వేపునుంచి తిరిగిపోయాను. ఈ ఇంటివాళ్ళతో నే నింకేమీ మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేశాను. దాంతో అతను నిరుత్సాహపడి, వెంటనే వెళ్ళిపోవడానికి ఒప్పుకొన్నాడు. వెంటనే మేము కలకత్తా వెళ్ళే రైలు ఎక్కాం.

“డిటెక్టివుగారూ, నేను ఇద్దరు స్నేహితులతో కలిసి పారిపోయానని మీరు ఎలా కనిపెట్టారూ?” అని అడుగుతూ, సరదాగా నాకు కలిగిన ఆసక్తిని మా తిరుగు ప్రయాణంలో అన్నయ్యదగ్గర బయటపెట్టాను. అతను కొంటెగా నవ్వాడు.

🙏🙏🙏🌼🌼🌼🌼🙏🙏🙏

No comments:

Post a Comment