[8/29, 22:00] +91 63042 02100: #భాషకు_వచ్చిన_బాధలు
పంపిన వారు: వేణి కొలిపాక
"గోధూళి వేళ అవుతుంటే చక్కగా అలంకరించుకొని ఆరు బయట జన సమ్మర్దము చూస్తూ, భర్త రాక కోసం ఎదురుచూస్తోంది"..
"ఆగు ఆగు".. "ఇలా రాస్తే ఈ రోజుల్లో ఎవరు చదువుతారు?" అంటూ నన్ను ఆపింది నా సఖి సంధ్య. 'ఏం?' అన్నాను అర్థం కాక. "నువ్వు అలా స్వచ్ఛమైన తెలుగులో రాసుకుంటూ పోతే ఎవరూ చదవరు.. ఇప్పుడు చాలా సరళమైన భాషను, వీలుంటే ఎక్కువగా ఇంగ్లీష్ మాటలు వాడుతూ రాస్తే, అదే ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది" అంది సంధ్య. అవును సంధ్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది!
అసలు భాష ఎందుకు? భావాల్ని వెల్లడి చేయాలంటే భాష కావాలి!! ఇదొక్కటే విధిగా కల 'భాష' కు ఎందుకింత ప్రాధాన్యత అంటే,మన భావాల అందాలన్నీ మనం చెప్పే భాషలోనే నిబిడీకృతం అయి ఉన్నాయి. మన భావాలతో అవతలి వారిని ఆకట్టుకునే కళ, భాషకు సొంతం. మన భాష ఎంత సొగసుగా ఉంటే, భావాల అందం అంత ద్విగుణీకృతం అవుతుంది. సరే మన అందరిదీ తెలుగు భాష కాబట్టి మనం తెలుగుని గురించే మాట్లాడుకుందాం ఇక్కడ!!
'దేశభాషలందు తెలుగు లెస్స' అని కన్నడ రాజ్య చక్రవర్తి అయినా, 'ఆంధ్రభోజుని'గా పేరు తెచ్చుకున్న కృష్ణదేవరాయలు కీర్తించిన భాష మన తెలుగు. నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రగడ, పోతన, శ్రీనాథుడు నుంచి ఆధునిక కాలంలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు మొదలైన అనేకమంది సరస్వతీపుత్రుల నోట వెంట, ఎంతో అందంగా జలజలా గలగల కృష్ణమ్మ, గోదారి నదుల్లా పారి, అద్భుత పాండిత్యం వారి వశం చేసి , అత్యద్భుత సాహిత్యం వారు మన పరం చేసేలా చేసింది మన తీయనైన తెలుగు భాష!!
విద్యను సరస్వతీ స్వరూపంగా పూజించే మనం, భాషకు ఆధారమైన అక్షరాలు అన్నీ ఆ తల్లి స్వరూపాలుగానే భావిస్తాం. అక్షరాలను కూడా దైవ స్వరూపాలుగా భావించడం మన సంస్కృతి గొప్పతనం!!
నా మటుకు నాకు తెలుగు బాగానే వచ్చినా, శ్రీ విశ్వనాథ వారి సాహిత్యం అర్థం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. శ్రీ గరికపాటి నరసింహారావు గారు, రామాయణ కల్ప వృక్షంలో ప్రతి పద్యానికి వివరంగా అర్థాలు చెబుతుంటే వింటున్నప్పుడు, విశ్వనాథ వారి లాంటి మహానుభావుడి రచనా పటిమను అయ్యో నా అంతట నేను చదివి అర్థం చేసుకోలేకపోతున్నానే అని బాధపడ్డాను.
అందమైన తెలుగును ఆస్వాదించాలన్నా, ఆ భాష వయ్యారాలు, సొగసులు మనసుకు హత్తుకు పోవాలన్నా, ఆ భాష మీద ప్రేమ, అభిమానం ఉండాలి. భాష మీద పట్టు రావాలంటే చక్కటి సాహిత్యం చదవాలి !! అప్పుడే మనం మంచి భాషతో కూడిన రచనలు మన పాఠకులకు అందించగలుగుతాం!!
సమాజంలో వచ్చే మార్పులను మనం అంగీకరించాలి అంటారు. నిజమే!!! కానీ తేనె వలే తీయగా ఉండే తెలుగు భాష చేదవుతుంటే చూస్తూ ఊరుకోకూడదు కదా!! సరళమైన భాషను వాడుతూనే మధ్యమధ్యలో చక్కటి పదాలను కూడా వాడుతూ ప్రజలకు మంచి తెలుగును అందిస్తూ ఉండొచ్చు!
ప్రధానంగా ప్రసార మాధ్యమంలో ఉన్న వారిలో చాలామంది కలగూరగంప భాష వాడి, అక్షరాలను వారి ఇష్టం వచ్చినట్లు పలికి, తెలుగును చాలానే తిప్పలు పెడుతున్నారు. పైగా దీనితో భాష అంటే ఇలాగే ఉండాలి అని ప్రజలకు, ముఖ్యంగా యువతకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి .
నన్నయాది పూర్వ కవుల భాష , వారి తర్వాత తరాలకు పలుచబడి వచ్చింది. అలా ఒక తరం నుంచి ఇంకో తరానికి మన భాష చిక్కదనం తగ్గి , ఇదిగో ఇప్పుడు ఇలా వేరే భాషలతో కలిసిపోయి జీవించాల్సి వస్తోంది.
ఉన్న భాషను ఎలా మెరుగుపరచాలి అని ఆలోచించడం ఏమో కానీ, అసలు తెలుగు భాషయే మాయం కాకుండా చూడాలి!! అని హెచ్చరిస్తున్నారు పెద్దలు. అమెరికాలోని మన పిల్లలు భారతీయ కళలన్నీ నేర్చుకుంటున్నారు. కానీ అందులో ఎంతో మంది మన భాషను మాత్రం అటకెక్కిస్తున్నారు. పాటకు తగ్గ అడుగులు వేసి నాట్యం చేస్తారు.. కానీ పాట అర్థమయ్యి కాదు!! టీచర్ చెప్పింది నేర్చుకొని ..అలాగే సంగీతం కూడా. చక్కగా ఇళ్లల్లో తెలుగు మాట్లాడితే, వారు నేర్చుకునేవి వారికి అర్థమవటమే కాకుండా, ఇంగ్లీషులోనే మాట్లాడడం ఇబ్బందిగా ఉండే నానమ్మ, అమ్మమ్మ, తాతలతో అనుబంధం కూడా పెంచుకోవచ్చు, మనసారా వారికి వచ్చిన భాషలో వారితో మాట్లాడి. భాష రాక పడే బాధలు అమెరికాలో పిల్లలతోనే కాదు తెలుగు రాష్ట్రాలలో ఉండే వారు కూడా ఎదుర్కొంటున్నారు అనేది ఆశ్చర్యకరమైన విషయం.
'గోధూళి వేళ'... అంటూ పైన చెప్పిన వాక్యంలాగా స్వచ్ఛమైన తెలుగులో రాస్తే ఎంత అందంగా ఉంది!! కానీ ఇలా రాస్తే ఎవరూ చదవరు.. ఇందులో ఓ అరడజను ఇంగ్లీష్ పదాలు జొప్పిస్తే, అప్పుడు ఆకర్షణీయంగా ఉంటుంది అంటున్నారు...మరి, కొన్ని కొన్ని మాటలు మనం రాసేటప్పుడు ఉపయోగించకపోతే , అవి మరుగున పడిపోతాయి కదా!! గోధూళి వేళ అంటే సాయం సమయం అన్న విషయమే ఈ కాలం వారికి తెలియక పోవచ్చు. అనేక పదాలు వాడుకలో లేక మర్చిపోవడం ఇప్పటికే జరిగింది.
తెలుగు సామెతలు, జాతీయాలలో ఎంత సాహిత్యం, విషయ పరిజ్ఞానం, జీవిత సత్యాలు దాగి ఉన్నాయి...? 'కరువులో అధికమాసం', 'మొక్కై వంగనిది మానై వంగుతుందా', 'అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని', 'వడ్డించేవాడు మనవాడైతే' ఇలా అనేకం రోజువారి జీవితాలకు సంబంధించినవి వీటిల్లో దొర్లుతూ ఉంటాయి. వీటిని ఇంట్లో మనం వాడుతుంటే, పిల్లలు ఇట్టే నేర్చేసుకుంటారు !! వారికి వేరే మోరల్ సైన్స్ క్లాసులు అవసరం లేదు.
ఇక తెలుగు పద్యాలు కూడా పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా సరదాగా నేర్చుకోవాలి. మన శతక సాహిత్యం అర్థమయ్యేలా ఉండి, అవి చదివిన వారికి ఆనందాన్ని, జీవితంపై అవగాహనని కలిగిస్తాయి అనటంలో సందేహమే లేదు!!!
ఇదంతా కాదండి... ఈసారి ఏ పిల్లల పుట్టిన రోజులైనా, 'పెద్దబాలశిక్ష'నే బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకోవాలి మనం. ఇది ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవాళ్లకు కూడా పెద్ద నేస్తం అయి మన తెలుగుకు పట్టిన తెగులును కొంతవరకైనా వదిలిస్తుంది.
మనం, మన ఇంట్లో వారితోనే కాకుండా తెలుగు వారందరితో ఇకనుంచి మంచి స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడదాం అని నిర్ణయం తీసుకుందాం!!! తెలుగు భాష అమృతత్వాన్ని ఆస్వాదిద్దాం!!!
ధన్యవాదాలు 🙏
[8/29, 22:00] +91 63042 02100: వేణీ కొలిపాక గారు చాలా బాగా వ్రాసారు... నిజమే ఈ రోజుల్లో గోధూలివేళ అంటే ఏదేమైనా పదార్థమా? అస్సలదంటే ఏమిటి అనే ఘనులున్నారు. వాళ్ళకు అదస్సలు తెలుగు పదమేనా లేక ఎక్కడనుండైనా ఇంపోర్ట్ చేసుకున్న పదమా అనే వాళ్ళూ లేకపోలేదు.
కన్నడ వాళ్ళూ తమిళం వాళ్ళూ ఈ తరం వాళ్ళు కూడా చక్కగా వారి భాష మాట్లాడుతారు. ఒక్క మన తెలుగువాళ్ళు తప్ప... ఇక ఫేస్బుక్, యూట్యూబ్ రీల్స్ వీడియోలు గురించి చెప్పక్కర్లేదు.
సినిమారంగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఈ తరం పిల్లల్లో ఇంగ్లీష్ పదాలు వాడకుండా తెలుగు మాట్లాడడం అనేది వాళ్ళకు చేతకాని పని.
దానికి కారణం లేకపోలేదు. ఇంగ్లీష్ మీడియం చదువులు. తెలుగు ఆప్షనల్ లాంగ్వేజ్ కానీ తప్పనిసరిగా నేర్పరు. దానికి తోడు తల్లి తండ్రులు కూడా పిల్లలు కూడా పిల్లలతో ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు. అందువల్ల నేటితరం పిల్లలకి కానీ వారి తల్లితండ్రులకు కానీ సరైన భాషా పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు.
ఇక సాహిత్యానికి సంబంధించి, నలభైల్లో ఉన్న మధ్యవయస్కులకే తెలుగు సాహిత్యం గురించి సరిగ్గా తెలీదు అలాంటి మరో తరానికి సాహిత్యం గురించి వారు చెప్పే అవకాశం ఎక్కడ ఉంటుంది?
రాను రానూ భాష పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. భాషను సంరక్షించుకోవడానికి విస్తృతంగా భాషా ప్రచారం చెయ్యాలి. తెలుగు భాషని పాఠశాలల్లో తప్పనిసరిగా నేర్పించాలి. ఆ భాష కూడా సమగ్రంగా తెలిసిన వాళ్ళు నేర్పడమే బాగుంటుంది. లేదంటే అదీ వ్యర్థ ప్రయాస అవుతుంది.
*కళ్ళు*ని *కల్లు* అనీ, *వాళ్ళు*ని, *వాల్లు* అని పలికే ప్రబుద్ధులు తయారవుతారు.
*తెలుగు భాషని ప్రేమిద్దాం. తెలుగు భాషను తెలుగులాగానే మాట్లాడుదాం. తెలుగు భాషను పరిరక్షించుకుందాం. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.*
No comments:
Post a Comment