ప్రణవ స్వరూపుడు
మన సంప్రదాయంలో గణపతి ఆరాధన అత్యంత ప్రధానమైనది. వేదాలు, మంత్రశా స్త్రాలు, పురాణాలు, గణేశతాపినీ ఉపనిషత్తు వంటి ఉపాసనోపనిషత్తులు స్వామి ప్రత్యే కతను చాటాయి. గణపతిని పరమాత్మగా ఉపాసించే సత్సంప్రదాయం గాణపత్యంలో ఉంది. గణేశపురాణం, ముద్గలపురాణం, మహాగణపతి దర్శనం వంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. స్కాంద, బ్రహ్మవైవర్తాది పురాణాలలో గణపతిగాథలు, విశేషాలు ఎన్నో! సృష్టి ఆరంభంలో వచ్చిన విఘ్నాల నుంచి బయటపడేందుకు బ్రహ్మ ప్రణవా (ఓంకారా)న్ని జపిస్తూ ధ్యానిస్తుండగా... ఆ ప్రణవమే గజానన రూపాన్ని ధరించి సాక్షాత్కరించిందని పురాణగాథ. 'ప్రణవ స్వరూప వక్రతుండం...' అని ముత్తుస్వామి దీక్షితులు కీర్తించారు. సృష్టి ఆదిలో బ్రహ్మకు గోచరించిన ప్రణవస్వరూపుడే ఉమామ హేశ్వర తనయుడిగా ఉదయించాడు. విశ్వగణపతి అయిన స్వామియే ప్రమథ గణపతిగా అభిషిక్తుడయ్యాడు.
వేదాల్లో మంత్రగణపతి అయిన 'ఓంకార' స్వరూపుడిగా, యోగశాస్త్రంలో యోగగణపతి మూలాధారచక్ర సంస్థితు డిగా, అక్షరగణపతి అయిన విద్యాస్వరూ పుడిగా అభివర్ణించారు. బుద్ధిని తీర్చిదిద్ది నడిపించే స్వామి కనుక 'వినాయకుడు' అయ్యాడు. శివుడి సన్నిధిలో ఉన్నవాడు కాబట్టి 'హేరంబు'డని, వక్రబుద్ధులను తొలగించి బుద్ధిని సవరించేవాడు కనుక 'వక్రతుండు'డని అనేక నామాలతో గణ నాథుణ్ని పిలుస్తారు. మంచి పనులకు విఘ్నాలు తొలగించి, చెడు పనులకు విఘ్నాలు కలిగించి జగతి గతిని నిర్వి ఘ్నంగా నడిపే స్వామి 'విఘ్నేశ్వరుడ'ని ప్రసిద్ధి. అభీష్టసిద్ధులను ప్రసాదించే 'వరద గణపతే'- 'కష్టాలను నివారించే 'సంకష్టహర గణపతి' కూడా!
దేవతలు, రుషులు, ఉపాసకులు, పండితులు, పామరులు ప్రీతిగా ఆరాధించే దైవం ఏకదంతుడు. అర్చించిన వెంటనే అనుగ్రహించే దయాళువు ఈ 'క్షిప్రగణపతి'. కోరిక లను తీర్చడమే కాక, చిత్తానికి చైతన్యాన్ని ప్రసాదించే పరతత్త్వం ఈయనే కాబట్టి 'చింతామణి గణపతి' అంటారని ముద్గలమహర్షి వంటి ద్రష్టలు నిర్వచించారు. 'ఓం' కారం 'అ'కార, 'ఉ'కార, 'మ'కార, 'తురీయా'లనే నాలుగు భాగాలతో ఉంటుందని ఉప నిషత్ వాక్యం. 'తురీయం' శుద్ధమైన పరబ్రహ్మతత్త్వం. అ, ఉ, మ- సృష్టి, స్థితి, లయ లను కలిగించేది ఈశ్వర స్వరూపం. ప్రపంచ కార్యాలలో మూడక్షరాల, మూడుగుణాల తత్త్వం (అ, ఉ, మ) వ్యక్తమవుతుంటుంది. ప్రపంచానికి అతీతమైనది 'తురీయం'. ఈ నాలుగు తానైన ఈశ్వరుడే గుణగణా'లకు, ప్రకృతి 'గణా'లకు పతి. పంటల దేవు డిగా, పృథ్వీతత్త్వ నియామకుడిగా గణపతిని పూజించడం కూడా సంప్రదాయమే.
వేర్వేరు యుగాలలో అనేకమార్లు అవతరించిన గణేశ లీలలను పురాణాలు వివరించాయి. ఎంతో లోతైన దివ్యతత్వాల రూపంగా గణేశవైభవం శాస్త్రాల్లో కనిపిస్తుంది. భక్తులందరూ ఇష్టంగా పూజించుకునే వరసిద్ధి వినాయకుడు, జన'గణ' మనసులకు అధినాయకుడిగా విశ్వక్షేమాన్ని కలిగించాలని ఈ పుణ్యపర్వాన భక్తిగా ప్రార్థించుకుందాం.
సామవేదం షణ్ముఖశర్మ
No comments:
Post a Comment