Thursday, August 28, 2025

 *అల్లరి చేస్తున్నారని మీరూ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..మన వైద్య నిలయం సలహాలు*

కొందరు తల్లిదండ్రులు పిల్లలు మొండిగా ఉండటంతో వారి చేతికి మొబైల్ ఫోన్లు ఇచ్చి రిలాక్స్‌ అవుతున్నారు. మీ పిల్లలు కూడా ఇలా మొబైల్ ఫోన్‌లకు బానిసలై ఎక్కువ సమయం ఫోన్‌లలో గేమ్‌లు, సోషల్ మీడియాలో గడుపుతున్నారా? పిల్లలు ఫోన్‌ను ఎక్కువసేపు చూస్తే ఏం జరుగుతుందో.. అది పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో.. మీరు తప్పక తెలుసుకోవాలి...

*పిల్లలకు ఫోన్లు ఇస్తే ఏమవుతుంది?*
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తరచూ ఫోన్ చూడటం వల్ల వారి ఏకాగ్రత తగ్గుతుంది. ఇది వారి చదువులు, ఇతర కార్యకలాపాలను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా ఫోన్‌ను ఎక్కువగా చూడటం వల్ల వారికి చిరాకు, కోపం కూడా ఎక్కువగా వస్తుంది.

నిద్ర సంబంధిత సమస్యలు
కొంతమంది పిల్లలు రాత్రిపూట మొబైల్ ఫోన్లు చూస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటారు. ఇది వారి నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. అలాగే ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా పిల్లలు రాత్రిపూట సరిగ్గా నిద్రపోలేరు.


కళ్ళపై ప్రభావం
ఫోన్ స్క్రీన్‌ల నుంచి వచ్చే నీలిరంగు రేడియేషన్ పిల్లల సున్నితమైన కళ్ళకు హాని కలిగిస్తుంది. దీనివల్ల అస్పష్టమైన దృష్టి, కంటి చికాకు, కళ్ళ నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి.

శారీరక శ్రమ లేకపోవడం
ఎక్కువ సమయం కూర్చుని ఫోన్లు చూస్తూ గడిపే పిల్లలు బహిరంగ ఆటలు ఆడటానికి దూరంగా ఉంటారు. దీనివల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. ఇది పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది పిల్లలలో బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. తద్వారా ఊబకాయానికి కారణమవుతుంది.

సామాజిక నైపుణ్యాలపై ప్రభావం
పిల్లలు మొబైల్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు సామాజికంగా బలహీనంగా మారతారు. వారు ఎవరితోనూ ఎక్కువగా సంభాషించలేకపోవడం, మాటలు సరిగ్గా రాకపోవడం సమస్యలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ అలవాటు పిల్లల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు, చురుకుదనం, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది...

No comments:

Post a Comment