Friday, August 1, 2025

 *తృప్తి ఉంటే అన్నీ ఉన్నట్టే.....* 

*ఉన్నదానితో తృప్తిపడమనేది మన పెద్దలు చెప్పిన సూత్రం. అంటే ఎంత ఉంటే దానితో సరిపెట్టుకుని ముందుకు కదలవద్దని కాదు, ఎంత ఉన్నా ఇంకా కావాలని, అసంతృప్తితో రగిలిపోవద్దని దాని భావం. ఈనాడు చాలా మంది ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే ఆత్రంతో ఏవేవో చేసి దుఃఖానికి గురవుతున్నారు. కనుకనే అసంతృప్తితో సొక్కిసోలిపోతున్నారు. తృప్తి ప్రతి ఒక్కరికి అవసరం. అలాంటివారే గొప్పవారు. ఆదిశంకరులు కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో అని ప్రశ్న వేసుకున్నారు. ఎవరికైతే తృప్తి ఉంటుందో వారే ధనికులు. ఎంత ధనం ఉన్నా సంతోషం లేనివాడు ధనికుడే కాదు. పేదవారైనా తృప్తిగా జీవించేవారే ధనికులు. అందుకే పెద్దలు తృప్తి చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కంబడునో అన్నారు. ఒక వెయ్యి రూపాయలు ఉన్నవాడు 'ఆహానాకు భగవంతుడు వెయ్యి రూపాయలు ప్రసాదించాడు. నేనెంత అదృష్టవంతుడిని' అనుకోవాలి. 'ఇది* *లేనివాడు ఎంత బాధపడతాడో కదా!' అని తృప్తి చెందాలి. కానీ లక్ష రూపాయలు ఉన్నవాడిని చూసి దుఃఖిస్తే ఉన్నది కూడా వృధా అవుతుంది. కాళ్లు ఉండి నడవగలవాడు, 'అయ్యో! నాకు కాళ్ళకు మంచి చెప్పులు లేవె, వానికి కారుంది, కారులో తిరుగుతున్నాడు' అని బాధపడకుండా కాళ్లులేక దేకే వ్యక్తిని చూసి 'ఆహా భగవంతుడు నాకు కాళ్లిచ్చాడు. నేనెంత అదృష్టవంతుడిని' అని తృప్తి చెందాలి. కనుకనే మనం ఉన్నత స్థాయికి పోవాలనుకుంటే, దైవానికి దగ్గరవ్వాలనుకుంటే సంతృప్తి అనేది అత్యవసరం.*

*వివేకానంద, రామకృష్ణ పరమహంస, తులసీదాస్, రామదాసు, కబీర్ దాస్ ఇలాంటి మహానుభావులు అందరూ ఈ విధంగానే జీవితాన్ని గడిపారు. వారికి ఒక్కొక్క రోజు తినేందుకేమీ ఆహారం ఉండేది కాదు. అప్పుడు వారు 'భగవంతుడు నాకు చక్కని అవకాశం ఇస్తున్నాడు. ఉపవాస దీక్షలో నన్ను ఉండమని ఆదేశిస్తున్నాడు. ఇది ఎంత అదృష్టం' అనుకుని ఉపవాసంతో ఆనందించేవారు. ఒక్కోసారి పంచభక్ష్య పరమాన్నాలతో, అన్ని విధాలైన పిండివంటలతో భోజనం లభించినప్పుడు 'భగవంతుడీనాడు నన్ను ఉపవాసం త్యజించి నాయనా చక్కగా ఆరగించమని పంపాడు' అని ఆ రెండు స్థితులలో దేనికి గురైనా తృప్తిపడుతూ వచ్చేవారు. తినటానికి తిండీ, ఒంటిలో శక్తిలేని సమయంలో కృంగిపోవటంగాని, శక్తిసామర్థ్యాలు చేకూరినప్పుడు పొంగిపోవటం గాని ఈ రెండూ ప్రమాదకరమని వారు భావించారు, కనుకనే 'సమత్వం యోగ ఉచ్యతే' అన్నారు ఆనాటి మహర్షులు. అలాంటి సమత్వాన్ని వారు బోధించారు. సమత్వాన్ని అనుభవించాలి. అన్నిటినీ ఒకే రకంగా స్వీకరించగలగాలి. ఇదే తృప్తికి చిహ్నం. ఇట్టి తృప్తిని కలిగినవాడు భగవత్ సన్నిధిని, పెన్నిధిగా అనుభవించటానికి అధికారి కాగలడు. అయితే ఈ సంతృప్తి ఎలా సంపాదించగలం! అంటే సత్సంగ ఫలం వల్ల. మంచి వారితో చేరితే వారి సద్భావాలు మనకూ అలవడి తృప్తిని పొందడం సుగమం అవుతుంది. ఈనాడు చాలా మంది చెడు అలవాట్లకు లోనవుతున్నారు. చెడ్డ వారితో స్నేహం వల్ల మంచివారు కూడ చెడ్డవారుగా మారిపోతారు. అందుకే 'దుస్సంగాన్ని దుడ్డు పెట్టి అయినా దూరం చెయ్యాలి. సత్సాంగత్యాన్ని సర్వమూ ఇచ్చి స్వాధీనం చేసుకోవాలి' అంటారు పెద్దలు. దీనికి ఒక ఉదాహరణ-చీకటి రాత్రిలో దట్టమైన అరణ్యంలో టార్చిలైట్ పట్టుకుపోయేవాడు తోడైతే మన ప్రయాణం సులువవుతుంది. ఇద్దరి వద్దా టార్చిలైట్ లేకపోతే ఇద్దరు చిక్కుల్లో పడతారు. లైట్ ఉన్న వానితో కలసి ప్రయాణం చేస్తే మనం కూడా క్షేమంగా గమ్యాన్ని చేరగలం. అదే విధంగా సద్గుణాలు, సదాచారాలు, సత్ప్రవర్తన, సత్సంగం ఉన్న వారితో మనం కూడా చేరితే ఉన్నత స్థాయిని పొందుతాం. మంచివారితో చేరిన చెడ్డవారికి కూడా విలువ హెచ్చుతుంది.*

*చెడ్డవానితో చేరిన మంచివారు విలువ కోల్పోతారు. దీనికి ఒక ఉదాహరణ, ఒక పాలవాడు లీటరు పాలు 20 రూపాయలకు అమ్మేవాడు. వాడి వద్ద పది లీటర్ల పాలు ఉండేవి. ఎవరో మరు రోజు అదనంగా లీటరు పాలు కావాలన్నారు. పాలవాడు తన వద్ద ఉన్న పది లీటర్ల పాలలో ఒక లీటరు నీరు కలిపాడు. ఆ విధంగా పదకొండో లీటరునూ 20 రూపాయలకు అమ్మాడు. పాలతో కలిపినందున నీటికి కూడా విలువ పెరిగింది. అలాగే పదిలీటర్ల నీటిలో ఒక లీటరు పాలు పోస్తే ఎవరైనా కొంటారా? దుర్జనులతో సాంగత్యం వల్ల సజ్జనుడి విలువ కూడా తగ్గిపోతుంది. మంచి వారితో చేరితృప్తి, సంతోషం, దానం, సేవ మొదలైన మంచి గుణాలు అలవరచుకుని మంచివారిగా మారిపోవచ్చు. అందుకే మంచి వారితో స్నేహం మరువపు మొక్క వంటిదని పెద్దలు అంటారు. సత్ప్రవర్తనతో, సచ్చింతన, సదాలోచన, సద్భావాలతో ఉన్నవారితోనే ఉండాలి. ఆ విధంగా మనం తృప్తినే కాక శాంతిని, సంతోషాన్ని కూడా సాధించి జీవితాన్ని సుఖవంతం, ఫలవంతం చేసుకోవచ్చు.,*

*┈┉┅━❀꧁ హరేకృష్ణ ꧂❀━┅┉┈*
         *ఆధ్యాత్మిక అన్వేషకులు*
🕉️🙏🕉️ 🙏🕉️🙏 🕉️🙏🕉️

No comments:

Post a Comment