Wednesday, October 22, 2025

 *మహామంత్రి మాదన్న - 16* 
(చరిత్ర ఆధారిత నవల)
👳🏽

రచన : ఎస్.ఎమ్. ప్రాణ్ రావు


మాదన్నది చెప్పుకోతగ్గ అధికార హెూదా వున్న ఉద్యోగమే. మంది మార్బలం
సదా వెంట వుండే ఉద్యోగమే. మాదన్నకి బంధుప్రీతి ఎక్కువ. తనకున్న పరిమితుల మేరలో తన బంధుమితృలకి, సాటివారికి వీలైనంత ఉపకారం చేశాడు. అక్కన్న కూడా మాదన్న వెన్నుదన్నుతో ఉద్యోగంలో చకచక ఎగబాకాడు. తమ్ముళ్లు మల్లన్న, విస్సన్న, మేనల్లుళ్లు పొదిలి లింగన్న, ఎంగన్న లకి కూడా తగిన అవకాశాలు కల్పించాడు. మాదన్న, అతి చురుకైన అతని మేనల్లుళ్లు తమ తమ ఉద్యోగాల లో మెప్పు పొందారు.

ఆ రోజు మాదన్న తన కొడుకు మల్లన్నకి ఒడుగు చేస్తున్నాడు. అందుకే ఇంటి ముందు ఎప్పుడూ వుండే ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు ఆ రోజు లేవు. ఇంటి ముందు విశాలమైన పందిరి వుంది. పందిరి గుంజలకి రంగురంగుల పట్టు వస్త్రాలు చుట్టారు. పందిరి లోపల తెల్లని వస్త్రాన్ని చాందినీగా అమర్చారు. పందిరి  లోపలా బయటా మామిడి తోరణాలు, పూలమాలలు వేలాడుతున్నాయి.

పందిరి లోపల అగ్నిహోత్రం వెలుగుతోంది. స్వాహాకారాలు వినిపిస్తున్నాయి. వేద పండితులు వేద పఠనం చేస్తున్నారు. వయసు పైబడ్డా మాదన్న గురువుగారు బలరామశాస్త్రి అక్కడే కూచుని వారితో గొంతు కలుపుతున్నాడు.

ఇల్లంతా చుట్టపక్కాలతో నిండిపోయి కోలాహలంగా వుంది. హనుమకొండ నుంచి ఇతర ఊర్ల నుంచి వచ్చిన బంధువుల సందడితో మారుమ్రోగుతోంది. వాళ్లకి మర్యాదలలో ఏ లోపం రాకుండా చూసుకుంటున్నారు అక్కన్న, ఇతర సోదరులు. వీధి గుమ్మం బైట విశాలమైన అరుగు మీద కూర్చున్న భజంత్రీల వాళ్లు సన్నాయి మేళం వాయిస్తున్నారు.

వడక పెళ్లికొడుకు వేషంలో ముద్దులు మూట కడుతున్నాడు మల్లన్న. అంతా ఒడుగు కార్యక్రమం ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి ఒడుగుకి వచ్చిన యువకులు దూరంగా వేసిన మరో పందిరి కింద కూచుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.
📖

గాయత్రి ఉపదేశం, బిక్ష అయిపోవడంతో ఒడుగు కార్యక్రమం ముగిసింది. భోజనానికి పిలుపు రావడంతో అంతా అటువైపుకి వెళ్ళారు.

పునుగు రాజసాలతో వండిన అన్నం, ముద్దపప్పు, తియ్య కూరలు, మిరియపు పొడి వేసి తాళింపు పెట్టిన కూరలు, ఆవ ఘాటు పచ్చడులు, గుమ్మడి ముక్కల పులుసు, చారు, వడియాలు, లడ్డూలు, పాయసం ఇవన్నీ చూడగానే భోక్తలకి జఠరాగ్ని ప్రజ్వలించింది. వీటికి తోడు వెన్న కాచిన నెయ్యి, మీగడ పెరుగు, తియ్యని దానిమ్మ పళ్లు, పనసతొనలు ఆ అగ్నికి ఆజ్యం పోశాయి. అంతా సుష్టుగా భోజనం చేసి అన్నదాతా సుఖీభవ: అని వారిని మనస్ఫూర్తిగా దీవించారు. ఉత్తరాపోశనం పట్టి ఆపసోపాలు పడుతూ లేచి దక్షిణ తాంబూలాలు ఇచ్చే పందిరి వైపు కదిలారు.

ఆ సాయంత్రం నగరంలోని తోటలను చూడటానికి అనో, చార్మినారు ఎక్కడానికి అనో, ఇలా తలా ఒక నెపం ఎన్నుకుని శేషప్ప కొలువు కూటం బయటపడింది.

ఇంటికి పెద్దవాడుగా వున్న అక్కన్న సంభావనలు, పెట్టుపోతల విషయం చూసుకుంటున్నాడు. మాదన్న అతని తమ్ములు, మేనల్లుళ్లు పందిరిలో ఒక మూల కూచుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'గోపన్నా, ఉద్యోగం అంతా సానుకూలమేనా' అడిగాడు మాదన్న.

'చెప్పలేనంత సానుకూలత. ఈ ఉద్యోగం వల్ల నా జన్మ తరించింది మామయ్యా' అన్నాడు గోపన్న.

'ఉద్యోగాల వల్ల జన్మ తరిస్తుందని ఎన్నడూ ఎక్కడా వినలేదు' అన్నాడు పొదిలి లింగన్న.

'అవును. లౌకిక కొలువుల వల్ల జన్మ సాఫల్యం కాదు' అన్నాడు గోపన్న.

'నీకు ఇప్పించింది లౌకిక కొలువే కదా' అన్నాడు మాదన్న.

'మా అన్నగారికి అక్కడ ఏ పరిష్వంగలో నన్నా అలౌకిక ఆనందం దొరికిందేమో' మేలమాడాడు లింగన్న.

'నిజమే తమ్మల దమ్మక్క..'

“ఎవరావిడ' అనుమానంగా అడిగాడు మల్లన్న మధ్యలోనే అందుకుని.

కారణజన్మురాలు. శబరి అవతారం అని జనులు కీర్తిస్తారు. ఆ మహాభక్తురాలికి శ్రీ రామచంద్రుడు కలలో కనిపించాడట. నీలోత్పలదళ శ్యాముడు, కిరిటీకుండల మండితుడు, వనమాలా విరాజితుడు, శంఖచక్ర గదాధారి, అద్భుత పసిడి అలంకారములు గల జానకీ ప్రాణ వల్లభుడు ఆమెకి కనిపించాడట. అలా కనిపించిన ఆ ధనుర్ధారి 'నేను భద్రగిరి కొండ మీద ఉన్నాను. నాకు గుడి గోపురాలు కట్టించి అలంకారాలు చేసేవాడు త్వరలో వస్తాడు. అందాకా నన్ను కనిపెట్టుకుని సేవించు అని చెప్పి అంతర్ధానమయ్యాడట' ఆ మాటలు చెబుతున్నప్పుడు గోపన్నలో అష్టభావాలు పొంగాయి. కళ్లెంట కారిన నీళ్లు ఎర్రబారిన అతని ఎదురు రొమ్ము మీద ముత్యాల్లా మిలమిలలాడాయి.

'అది సరే. ఆ తమ్మల దమ్మక్కకి రామ చంద్రుడు కనిపిస్తే మధ్యలో నీకెందుకిన్ని పులకింతలు' అడిగాడు యంగన్న.

'నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రామనామం జపిస్తూనే ఉన్నాను. నా గురువు తారక మంత్రము ఉపదేశించినప్ప టి నుంచి రామస్మరణ తప్ప నాకు మరో ధ్యాసలేదు' అన్నాడు గోపన్న తన్మయత్వం నిండిన గొంతుతో.

'మరి ఉద్యోగం ఎలా చేస్తున్నావు' అడిగాడు యంగన్న.

'రాముడే చేయిస్తున్నాడు' అన్నాడు గోపన్న అతిశయించిన ఆనందంతో.

'ఉద్యోగ ధర్మానికి లోటు రానివ్వకు' హెచ్చరించాడు మాదన్న.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
'రానియ్యను. నాకు ఉద్యోగం వుండాలి. ఎర్రటి ఎండలో అలంకార రహితుడిగా రామభద్రుడు భద్రాద్రి మీద వున్నాడు. ఆ లక్ష్మీపతి నేడు తాటియాకుల పాకలో పడి వున్నాడు. ధూపదీప నైవేద్యాలు లేక అలమటిస్తున్నాడు. కానీ తమ్మల దమ్మక్క కి స్వప్నంలో, ఆ ప్రభువు సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. ఆమె కల సాకారం కావాలి. ఎప్పటికైనా నా రాముడి కి గుడి కట్టించి, సీతారామ లక్ష్మణులకు సర్వాలంకారాలు చేయిస్తాను. ఇదే నేను తరించే మార్గం' గోపన్న ఈ మాటలు తనకి మటుకే కనిపిస్తున్న ఏదో అదృశ్యశక్తితోనో, వ్యక్తితోనో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఆ మాటల బరువును ఓపలేక అతని శరీరం మొత్తం ఒక రకమైన దివ్య కంపనాలకి లోనయ్యింది.

'గుడి గోపురం కట్టించాలంటే నువ్వు పీష్వావో, లేక పెద్ద జాగీర్ దారువో కావాలి. అవి రెండూ నీకు అందని చందమామలు' అన్నాడు మాదన్న.

'మామయ్యా, దైవ లీలలు తర్కానికి అందనివి. నా భక్తి నా రాముడిని కదిలిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడం నా స్వామికి చిటికెల మీద పని. కావలసినదల్లా పరిపూర్ణమైన భక్తి మాత్రమే' అన్నాడు గోపన్న భక్తి విశ్వాసాలతో పరవశించిపోతూ.

మాదన్న మొహం గంభీరంగా మారింది. 

'గోపన్నా, నీ భక్తి భావం ఉదాత్తమైనదే, కాదనను. కానీ భక్తికి భుక్తికి మధ్య కొన్ని గీతలున్నాయి. అవి ఒకదాని నొకటి చెరిపేసుకుంటే, నీ జీవితంలోంచే కాదు, నీ చుట్టూ వున్నవాళ్ల జీవితాల్లోంచి కూడా వెలుగులు వలసపోతాయి' అన్నాడు.

'మామయ్యా, నీ అభిప్రాయం నీది. నా ఆలోచన నాది' అన్నాడు గోపన్న.

'గోపన్నా, ఇలాంటి ఆలోచనలు కట్టిపెట్టు. వాస్తవంగా ఆలోచించు. చేతకాని, చెయ్యలేని పనులను తలకెత్తుకుని చిక్కులలో పడకు' అన్నాడు మాదన్న నచ్చచెబుతున్న ధోరణిలో.

'మామయ్యా, దైవ సంకల్పం ఉంటే దోమ మేరు పర్వతాన్ని ఎత్తుతుంది. పిచ్చుక సముద్రాన్ని ఖాళీ చేస్తుంది. అది నా ప్రగాఢ విశ్వాసం. నా రాముడిని తాటాకులపాకలో బోసిపోయినట్లు వుండనివ్వను. గుడి గోపురాలు కట్టి తీరుతాను. నగ నట్ర
 చేయించి తీరుతాను' అన్నాడు గోపన్న దృఢత్వం నిండిన గొంతుతో.

👳🏽
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment