Wednesday, October 22, 2025

 " ఈ రచన నా స్వంతరచన " - తులసీభాను

❤ మనసు కథలు ❤ 

❤🌿 రాధ మధు 🌿❤

రాధ, మధు..ఒక పెళ్ళిలో ఉన్నారు...

పెళ్ళికూతురు వాళ్ళు ముహుర్తం రేపు అనగా ఆ ముందురోజు సరదాగా అందరూ పాటలు, డాన్సులు, పొడుపుకధలు..అలా ఏవి వస్తే అవి చేసి చూపాలి...అన్నట్టుగా ఏర్పాటు చేసారు...

అందరూ హుషారుగా పాల్గొంటున్నారు...

రాధ, మధు, ఎంత సక్కగున్నవే అనే కొత్తపాటలకు..పాండవులు పాండవులు తుమ్మెద అనే పాత పాటలకు.. సమానంగా, చలాకీగా నృత్యం చేస్తూ అందరి చప్పట్లు, ఈలలు అందుకుంటున్నారు...

రాధ వయసు 55, మధు వయసు 62...

బాబాయ్ మీరు ఏం తింటారో మాకూ చెప్పండి..మేమూ అవి తిని మీలా ఎంతవయసొచ్చినా హుషారుగా ఉంటాము అన్నాడు పెళ్ళికూతురి తండ్రి రాజేష్...

మా రాధమ్మ ఏది చేసి పెడితే అది మారుమాట్లాడకుండా తినేస్తా...అన్నాడు మధు...

ఏం రాధమ్మా, ఏం మంత్రం వేసి వండుతావో మాకూ చెప్పు, మా ఆయన నా వంటలకు పెట్టే వంకలకి నా తల వాచి పోతుంటుంది అంది శారద, రాజేష్ తల్లి.....

ఏమీ లేదు అక్క, మామూలుగానే వండుతా....అనేసింది రాధ...

మరుసటిరోజు పెళ్ళి అయ్యి అప్పగింతలు అప్పుడు..రాజేష్, వీణ..తమ కూతురు శ్రేయను వదల్లేక ఒకటే ఏడుపు...

శారద మనవరాలి కోసం దిగులు పడుతోంది...రాధ,మధు ధైర్యం చెబుతున్నారు...

ఈ రోజుల్లో ఏమంత దూరాలురా ...ఎక్కడున్నా ఒక్క రాత్రిలో చేరిపోవచ్చు..ఎవరికి ఎవరిని చూడాలనిపించినా సరే...అని చెబుతూ...

పెళ్ళి తరువాత రెండురోజులకి రాధ, మధు వారి ఇంటికి బయలుదేరుతున్నారు...

శారద వాళ్ళు కూడా బయలుదేరుతున్నారు, వారి ఇంటికి..

శారద మూతి ముడుచుకుని కూర్చుంటోంది కాసేపు, ఏదో గొణుక్కుంటోంది కాసేపు...

రాధ కాసేపు ఇదంతా చూసి శారదను అడిగింది...ఏమిటీ అని...శారద చెప్పింది...

ఇన్నేళ్ళు వచ్చీ , వాడు కూడా ముసలాడు అవుతున్నా రాజేష్ కి అమ్మానాన్నని దగ్గర పెట్టుకోవాలి అని అనిపించట్లేదు...వీణ పడనీదు...తన కూతురి పెళ్ళి అయ్యి వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చింది వీణ..అదే కన్నతల్లి మనసు కాదా నాది, అదే బాధ కాదా నాది...ఎంతసేపూ మేము తిరుపతిలోనే ఉంటాము..రాజేష్ వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారు...అప్పుడప్పుడూ రాకపోకలు తప్ప అయినవాళ్ళల్లా కలిసి ఉన్నదెప్పుడు, వీణకు నా బాధ ఎప్పటికైనా అర్ధమౌతుందో లేదో...అని మూతి ముప్ఫయ్యి వంకర్లు తిప్పింది...

రాధ వింటూ ఉంది...వీణ చెరో బాక్స్ అందిస్తోంది...పెళ్ళి స్వీట్లూ, కారబ్బూందీ సర్ది పెట్టాను బాక్సుల్లో...వెళ్ళాక తినండి...అని చెబుతూ...నాకేమీ వద్దు...అంది శారద...వీణ మొహం చిన్నబోయింది...నాకు షుగరూ, ఆయనకు బీపి..ఏం వద్దు అంది పుల్ల విరిచినట్టు...రాజేష్ వింటూ ఇది మామూలేగా అన్నట్టు వీణకు సైగ చేసాడు, బాధ పడకు అన్నట్టు...

అది చూసి శారదకు ఇంకా కోపం వచ్చింది...అమ్మా అని పక్కన వచ్చి కూర్చుని తల్లి చెయ్యిని పట్టుకోబోతున్న రాజేష్ చేతిని నెమ్మదిగా తోసేసింది శారద...రాధ అదంతా చూస్తూ ఉంది...

ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళారు రాధవాళ్ళు, శారద వాళ్ళు..

కొన్ని నెలలకి వీణకి కాన్సర్ అని తెలిసింది...తల్లడిల్లిపోయాడు రాజేష్...

శ్రేయ పెళ్ళి అయి వెళ్ళాక వీణ ఒంటరిగా అనిపిస్తోంది అనుకుని వీణతో ఇంకా ఎక్కువ సమయం గడుపుతున్నాడు రాజేష్...దానివల్ల వీణతో ఇంకా అనుబంధం 
ఎక్కువయ్యింది రాజేష్ కి...

ఇప్పుడు ఈ అనారోగ్యం వార్త అస్సలు తట్టుకోలేకపోతున్నాడు..

శారద కూడా వీణ అనారోగ్యం గురించి తెలుసుకుని బాధపడింది..

రాజేష్ కి ధైర్యం చెప్పటానికి వెళ్ళారు శారద దంపతులు...

రాజేష్ వాళ్ళ ఇంటిలో పని అమ్మాయి ఉంది...
వీణకు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడబోతే వీణకు ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోబెట్టాల్సి వచ్చేది శారదకు..

అది తప్ప పనులు అన్నీ పనమ్మాయి చూసేస్తుంది...అది కూడా రాజేష్ ఇంట్లో లేనప్పుడే...రాజేష్ ఇంట్లో ఉంటే వీణను తనే చూసుకునేవాడు...ఆ మాత్రం చిన్న ఆసరా ఇవ్వటానికే శారద..మాకు ఏ నాడైనా నువ్వు చేసింది లేదు, చూసింది లేదు..ముసలిదాన్ని ఇప్పుడు నేను నీకు చెయ్యాల్సి వస్తోంది...అని 
సాధించేది శారద, వీణని...

వినీ వినీ ఒకరోజు వీణ శారదకు చెబుతోంది...

" అత్తయ్యా..పెళ్ళి అయిన కొత్తల్లో మావి ఇద్దరివీ ఉద్యోగాలు..మీరే కదా అప్పట్లో అనేవారు ..ఇంట్లో మాకు తోచదు, పైగా మీరు ఇంటికొచ్చేటప్పటికి అన్నీ నేను చేసిపెట్టలేను అని, మీరే , తిరుపతిలో మాకు హాయిగా ఉంటుంది...ఇక్కడ తెలుగు మాట్లాడేవాళ్ళు తక్కువా, కాలక్షేపం ఉండదు అని మీరే కదా స్వయంగా తిరుపతిలో స్థిరపడ్డారు...

నేను మిమ్మల్ని ఇక్కడ ఉండద్దు అని ఎప్పుడైనా మీతో చెప్పానా...అంది వీణ...

ఉండమని కూడా చెప్పలేదుగా అంది శారద ఏ మాత్రమూ తగ్గకుండా...

మనసుకి కష్టమనిపించింది వీణకి..

అత్తయ్యా ఒకరిని ఒకరు చూడలేదు అనుకోవటమెందుకు..ఎవరి పరిస్థితి వారికి నిత్యం పరిష్కరించుకుంటూ ఉండాల్సిందే..ఇప్పుడు శ్రేయ తన కొత్తబంధాలను అర్ధం చేసుకోవాలి, వాళ్ళూ తనని ప్రేమగా స్వీకరించాలి...ఇప్పుడు శ్రేయకు ఆ పనే ముఖ్యం..శ్రేయ వెళుతూనే మనని మర్చిపోయింది అనుకుని బాధపడ్డామంటే అది మన పొరపాటు..కాదంటారా...

అలానే నేనూ పెళ్ళైన కొత్తలో అటు ఉద్యోగం, మీ అబ్బాయి, ఇటు ఇల్లు దిద్దుకోవటం..ఇలా అన్నీ సరిగ్గా చెయ్యటంలో ఉక్కిరిబిక్కిరి అయ్యేదాన్ని..

మీరు ఉండే నెలరోజుల్లో ఏదన్నా ఒక పని చెయ్యాల్సివస్తే..నీ పనికోసమా ఈ ఇంట్లో నేనున్నది, ఇంత దూరం నేనొచ్చింది, అని నాతో పోట్లాడేవారు..

కోపంతో నాలుగు రోజులు ముందుగానే వెళ్ళిపోయేవారు..నేను మీకు అనువుగా లేనేమో కానీ ఏ రోజూ మిమ్మల్ని వ్యతిరేకించలేదు, మీ మీద కోపమూ పెట్టుకోలేదు...అని చెపుతూ చెపుతూనే వీణకి స్పృహ తప్పిపోయింది..

రాజేష్ కి ఫోన్ చేసి  చెప్పింది శారద కంగారుగా...వీణను హాస్పిటల్ లో చేర్పించారు...శ్రేయ, రాధ మధు వచ్చారు వీణను చూసేందుకు..

రాజేష్ కి పనమ్మాయి చెప్పింది.. శారద , వీణ మాటలు గురించి..

రాజేష్ కి ఎప్పుడూ లేని కోపం వచ్చింది శారద పైన...

అమ్మా, నువ్వు నా చిన్నప్పుడు, నాకు అవసరమైనప్పుడు నా దగ్గర ఉన్నావా...అలా అని ఆ విషయంలో అయినా కూడా,  నేను ఏ రోజైనా నిన్ను నిందించానా..ఈ మధ్య కాలంలో నువ్వు మాతో మాట్లాడేది అంటే అది కేవలం మమ్మల్ని సాధించటమే...అని గదిలోకి వెళ్ళి తలపట్టుకుని కూర్చున్నాడు..

రాధ శారదకు చెప్తోంది..

అక్కా, నువ్వు బావగారితో పాటూ బదిలీల మీద ఊరులు మారినప్పుడల్లా...బావగారితో వెళ్ళిపోయేదానివి...వాడి చదువు పాడు అవకూడదని నా దగ్గరే ఉంచి వెళ్ళేదానివి...

పిల్లలు లేని మాకు, అది వరమే కానీ రాజేష్ కి ఎంత శాపమో, వాడికి జ్వరం వచ్చిన మైకంలో  నిన్ను ఎంత కలవరించేవాడో, విన్న నాకు తెలిసేది..

నేను ఎంతగా వాడిని, నా చేతులతో పొదివిపట్టుకుని గుండెలకు హత్తుకుని ఉన్నా వాడికి అమ్మ చేతుల వెచ్చదనం, అమ్మ చేతుల భద్రత లోటుగా అనిపిస్తూ ఉండేదని నాకు బాగా అర్ధం అయ్యేది..

నువ్వు బాధపడతావని, నేను నీకు ఏ రోజూ ఇంతలా చెప్పలేదు...వాడు నిద్రలోనే తనకు తెలియకుండా కలవరిస్తేనే తప్ప నాకు వాడి బాధ తెలిసేది కాదు..ఎందుకంటే వాడి స్వభావానికి వాడు ఎవ్వరినీ నిందించే రకం కాదు...అప్పుడు కారణానంతరాన నువ్వు తల్లిలా వాడి దగ్గరుండలేకపోయావు...

ఈ రోజు నీ బాధకు కారణం నువ్వనుకునే వాళ్ళ నిర్లక్ష్యమూ కాదు, వీణ స్వార్ధము అంతకంటే కాదు..

నీ ఆశించే గుణం కూడా ఒక కారణం...మాకు పిల్లలు లేరు..మాకు ఆశ కూడా లేదు మమ్మల్ని పిల్లలు చూడాలని...అందుకే మాకు ఏ ఆశాభంగము కూడా లేదు..అందుకే మేము ఏ ఆశల బరువు మొయ్యకుండా స్వేచ్చగా ఉంటాము...

రాజేష్ పేరుకి మీ కన్నబిడ్డ, మా చేతుల్లోనే వాడి బాల్యం అంతా గడిచినా, వాడికి మేము ఎంత చేసినా..వాడు మాకు బదులుగా ఏదో చెయ్యాలి అనిమేము అనుకోలేదు...

వాడు ప్రేమగా ఏ చిన్న పని మాకోసం చేసినా మురుసుకున్నామే కానీ..వాడినుంచీ ఎక్కువగా ఏదీ ఆశించలేదు....ప్రేమ, గౌరవం అనేవి..ఇవ్వబడతాయే కానీ మనం ఆశించినంతమాత్రాన ఊరికే వచ్చేయవు అక్కా..

మా హుషారుకి కారణం ఏమిటీ అని చాలాసార్లు అడిగావు కనుక చెబుతున్నా, కారణం ఇదీ అని అంతే...నిన్ను బాధపెట్టాలని ఇదంతా చెప్పలేదు..నిజమేంటో తెలుసుకుని నీ మనసుని నువ్వు కుదుటపరుచుకోవటానికే ఇదంతా చెబుతున్నా..అంది రాధ ..

మధు కూడా సరిగ్గానే చెప్పావు అన్నట్టు రాధ వైపు చూసి తలూపాడు...శారద వాస్తవాన్ని గ్రహించే ప్రయత్నంలో ఉంది..

తులసీభాను.

సేకరణ 🌹

No comments:

Post a Comment