*సహనం సజ్జన లక్షణం*
సహనం మన సంస్కృతి... అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ. ఇది యుగయుగాల సత్యం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సహనం వహించి శిశుపాలుణ్ని వందతప్పుల వరకు క్షమించాడు. ఆ తరవాతే చర్య తీసుకున్నాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తాను ఎన్నో ఇబ్బందులు పడ్డా జీవితాంతం సహనం వహించాడు. ఆ యుగానికి ముందు కృతయుగంలో తన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు కన్నతండ్రి కారణంగానే ప్రాణాంతకమైన ఇక్కట్లు పడుతున్నా విష్ణుమూర్తి ఓపిక పట్టి చివరికి హిరణ్యకశిపుణ్ని అంతమొందించాడు. సహనం దేవుడు జీవుడికి నేర్పిన ముఖ్యమైన పాఠం.
సహనం బలహీనత కాదు, గొప్ప బలం. వీరుడి లక్షణమే తప్ప భీరుడి అవలక్షణం కాదు. అనాదిగా భారతీయత ప్రపంచానికి ఆదర్శప్రాయం కావడానికి ప్రధాన కారణం మన సహనశీలతే. అది మానవత్వం మూర్తీభవించిన శక్తి. ఏదో కొద్దికాలం పాటు సహనం చూపిస్తే సరిపోదు. కాల పరీక్షకు తట్టుకోగలగాలి. ఏవో తక్షణ ప్రయోజనాలు ఆశించిగానీ, వ్యూహాత్మకంగా కానీ సహనం వహించకూడదు. ఓపిక పట్టడం వెనక ధర్మదృష్టి ఉండాలి కానీ మర్మదృష్టి ఉండకూడదు. సహనం వినయం నేర్పుతుంది. విషయం నేర్పుతుంది. ‘అణగి మణగి ఉండే వాడే అందరిలోకి ఘనుడు’... అన్నారు. సహనం అంటే ఓర్పు... జీవికి మంచి మార్పు. సహనం అంటే అసమర్థత కాదు. ధార్మికమైన బలాన్ని కూడగట్టుకుని సమర్థంగా పుంజుకోవడం. ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేసుకోవడం. సహనం భక్తుడు చేసే ఉపవాసం లాంటిది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలను మెరుగుపరుస్తుంది. సహనం ఉన్నవాడు అజాత శత్రువు. అంతే కాదు, అంతశ్శత్రువులనూ జయించగలడు. ధర్మపరమైన సాధన చేస్తే గానీ దక్కని ఫలం సహనం. అపకారికి సైతం ఉపకారం చేసే బుద్ధినిస్తుంది. ప్రతీకార బుద్ధిని మటుమాయం చేస్తుంది. అసహనం చేయరాని పనులను చేయించవచ్చు. కానీ సహనం ఆచితూచి అడుగులు వేయిస్తుంది.
సహనం సజ్జన లక్షణం. ఇది సాత్వికులకు మాత్రమే ఉంటుంది. రజో, తమో గుణం ఉన్న వాళ్లకు స్వచ్ఛందమైన సహనం ఉండదు. ఉన్నట్టు బయటికి కనిపిస్తే అది నిర్బంధమైనది కావచ్చు. సహజమైన ఓర్పునకు, నిర్బంధమైన సహనానికి మధ్య ఉన్న తేడా స్వచ్ఛమైన స్వర్ణానికి, కాకి బంగారానికి మధ్య ఉన్నంత! సహనం వల్ల దైవానుగ్రహం కలుగుతుంది. బుద్ధి వికసిస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ధర్మాచరణకు బాటలు పడతాయి.
నిదానం ప్రధానమంటారు పెద్దలు. నిదానం అంటే సహనంగా ఉండటమే. సహనంలో భూమాతను మించిన వారు లేరు. జీవులు తనకు ఎన్ని అపచారాలు, అపకారాలు చేసినా భరిస్తుంటుంది. ఆ సహనం ఈ భూమి మీద నడయాడే జీవులకు ఎప్పుడు అబ్బుతుందో అప్పుడే లోకకల్యాణం సాధ్యపడుతుంది. భువికి, దివికి తేడా చెరిగిపోతుంది. సహనం వల్ల కాపురాలు సజావుగా సాగుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. సహనాన్ని దేశాలు అలవరచుకుంటే అదే ప్రపంచ శాంతికి రాజమార్గం వేస్తుంది.
~శంకర నారాయణ
No comments:
Post a Comment