Friday, October 24, 2025

*****సంతోషంలో, నిర్లిప్తత, నిరాసక్తత, వయస్సుతో పాటు వచ్చే డిటాచ్మెంట్‌‌తో గుడికి వెళ్లడం నమ్మకండి.. అది ఎప్పటికీ యోగ స్థితి కాదు.. - సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ

 *సంతోషంలో, నిర్లిప్తత, నిరాసక్తత, వయస్సుతో పాటు వచ్చే డిటాచ్మెంట్‌‌తో గుడికి వెళ్లడం నమ్మకండి.. అది ఎప్పటికీ యోగ స్థితి కాదు.. - సైంటిఫిక్ స్పిరిట్యువాలిటీ* - నల్లమోతు శ్రీధర్

ఈరోజు నేను రాస్తున్నవి చాలా ముఖ్యమైన విషయాలు. నా మీద నేను ఎన్నో ఏళ్లుగా ప్రయోగించుకుని, సెల్ఫ్ రిఫ్లెక్షన్‌లో తెలుసుకున్న విషయాలు.

మీరు గుడికెప్పుడు వెళతారు? 

1. బాగా డబ్బులు వస్తూ, కెరీర్ బాగుండీ, అన్నీ అనుకూలంగా ఉంటే.. "జీవితం ఇలాగే కొనసాగేలా చూడమని" కోరుకోవడానికి కొంతమంది గుడికెళతారు! అంటే సుఖాల కోసం ప్రార్థించడానికి గుడికెళుతున్నారు. సుఖం తర్వాత దాని రెండో వెర్షన్ దుఃఖం కూడా ఉంటుందని, దాన్ని ఫేస్ చెయ్యడానికి సిద్ధపడితే బానే ఉంటుంది. లేదంటే సుఖాలను దేవుడు ఇచ్చాడని భావించిన మీరే.. మీ దుఃఖాలను కూడా దేవుడే ఇచ్చాడని నిందించడం మొదలుపెడతారు. ఇది ఇగో ద్వారా ఏర్పడే మనస్తత్వం.

2. అనుకున్నవేమీ జరగక, ప్రతీదీ ఇబ్బంది అవుతూ ఉంటే కొన్నాళ్లు మానసికంగా పోరాడి ఇక మీ చేతుల్లో ఏమీ లేదనుకున్నాక కాస్త ప్రశాంతత కోసం ఆ నిర్లిప్త స్థితిలోనే, జీవితం పట్ల నిరాసక్తతతో గుడికెళతారు. అన్నీ సెట్ అయిపోయి పూర్తి సంతోషంలో మునిగిపోయినప్పుడు దేవుడు గుర్తురాడు.

3. మగ లేదా ఆడ ప్రతీ ఒక్కరికీ 45 ఏళ్లు దాటుతూ ఉండే కొద్దీ కొద్దిగా పెద్దరికం వస్తుంది, అన్నింటి పట్లా అటాచ్మెంట్ తగ్గుతుంది, తాత్విక దృష్టి వస్తుంది, గుళ్లకి, భజనలకు, దైవ దర్శనానికి టూర్లకి వెళ్లడం మొదలుపెడతారు. దాన్ని భక్తిగా భావిస్తారు. వాస్తవానికి అప్పుడు జరిగేదేంటో తెలుసా, నాలుగు ఆశ్రమ ధర్మాల్లో (బ్రహ్మచర్యం, గృహస్తు, వానప్రస్థం, సన్యాసం) వానప్రస్థం, సన్యాసం మొదలవుతాయి. అప్పుడే ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెట్టడం మొదలెడతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది అది నిజమైన ఆధ్యాత్మికత క్రిందకు వస్తుందా అని చాలా ఏళ్లుగా పరిశోధన చేస్తూ వచ్చాను. దాని గురించి శరీరంలో వచ్చే బయోలాజికల్ మార్పులు మొదలుకుని అనేక విషయాలు స్టడీ చేశాను. వాస్తవానికి 45 ఏళ్ల తర్వాత మగ, ఆడ ఇద్దరి శరీరాల్లో ఎండోక్రైన్ సిస్టమ్ బలహీనపడి (హార్మోనల్ సిస్టమ్) హార్మోన్స్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. శరీరంలో హార్మోన్స్ సరిగా ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే జీవితం పట్ల ఆసక్తి, ఆశ, సంతోషంలో మునిగితేలడం ఉంటాయి.

అందుకే చిన్న పిల్లలు ఎంజాయ్ చేసే సంతోషాలను పెద్దవాళ్లు ఎంజాయ్ చెయ్యలేకపోవడానికి కారణాల్లో ఇది ఒకటి. పెద్దవాళ్లు ఇవన్నీ నేను చూసి వచ్చినవే కదా అనే భావనతో మానసికమైన ఆసక్తిని కూడా కోల్పోతారు. అంటే జీవితాన్ని అప్పుడే పుట్టిన పసిపాపలా మళ్లీ కొత్తగా చూసే ఉత్సాహం కోల్పోతారు. ఎండోక్రైన్ సిస్టమ్‌తో పాటు శరీరంలో సర్క్యులేటరీ సిస్టమ్ (రక్తప్రసరణ) నెమ్మదిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేనటప్పుడు శరీరం బరువుగా అనిపిస్తుంది, ఆలోచనల్లో స్పష్టత లోపిస్తుంది. బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. తిన్నది అరగడానికి టైమ్ కూడా ఎక్కువ పడుతుంది. జీర్ణ వ్యవస్థ మందగించడం వల్ల పోషకాలు సక్రమంగా శరీరానికి అందక, కండరాలు బలహీనపడి, ఎముకలు క్షీణిస్తూ ఎనర్జీ తగ్గినట్లు అవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టమ్) తగ్గేసరికి తరచూ ఇన్‌ఫెక్షన్స్, లేదా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వంటి వాటి ద్వారా శరీరం తన మీద తానే ఫైట్ చేసుకునే స్థితిలో నిరంతరం చిరాకు కోపం, నొప్పులు వెంటాడతాయి.

ఇలా శారీరక వ్యవస్థలన్నీ దెబ్బతిన్నప్పుడు శక్తి సన్నగిల్లినప్పుడు.. "నా చేతిలో ఏమీ లేదు" అనే భావన కొద్దీ జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయి చాలామంది గుళ్లకి వెళడం, తమ బాధల్ని తాము మర్చిపోవడానికి భజనల్లో పార్టిసిపేట్ చేయడం చేస్తుంటారు. "నాకు గుడికెళితే ఏ నొప్పీ గుర్తు రాదు" అని చెప్పేవాళ్లు ఎంతోమంది!

నిజానికి దేవాలయానికి నేను మొదటి పాయింట్‌లో చెప్పినట్లు మీ సంతోషాలను సెలబ్రేట్ చేసుకోవడానికీ వెళ్లొచ్చు, మీ నిర్లిప్తతను, నైరాశ్యతను న్యూట్రలైజ్ చేసుకోవడానికీ రెండో పాయింట్‌లో చెప్పినట్లు వెళ్లొచ్చు. వృధాప్యంలో మానసికమైన ఆసరా కోసమూ వెళ్లొచ్చు. ఒక కారుకి షాక్ ఎబ్జార్బర్స్ ఎలాంటివో గుడి మీ భావోద్వేగాలను న్యూట్రలైజ్ చేసి మీ ఎనర్జీ ఫీల్డ్‌ని మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

పైన చెప్పిన మూడూ కూడా జీవితంలో మాయ ద్వారా ఏర్పడేవి. మనిషిగా ఏర్పడే సంతోషానికి పొంగిపోతూ అవే సంతోషాలు మళ్లీ మళ్లీ కావాలని కోరుకోవడమూ మాయే.. ఒక్కసారిగా వచ్చిన గడ్డు పరిస్థితుల్ని తట్టుకోలేక జీవితం పట్ల ఆసక్తిని కోల్పోయి దాన్నే వైరాగ్యంగా భావించడమూ మాయే.. వయస్సు వల్ల శక్తి తగ్గి ఏ మార్గమూ లేనప్పుడు దేవుడిని ఆశ్రయించడమూ మాయే! మూడవ మాయ అయిన వానప్రస్థం, సన్యాసం ఈ భూమి మీద నుండి జీవుడి ప్రాణం పోయేటప్పుడు ఏ రెసిస్టెన్సూ లేకుండా ప్రాణం విడవడానికి మనస్సుని సిద్ధం చేస్తుందంతే!

ఈ మూడు విషయాల్లో మాయ ఉన్నప్పుడు మరి అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో నా ఎనర్జీ ఫీల్డ్‌ని గత కొన్నేళ్లుగా ప్రతీ క్షణం గమనించుకోవడంలో ఏర్పడిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను.

పై మూడు మాయలూ లౌకిక జీవితానికి సంబంధించినవి. అంతా బాగా జరిగినప్పుడు ఏ డిటాచ్మెంట్ సాధన చెయ్యకుండా, కర్మయోగంలో ఉండకుండా అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంలో కొట్టుమిట్టాడి, ఏమీ చేసే శక్తి లేనప్పుడు దేవుడిని ఆశ్రయించడం నిజమైన డిటాచ్మెంట్ కాదు. మీరు ఈ జీవిత కాలంలో అహంతో చేసినవన్నీ శరీరం మరణం పొందిన తర్వాత కూడా రాబోయే జన్మల్లో ఎనర్జీ బ్లాకేజెస్‌గా కొనసాగిస్తూనే ఉంటారు. అంటే మాయ కంటిన్యూ అవుతుందన్నమాట. నిజమైన ఆధ్యాత్మికత అంటే.. సంతోషంలో ఉన్నప్పుడూ ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూనే ఈ క్షణం నుండి చనిపోయి మళ్లీ కొత్తగా పుట్టడంలా ఉండాలి, నాకు ఇది మళ్లీ మళ్లీ కావాలి, నా ఫ్రెండ్స్ నన్ను తెగ మెచ్చుకుంటున్నారు, నాకు చాలా ప్రేమని చూపిస్తున్నారు వాళ్లు లేనిదే నేను బ్రతకలేను అని వాళ్లతో పెనవేసుకుని పోయి అటాచ్మెంట్ కలిగి ఉండడం చిన్నప్పటి నుండే సాధన చేసి డిటాచ్ స్థితికి వెళ్లాలి. అది ఏ ఎండోక్రైన్ సిస్టమ్ సహకరించని 45, 50ల తర్వాత రావాల్సింది కాదు. 

అలాగే దుఃఖం అనేది, గడ్డు పరిస్థితులు అనేవి ఏర్పడేవి మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో ఉన్న బ్లాకేజెస్‌ని సెల్ఫ్ రిఫ్లెక్షన్ ద్వారా గుర్తించుకోడానికి వచ్చే మంచి అవకాశాలు. "దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు" అని దేవుడిని నిందించే విక్టిమ్ మైండ్‌సెట్‌లో కాకుండా "విశ్వం నాలోని లోపాలను చూసుకునే మంచి అవకాశం ఇచ్చింది" అనే మైండ్‌సెట్‌లో కర్మలను క్లియర్ చేసుకోవడమే నిజమైన ఆధ్యాత్మికత. అప్పుడు దేవుడి గుడికెళ్లినా ఓ సహజసిద్ధమైన ప్రేమా, కరుణా భావం వస్తాయి. అలాగే చివరిగా శరీరంలో శక్తి లేని స్థితిలో కృష్ణా, రామా అనుకుంటే మహా అయితే మరణం మానసికంగా సులభమయ్యేలా మైండ్ సిద్ధపరుచుకుంటారేమో గానీ.. యవ్వనంలో ఉన్నప్పుడు కృష్ణా, రామా గుర్తు రాక చేసిన దుశ్చర్యలు, చూపించిన అహం, పెనవేసుకున్న అటాచ్మెంట్లు ఎక్కడికి పోతాయి? అందుకే ఆధ్యాత్మికత అంటే పుట్టినప్పటి నండి చనిపోయే వరకూ మనతో కలిసి సాగాల్సింది. మనల్ని మనం ఏ వయస్సులో ఉన్నా ప్రక్షాళించుకుంటూ జన్మ రాహిత్యానికి చేరాల్సింది!

చివరిగా ఒక్కమాట.. నా గత జన్మల గురించి తెలీదు గానీ, నా చిన్నప్పటి నుండి ప్రతీ క్షణం ప్రతీదీ డిటాచ్ అవుతూనే ఉండేవాడిని. నా ఆలోచనలు డిటాచ్మెంట్ అంటారని నాకు పెద్దయ్యాక తెలిసింది. అలాగే జీవితంలో ఈ క్షణం వరకూ నాకు నేనుగా ఎవరికీ హాని చేసింది లేదు. 30 ఏళ్లపాటు కర్మయోగంలో, జ్ఞానయోగంలో ఉన్నాను. ఎంతో ఆధ్యాత్మిక ప్రయాణానికి నా ఈ జన్మ మొత్తం దోహదపడింది. అందుకే ఇది రాయగలిగాను కూడా!

మన ప్రతీ జన్మ ఒకపక్క విశ్వం తరుపున co creator గా సృష్టి చేస్తూనే detachment సాధన చేయడానికి, మాయలో కూరుకు పోవడానికి కాదు!     

No comments:

Post a Comment