లోక రక్షామణి
సూర్యుడు జన్మించిన శుభదినం మాఘశుద్ధ సప్తమి. ఆయన విశాఖ నక్షత్రంలో అదితి, కశ్యపులకు జన్మించాడన్నది బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యజయంతినే రథసప్తమి అంటారు. సూర్యరథానికి ఏడు అశ్వాలు. కాబట్టి 'సప్తాశ్వరథారూ ఢుడు' అయ్యాడు. పగలు, ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నం, సాయంకాలం-ఇవి పంచాయుధాలు. ఆరు రుతువులు చక్రంలోని ఆకులు. అర్థకామాలు ఇరుసులు. ధర్మమే రథ ధ్వజం. రథసారథి అనూరుడు.
ప్రాణికోటి అస్తిత్వమంతా సూర్యుడి మీదే ఆధారపడి ఉంది. అనాదిగా ఆయన మానవకోటికి ప్రత్యక్షదైవం, కర్మసాక్షి, ఓజస్సును, ఆయుష్షును, శక్తిని ప్రసాదించే సూర్య నారాయణమూర్తి. సర్వరోగనివారణ, సర్వబాధావిముక్తి ఆ స్వామి వల్లనే సాధ్యమవు తాయని వేదాలు ఘోషిస్తున్నాయి. రథసప్తమి నాటి పవిత్రస్నానం ముక్తికి ప్రధాన సోపానమంటారు. భానుడు ప్రాక్- పశ్చిమాలకు ప్రయాణిస్తూనే, యాజ్ఞవల్క్యుడికి, ఆంజనేయుడికి వేద శాస్త్ర వ్యాకరణాదులు నేర్పాడని, వనవాసంలో ఉన్న ధర్మరాజుకు అక్షయపాత్ర ప్రసాదించాడని ప్రతీతి. సూర్యుడు పన్నెండు మాసాల్లో ధాత, అర్యమా, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన, పుషా, పర్జన్యుడు, భగ, తృష్ణా, విష్ణు, అంశుమాన్ అనే పేర్లతో ఆయా రుతువులను అనుసరించి లోకానికి వెలుగులు పంచుతున్నాడు.
రామరావణ యుద్ధ సందర్భంలో చింతా గ్రస్తుడై ఉన్న శ్రీరాముడికి అగస్త్య మహర్షి 'ఆదిత్య హృదయం' ఉపదేశించి గొప్ప ప్రేరణ కలిగించాడు. సత్రాజిత్తు సూర్యారా ధన చేసి 'శమంతకమణి'ని పొందగలి గాడు. ప్రస్కణ్వ మహర్షి సూర్యజపం చేసి, మయూరుడనే కవి సూర్యశతకం రాసి చర్మవ్యాధుల నుంచి విముక్తులయ్యారన్న కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కాంభోజి దేశాధిపతి యశోధర్ముడు తన పుత్రుడితో రథసప్తమి వ్రతం చేయించి, పట్టాభిషిక్తుణ్ని చేసినట్లు భవిష్య పురాణ కథనం.
బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆవిష్కరించిన సూర్య సంబంధిత గాయత్రీ మంత్రం మానవజాతికి మహిమాన్విత మోక్షమార్గ దిగ్దర్శనం. సూర్య కృప కోసం అరుణ పారాయణం, సూర్యనమస్కారాలు చేస్తారు. శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడి సూర్యోపాసన అనన్య సామాన్యమైంది. అనేక పురాణాల్లో సూర్యప్రభ అభి వర్ణితమైంది. వైవస్వత మన్వంతరానికి మొదటి తిథి రథసప్తమే. ఈ రోజు బ్రాహ్మీ ముహూర్తంలో గ్రహనక్షత్రాల సన్నివేశం సూర్యరథాకారంలో గోచరిస్తుంది. సూర్యుడికి పాయసం ప్రీతికరమైంది. అందుకే ఈ పర్వదినాన పాలు, కొత్తబియ్యం, బెల్లంతో పాయసం చేసి భానుడికి నివేదిస్తారు. ఆదిత్యుడికి అష్టోత్తరనామ జపం కూడా చేస్తారు. వ్రతచూడామణి, ధర్మసింధువు, నిర్ణయామృతం, మదనరత్నం మొదలైన గ్రంథాల్లో సూర్యవర్ణన విస్తారంగా ఉంది.
'నమస్కారప్రియః సూర్యః'- ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆదిత్యకృప సంప్రాప్తి స్తుంది. మనిషి తను చేస్తున్న పాపాలన్నీ ఎవ్వరూ చూడటం లేదని భ్రమపడతాడు. వేదపారాయణుడైన సూర్యనారాయణుడి చూపు సదా మనపై ఉంటుందన్న వాస్తవం గ్రహించి ధర్మబద్ధులమై నడుచుకోవాలి.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
No comments:
Post a Comment