దైవకార్య పరమార్థం
దైవస్మరణ సహజంగానే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. మనసుకు నిరంతర ప్రశాంత తనిస్తుంది. దైవారాధన వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా 'పరీక్షలు'గా భావించి ఓపిగ్గా భరించే తత్వం అలవడుతుంది. ఆ దైవమే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్న దృఢవిశ్వాసం ఏర్పడుతుంది. దైవం మీద మనసు లగ్నం చేయడం, పూజావిధానం పట్ల శ్రద్ధ.... మనలో ఏకాగ్రతను పెంచుతాయి. దైవానికి అర్పించిన నైవేద్యం తిరిగి ప్రసాదమై మనకే శక్తినిస్తుంది.
దేవుడి ముందు దీపం వెలిగించడం అంటే, మనలోనూ మన చుట్టూ ఉన్న చీకటిని తరిమికొట్టడమే! ఆ వెలిగే దీపానికి, మరిన్ని దీపాలను వెలిగించే శక్తి ఉంటుంది. ఆ స్ఫూర్తితో ఆత్మలోని 'జ్యోతి'ని వెలిగించుకోగ లిగితే అదే చైతన్యం. 'ఉపవాసం' అంటే కడుపు మాడ్చుకోవడం కాదు. దైవానికి సమీపంలో ఉండటం. అయితే ఆహారం తీసుకుంటే భుక్తాయాసం కలగడం సహజం. ఆయాసంతో నిద్ర వస్తుంది. నిద్ర ఆవహిస్తే భగవంతునిపై ధ్యాస ఉండదు. పైగా కడు పును ఖాళీగా ఉంచడం వల్ల ఆకలి విలువ తెలుస్తుంది. సాటి మనిషి 'ఆకలి' అన్న ప్పుడు ఆ 'క్షుద్బాధ'ను అర్థం చేసుకోగల శక్తిని ఈ ఉపవాసమే ఇస్తుంది. తద్వారా ఆకలితో మాడే కడుపునకు తిండి ఉపశ మనం కలిగిస్తుంది. చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా మన మంచికే. దాని వల్ల ముఖ్యంగా రావి, వేప వంటి చెట్ల గాలులు చల్లగా మనని సేదదీరుస్తాయి. ఆరోగ్యానికి మేలుచేస్తాయి. మనసును ఉత్తేజపరుస్తాయి. ఆ ఉత్తేజం శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రకరకాల ధాన్యాలను 'దానం' ఇవ్వడం భగవంతునికి ప్రీతికరం. వాటిని వినియోగించి చేసే అన్నదానం ఎందరికో ఆకలి తీరుస్తుంది.
పండుగలూ శుభ దినాలకు ముందుగా బూజులు దులిపి ఇంటిని శుభ్రం చేసే అలవాటు వల్ల ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం లభిస్తుంది. దుమ్మూధూళీ పోయి చిన్నా చితకా అనారోగ్యాల బారిన పడటం తగ్గుతుంది. అలాగే బుర్రకు పట్టిన బూజులు కూడా వదిలించుకోవాలి. నిరంతర దైవ ప్రార్థన, సామూహిక భజనలు, ప్రసాద వితరణ లాంటి కార్యక్రమాల ద్వారా ఆ పని చేయవచ్చు. నిత్యానందం పొంద వచ్చు. ఇతరులకు పంచడం ద్వారా ఆ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. తులసి మొక్కను పూజించటం, సూర్య నమస్కారం చేయడం కూడా ఆరోగ్యకరమైన అంశాలు. పశువులకో, పక్షులకో ఆహారం వేశాకే మనం భుజించడం కూడా 'దైవా రాధన'లో భాగమే. ఇవన్నీ దైవ కార్యాలలో ఇమిడి ఉన్నాయి. అందుకే నిరంతరం దైవ అర్చనతో, స్తోత్రాలతో, మంత్రోచ్చారణతో, జపాలతో దేహాన్ని - మనసును ఓ పద్దతిలో నడిపించుకోవచ్చు. అప్పుడే మన అంతరంగంలోని దైవాన్ని ప్రతి వ్యక్తిలో చూడగలుగుతాం. అది అందరిలో సోదరభావాన్ని పెంపొందిస్తుంది. సమాజంలో ఐకమత్యం వెల్లివిరుస్తుంది. వ్యక్తి విశ్వనరుడి స్థాయికి ఎదుగుతాడు.
కె.వి.వి.సత్యప్రసాద్
No comments:
Post a Comment