Monday, April 6, 2026

 వదిలేయాలి:
(రచన : మంగు కృష్ణ కుమారి)

మర్రిపూడి గ్రామవాసి భూషణం. అతని భార్య అన్నపూర్ణ. భూషణం కాస్త భోజన ప్రియుడు. అతనికి అన్ని రుచులూ ఇష్టమే. కొత్త కొత్త వంటకాలు అడిగి చేయించుకొని తిని ఆస్వాదిస్తూ ఉంటాడు.

భూషణం తల్లి సుబ్బాయమ్మ పరమ శివ భక్తురాలు. అందునా కాశీ అంటే ఆమెకి చాలా ఇష్టం. కాశీ రెండు సార్లు వెళ్ళింది. అయినా అలసటే లేకుండా తిరిగీది‌. 

ఆమె తరచూ కొడుకూ కోడలితో, తను చనిపోతే ఏడాది లోపల తన అస్తికలు గంగలొ కలిపి, గయలో తనకి పిండ ప్రదానం చేయమని కోరేది.‌ భూషణం ఆమె మాటలని అంతగా పట్టించుకోలేదు‌.

అనుకోకుండా సుబ్బాయమ్మ గుండెపోటుతో మరణించింది.

భూషణం తల్లి కర్మకాండలు చాలా ఘనంగా జరిపించేడు‌. చూస్తూ ఉండగానే తల్లి మాసికం,  త్రై‌పక్షం కూడా జరిగేయి.

అన్నపూర్ణ అత్తగారి కోరిక కాశీలో, గయలో జరిపించాలన్న విషయం గురుతు చేసింది. తల్లి ఆఖరి కోరిక తీర్చాలని భూషణానికి‌ కూడా ఉంది.

“అలాగే వెళదాం” అన్నాడు.

“ఆరు నెలల‌లోపే వెళ్ళాలి. ప్రయాణానికి అన్నీ చూసుకోవాలి” అంది.

“అలాగే రాఘవులుకి చెప్తే కాశీ, గయలకి వెళ్ళే సమూహానికి బళ్ళు, రథాలూ ఏర్పాటు చేస్తాడు‌. మధ్యలో ఆపి భోజనం ఏర్పాట్లు కూడా చేస్తాడట. చెప్తాను‌. అయినా వాడు పెట్టేది మనకి ఏం సరిపోతుంది. నువ్వు పుష్కలంగా జంతికలూ, చేగోడీలూ, సున్నుండలూ, లడ్డూలు పట్టుకోవాలి.” అన్నాడు.

అన్నపూర్ణ నవ్వుతూ “మనం పెళ్ళి వారం కాదు. మరణించిన తల్లికి తర్పణాలు వదిలిందికి వెళుతున్నాం “ అంది.

“అయితే మాత్రం, తిండిలేక ఉండగలమా?” అన్నాడు.

“ఆఁ అన్నట్టు, ముందే అనుకోవాలి, గయలో మీరు ఏది వదిలేస్తారు?”

“ఏదో వదిలీడం అంటే?”

“తెలీనట్టు మాటాడవద్దు. గయలో పిండ ప్రదానం చేసినప్పుడు ఒక కాయ, పండూ వదిలీయాలి. మీ అమ్మగారు వంకాయ, సపోటాపండు వదిలేసేరు. మరచిపోయేరా?” గురుతు చేస్తూ అంది అన్నపూర్ణ.

భూషణం నెత్తిన పిడుగు పడ్డట్టే అయింది. అక్కడ వదిలిస్తే ఇహ జీవితంలో తినకూడదట. 

“వెళ్ళిన అందరూ వదిలీ అక్కర లేదేమో?” అన్నాడు నీరసంగా.

“వదిలిసి తీరాలి. మీ సంగతి చెప్తారా?” 

“కాదే, మా అమ్మ వంకాయ వదిలిసిందని నువ్వు రోజూ విసుక్కొనే-దానివి. అలా వదిలీకూడదే”

“పోనీ ఆనపకాయో, దొండకాయో వదిలిస్తారా?”

భూషణానికి నోట్లో నీళ్ళు వచ్చేయి. ఆనపకాయ కూరా పులుసు, దొండకాయ వేపుడు తలచుకుంటూ ఉంటే వదిలీయాలని అనిపించలేదు.

అన్నపూర్ణ చాలా కూరల పేర్లు చెప్పింది‌. భుషణంకి ఏదీ వదలడం అంత లాయకీ ఉన్న పనిలా అనిపించలేదు.  ఏ పేరు చెప్పినా ఏదో వంక చెప్పి వద్దనేసేడు.

“అక్కడ ఏదో ఒకటి చెప్తానులేవే” అనేసి తప్పించుకున్నాడు.

కాశీ, గయా ప్రయాణం సజావుగా జరిగింది. గయలో చాలా భక్తిగా తల్లికి అన్నీ జరిపించేడు. పురోహితుడు ఏది వదిలిస్తారో చెప్పమంటే  ‘కందికాయలూ, అల్లీ‌పళ్ళూ’ అన్నాడు.

అన్నపూర్ణ నిర్ఘాంతపోయింది. ఈ అల్లీపళ్ళు ఎప్పుడో తప్ప కనపడవు.
కందికాయ వదిలిస్తే కందిపప్పు కూడా ఇహ తినకూడదే?

ఉండబట్టక బయటకి రాగానే అడిగేసింది. భూషణం నవ్వు ఒలకపోస్తూ “పిచ్చిదానా! నేను వదిలింది కాయలే, పప్పు కాదు” అన్నాడు.

ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ ఊరి మునసబు బుట్టడు కందికాయలూ, అల్లీపళ్ళు పంపించేడు. 

అన్నపూర్ణ అవి చూసి పగలబడి నవ్వింది.
యెనుముల 
🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment