Monday, April 6, 2026

 *ప్రధాన శత్రువులు*

పుణ్య పాపాలగురించి చాలా మందికి అవగాహన ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మలు మరియు దుష్కర్మల ఫలితమని మనందరికీ తెలుసు. మంచిచెడుల మధ్య తేడాను గ్రహించగలిగినప్పటికీ ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు.

ఒకసారి దుర్యోధనుని ఇలా ప్రశ్నించారు. "మిరు రాజు, శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?” అప్పుడు దుర్యోధనుడు -
जानामि धर्मं न च मे प्रवृत्तिः |
जानाम्यधर्मं न च मे निवृत्ति: ||
"ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటంలేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నా మనస్సు పాపకర్మలు ఆచరించటానికే ఇష్టపడుతోంది." అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయం.

శ్రీకృష్ణభగవానుని మాటలను వింటున్న అర్జునుడు "దేవా ! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది." అని ప్రశ్నించాడు.
अथ केन प्रयुक्तोयं पापं चरति पूरुषः |
अनिच्छन्नपि वार्ण्षेय बलादिव नियोजितः ||
"మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేమిటి?" దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం ఇచ్చారు.
कामएष क्रोधएष रजोगुणसमुद्भवः |
महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ||
కామము మరియు క్రోధము అనబడు శత్రువులు రజో గుణం వలన జనిస్తవి. మహా పాపిష్టమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి.

పైన చెప్పిన విషయం మనకు క్రొత్త కాదు. మనందరికీ సామాన్యంగా తెలిసినదే. అయితే మళ్ళీమళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా. కామం, క్రోధం అనేవి ప్రతి మనిషికి బద్ద శత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలపరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనే ఆలోచన కలగదు. ఏ వస్తువునైనా తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది.

--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

No comments:

Post a Comment