Sunday, May 25, 2025

 కథ పేరు..."సావాసదోషం "
********************


"నువ్వు అద్దం ముందు నిలబడితే నువ్వే కనబడతావు, నేను కనబడను.

నేను అద్దం ముందు నిలబడితే నేనే కనబడతాను.నువ్వు కనబడవు.
కుక్క అద్దం ముందు నిలబడితే కుక్కే కనబడుతుంది.
నక్క కనబడదు.
అంటే"అద్దం"మారదు.
మనమే మారాలి.
మార్పు రావాలి"
కవిత పేరు మార్పు రావాలి.ఎలా ఉంది రా?కుచేలా?కవిత 'పొట్టి 'దైనా' గట్టి'గా ఉంది కదూ!" అన్నాడు కనకరావు.

'ఒరేయ్!కనకా !ప్రశ్న, జవాబు కూడా నువ్వే చెప్పేస్తుంటే నేనేం మాట్లాడనురా?' మనసులో అనుకున్నాను వాడికేసే చూస్తూ కదలకుండా.

"కుచేలా?ఏ చలనం లేకుండా అలా ఉండిపోయావే మిట్రా?" అన్నాడు , కనకం కంగారుపడుతూ.

నేను కనురెప్ప కూడా వేయక పోయే సరికి, పోయాననుకున్నాడో ఏమో? 

గబగబా ఫ్రిజ్ లోనుండి వాటర్ బాటిల్ తీసి, నా మొహం మీద కొన్ని నీళ్లు చిలక రించాడు.

నేను తేరుకుని తిరిగి వాడి కేసి చూసాను.
వాడు 'హమ్మయ్య'  అనుకుంటూ, 
 
"నేను  నవ్వాను.
ఏడవ లేక నవ్వాను.
ఏడుపు రాక నవ్వాను.
ఏడుపు మరిచి  నవ్వాను.
నవ్వులో నే  ఏడుపును కల గలిపాను.
ఏడుపు ను పైకి రానివ్వ కుండా నవ్వాను.
"నవ్వడం లోనే ఏడవడం"... ఇదెలా ఉందిరా? కుచేలా?"
 'నవ్వు'తూ అడిగాడు.

"చాలా అర్థవంతంగా, బాగా "ఏడ్చి" నట్లుందిరా.ఆ బాటిల్ ఫ్రిజ్ లో పెట్టకు.నా మొహం మీద నీళ్లు మళ్లీ కొట్టు" అన్నాను.

"రిటైర్ అయ్యాకా నువ్వు కవితలు రాయడం, నన్ను వినమని తినడం, ఏమీ బాలేదు కనకం" మొహమాటం లేకుండా చెప్పేసాను.

" పోనీ నేను రాయను. నువ్వు రాయి. నేను వింటాను." అన్నాడు.

" నేను రాయను కాక రాయను" అన్నాను కరాఖండీగా.
" ఏం?'
" జీవహింస మహా పాపం" అన్నాను.
" అంటే ...నేను కవితలు రాయడం జీవహింసతో సమానమని  తేల్చేసావన్న మాట"
" అన్నమాట ఏముంది? ఉన్నమాటే" అన్నాను కుర్చీ లోంచి లేస్తూ.

"ఉదయమే, అర్జెంట్ గా 'రారా' అని ఫోన్ చేస్తే, 
'ఏ బాత్ రూమ్ లోనో కళ్ళు తిరిగి పడిపోయి, కాలు విరగ్గొట్టు కున్నావేమో ? నన్న అనుమానంతో, నా పని మానేసి మరీ పరుగెత్తుకు వచ్చాను. ఇక్కడ, నీ కవితలతో, నా కళ్ళు తిరిగేలా ఉన్నాయి. పొద్దున్నే ఎవరి మొహం చూసానో?ఏమిటో?నే వస్తా!"అంటూ  గుమ్మం బయటకు వచ్చి చెప్పులేసుకున్నాను. 

"అప్పుడే, వెళ్లకురా!
నా "ఆరునొక్క రాగం" కవిత వినరా" అంటూ నా వెంట పడ్డాడు.
వాడి చేతిలోనున్న పుస్తకాల పుట తిరగేస్తూ, కళ్ళజోడు సవరిస్తూ.

"ఆ రాగం ఆల్రెడీ  పాడేసాను.మళ్లీ వినాలా?
నీ కవితలు వినే గుండె ధైర్యం నాకు లేదు నాయనా. నీకేం ద్రోహం చేశాను?నన్ను వదిలేయ్. నీవి మామూలు కవితలు కాదురా బాబూ. పాస్ పోర్ట్ , వీసా లేకుండా డైరెక్టుగా  కైలాసానికి పోవచ్చు.రేపు వారంలో నా పుట్టినరోజు కూడాను.అప్పటిదాకా బతకనీ" అంటూ కాళ్లకు బుద్ధి చెప్పాను.

వెనుక వాడు"ఆగరా! కుచేలా!" అన్న అరుపులను కూడా వినిపించుకోకుండా ముందుకు సాగాను.

అప్పులిమ్మని అడిగేవాళ్ళకే కాదు, కవితలు వినమని వెనుకపడే వాళ్లకు కూడా దూరంగా ఉండాలని తీర్మానించు కుని కారిడార్ లో ఉన్న బైక్ తీశాను.

అప్పుడే సుందరినుండి కాల్ వస్తే లోలోపల
విసుక్కుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాను.
"గుర్తుందే, సుందూ!పావుకేజీ మామిడాకులు, కొన్ని చింతపండు తేవాలి. అంతేగా" అన్నాను.

"లక్ష సార్లు చెప్పాను.నన్ను 'సుందూ' అని పిలవొద్దని.
సందు లా వినిపిస్తోందనీ.లక్షణంగా 'సుందరీ' అని పిలవండి.నచ్చకపోతే మానేయండి.నన్నలా పిలిచి, మా నాన్న మీద అక్కసును కక్కకండి.అయినా సరుకులు రివర్స్ లో చెబుతున్నారే?మతి భ్రమించిందా?" విసుక్కుంటూ అడిగింది.
"నిజమేనే!నువ్వంటే తెలుస్తోంది.సారీ!
సరుకులు సరిగ్గానేతెస్తాలే" అంటూ ఫోన్ పెట్టేశాను.

'వాడి కవితలతో, నా తల తిరిగి పోతోంది' అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు కదిలాను.
అప్పుడే ఫోన్ మళ్లీ ఫోన్ రింగైతే ఆన్ చేసి
"నేను చెప్పానుగా సారీ! ఫోన్ చేసావే సుందరీ!" అన్నాను.
 "పదాల్లో ప్రాస భలేగా కుదిరింది. కవితలా ఉంది.నా కవిత లో వాడేసు కుంటాను." అన్నాడు అట్నుంచి కనకారావు.
"కనకా!డిస్ప్లే చూడకుండా ఫోన్  లిఫ్ట్ చేసి తప్పు చేసాను.నీ కవితలతో నన్ను తినకురా.ఫోన్ పెట్టేయరా!" అన్నాను.
కానీ వాడు, రేడియో లా నా బాధ వినకుండా,
"కుచేలా! మరో మిని కవిత వినరా!
"కవితల కు మూలం...
కవి 'తల'
అందుకే ప్రతీ కవీ ఒక 'అల!"
 పొట్టి కవిత ఎలా ఉందిరా?"
నేనిచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడేమో?వాడి ఊపిరి కూడా ఫోన్ లో వినిపిస్తోంది.

"కనకా!ఇక్కడ నీ కవితల గోలలో పడి, నా మతి పోతోంది.ఫోన్ పెట్టేయ్" అంటూ నేనే ఫోన్ ఆఫ్ చేసేశాను.

రిటైరయ్యే వరకూ వాడి పని వాడు చూసుకునే వాడు.కనిపిస్తే పలక రించే వాడు.గుర్తొస్తే ఫోన్ చేసే వాడు.ఒకే బ్లాక్ లో ఉన్నప్పటికీ వాడి గొడవేదో వాడు చూసుకునే వాడు. చీమ కు కూడా హాని చేసేవాడు కాదు. ఇప్పుడు కవితలు ఎడా పెడా రాసేస్తూ, వాటిని వినిపిస్తూ, మనుషుల ప్రాణాలే తీసేస్తున్నాడు.
అమెరికా లో ఉన్న కొడుకు, వారానికోసారి ఫోన్ చేస్తే హాయిగా  మాట్లాడే వాడు.నెలకోసారి, చెల్లెమ్మ పంకజం తో కలిసి దర్జాగా తీర్థ యాత్రలకు వెళ్లే వాడు.అయితే ఈ మధ్యనే
చెల్లెమ్మ పోయి నప్పటి నుండీ ఇలా తయారయ్యాడు.

రెండు నెలలుగా రోజూ, పిలవడం, వాడి తిక్క రాతలు వినమనడం వాడి దినచర్య అయింది.నాకు దిన దిన గండమైంది.
వెళ్లకపోతే ఏడు స్తాడు.జాలిపడి వెడితే  వాడి రాతలతో ఏడిపిస్తాడు.
బాల్య మిత్రుడన్న మోహమాటంతో ఈ రోజు వరకూ వెళ్ళాను.ఇక చచ్చినా వెళ్లను.బతికినా వెళ్ళను.వెడితే చచ్చిపోతానుగా" అనుకున్నాను నిశ్చయంగా.

సుందరి అడిగిన ఉగాది సరుకులు కొని, వాడి అపార్ట్మెంట్ కేసి, కన్నెత్త యినా చూడకుండా, నేరుగా నా అపార్ట్మెంట్ లోకి వెళ్ళాను.

వాడెక్కడ నన్ను చూసేస్తాడన్న భయం కొద్దీ లోపలకు వెళ్లి డోర్ లాక్ చేసేసాను.
లోపల చూద్దును కదా, సుందరి, ఎవరితోనో సీరియస్ గా ఫోన్ లో మాట్లాడేస్తోంది. పుట్టింటి వాళ్ళయుంటారులే అనుకున్నాను.
తెచ్చినవి కిచెన్ రూమ్ లో పెట్టమని సైగ చేసింది.

'అంత సీరియస్ గా ఏం మాట్లాడు తోంద?ను కుంటూ,సుందరి వైపు చూసాను.
స్పీకర్ మోడ్ లో ఉందని చెవి అటు వైపు పడేసాను.
అట్నుంచి, "ఈ కవిత ఎలా ఉందో చెప్పు చెళ్ళమ్మా?" అన్న మాట వినపడింది.

అనుమానం లేదు. ఆ కనకా రావు తన కవితలను సుందరికి కూడా అలవాటు చేసే స్తున్నాడు. 

"చెప్పండన్నయ్యా! విని చెబుతాను" అంది సుందరి ధైర్యంగా.

'ఫోన్ కట్ చేయవే బాబూ !' సైగ చేస్తూ సుందరితో మెల్లగా అన్నాను.

"ఉష్! మీరు ఆగండి. అలా కూర్చోండి" అంది సుందరి ఫోన్ కు చెయ్యి అడ్డం పెట్టి,  సోఫాను  చూపిస్తూ. 

"ఏమిటి చెల్లెమ్మా? ఏదైనా ఆటంకమా?" అట్నుంచి కనకం అడుగుతున్నాడు.

"పిల్లి  అన్నయ్యా! తరిమేశానులే!" 
" పాడు పిల్లులు...దొంగ పిల్లులు ఎక్కువైపోయాయి ఈమధ్య" అట్నుంచి కనకం అంటున్నాడు .

"నన్ను ,పిల్లితో పోల్చుతావా?ఫోన్ పూర్తవనీ, నీ పని చెబుతా!" అనుకుంటూ, సోఫాలో కూర్చుని, సుందరి కేసి జాలిగా చూసాను.

ఫోన్ లో వాడు కవిత చదవడం మొదలు పెట్టాడు.

"వస్తోంది, వస్తోంది ఉగాది.
పచ్చడి తెస్తూ వస్తోంది ఉగాది.'

"ఆహా, ఓహో" వింటూ ఊ కొడుతోంది సుందరి.
"ఏముందే?కవితలో? ఆహా, ఓహో! అనడానికి? " తల బాదుకుంటూ
సుందరికి మాత్రమే వినబడేలా అన్నాను.

"ఉష్!" అంది నోటికి వేలు అడ్డం పెట్టి.
"ఏమిటి? చెల్లెమ్మా?" అట్నుంచి అడిగాడు.

"పిల్లి మళ్లీ వచ్చింది అన్నయ్యా!" చెప్పింది.

"పాడు పిల్లి. మళ్లీ కొట్టావా?కాల్చి వాత పెట్టాలి"
"అవునన్నయ్యా!కవితను చెప్పండి! రేపే ఉగాది" అంది సుందరి.
"నీలా ప్రోత్సహించే పాఠకులుంటే, కవితలు కోకొల్లలుగా రాసేస్తా" అంటూ

 "వేప పువ్వు వేస్తే అది చేదైన ఉగాది.
చింత పండు వేస్తే, అది పులుపు ఉగాది.
కొత్త బెల్లం తో అది కొంగొత్త ఉగాది.
మామిడి ముక్కలతో, అది మరుపురాని ఉగాది." ఆయాసం వచ్చినట్లుంది...ఆగాడు.

"వాహోవా,వాహోవా" ఇట్నుంచి సుందరి ప్రోత్సాహం.
వాడిలో ఉత్సాహం.
నాలో నిరుత్సాహం.

"కవిత పూర్తి చేయండి, అన్నయ్యా! అవతల పిల్లి ఎదురు చూస్తోంది" అంది సుందరి నాకేసి చూస్తూ.

"ఆరు రుచులతో అరుదుగా వచ్చే ఉగాది.
ఈ ఉగాది పేరే "క్రోధి"
ఇదే మార్పునకు పునాది."

"వాహోవా!...ఉగాది మార్పునకు పునాది"..భలేగా రాశారన్నయ్యా!
రేపు కోలనీ లో అందరికి నేను తీపి,  పులుపు, వగరు వగైరా తో  ఉగాది పచ్చడి నేను తినిపిస్తా.మీరు, కవితను వినిపంచండి చాలు.వేరే వేప పువ్వు అవసరం లేదు.
ఇంట్లో పని ఉంది.ఇక ఉంటాను అన్నయ్య" అంటూ ఫోన్ పెట్ట బోతుంటే,

 "చెల్లెమ్మా, వాడొస్తే ఒకసారి నా దగ్గరకు పంపించు, కవిత ను వాడికి కూడా చదివి వినిపిస్తా"అన్నాడు కనకం.

"తప్పకుండా, పంపిస్తాను" అంటూ ఫోన్ పెట్టింది.

"నేను, హమ్మయ్య" అనుకుంటూ లేచాను.

"అరుదుగా ఉగాది రావడం ఏమిటి ఖర్మ?పండగ ప్రతీ సంవత్సరం వస్తుందిగా?
వాడు రాయడం, అవి విని, నువ్వు 'వహవా' అనడం.
అసలు వాడి ని నేను  వదుల్చోకోవాలని చూస్తుంటే, నువ్వెందుకు తగులు కున్నావ్?"
అర్ధం కాక అడిగాను.

కాఫీ కప్పు తాగమని ఇచ్చింది.సోఫాలో కూర్చుంటూ, తాపీగా చెప్పడం మొదలు పెట్టింది.

"ఆపదలో డబ్బులవసరం అయితే, తోటి స్నేహితుడని ఆదుకుంటాం.
ఆకలిగా ఉందని, ఎవరైనా దీనంగా  అడిగితే  సాటి మనిషని కరుణ చూపించి, అన్నం పెట్టి కడుపు నింపుతాం.

కానీ, ఒంటరిగా ఉన్న వారికి, ఓదార్పు నివ్వడం అందరూ, మరచిపోయాం?"

"నువ్వు, సీరియస్ గా అంటూంటే, సరిగ్గా అర్ధం కావడం లేదే? "తల పట్టుకుంటూ సుందరి కేసి చూశాను.

"వదిన చనిపోయాకా, అన్నయ్య ఒంటరిగా మిగిలాడు. ఆయన జీవితం చీకటిమయం అయిపోయింది.చీకట్లో నీడ కూడా తోడుగా రాదు.వాళ్ళకు ఏదోక వ్యాపకం కావాలి. అది సమయాన్ని గడిపేలా చేయాలి.
మంచో, చెడో అన్నయ్య రాయడం మొదలుపెట్టారు.
శోకం నుంచే శ్లోకం వచ్చినట్లు రాయగా , రాయగా అదే వస్తుంది.రాకపోతే, సమయం గడుస్తుంది.అందుకే అన్నయ్యను ప్రోత్సహిస్తున్నాను.అందువల్ల ప్రమాదం ఏమీ లేదుగా.తప్పంటారా?" 
సుందరి నన్నడిగింది.

కాఫీ కప్పు సుందరి చేతిలో పెడుతూ, 
"సుందరీ!నువ్వన్నది 'సత్యం'
నీ ఆలోచన మేలిమి 'ముత్యం'
 ప్రోత్సహించు వాడిని అను 'నిత్యం'
అయినా వాడిది మాత్రం  'పైత్యం'
అన్నాను నవ్వుతూ.

"ఓహ్ ! అంత్యప్రాసలు భలేగా కుదిరాయి" అంది సుందరి.

నాకు మతి పోయింది. నేను కూడా కనకారావు లా కవి నై 'పోయానా'?అనుకున్నాను.
" చూసారా! సావాసదోషం..రేపట్నుంచి నేను మీ కవితలు కూడా భరించాలి!" అంది, చప్పట్లు కొడుతూ. 

కవితలు రాయడంలో కనకాన్ని ప్రోత్సహిస్తా. అప్పుడప్పుడు నేనూ రాస్తా.నేనూ కవినేనోయ్!"అన్నాను 
నవ్వుతూ.

సుందరి కూడా బదులుగా నవ్వుతూ, చప్పట్లు చరిస్తుంటే, 
కనకా రావ్ అపార్ట్మెంట్ వైపు అడుగులు వేసాను.
********
సమాప్తం.
*******
డాక్టర్ అమృతలత, గారి సౌజన్యం తో ,సంచిక అంతర్జాల పత్రిక వారు నిర్వహించిన దీపావళి 2024 కథల పోటీలో సాధారణ ప్రచురణ కు ఎంపికైంది..
కె.వి. లక్ష్మణ రావు
9014659041


"

No comments:

Post a Comment