*ప్రాచీన గాథాలహరి - 12*
🪷
రచన: పిలకా గణపతిశాస్త్రి
*భాగ్యశాలిని - 2*
🤟
ఆనోట ఆనోట వ్యాపించిన బుద్ధదేవుని ఆ ఆగమన వార్త వినగానే సుప్రియ ముఖం లో ఒక్కమారుగా వేయి చిరునవ్వులు విరిశాయి.
అంతవరకూ ఆమె కా మహాపురుషుని పేరు మాత్రమే చెవినపడింది. అంతేగాని సందర్శనభాగ్యం ఎన్నడూ లభించలేదు. శ్రావస్తీ నగరంలో గౌతముని రాక గురించి వింతవింత గాథలెన్నో వ్యాపించాయి. చివరి కొకనాడు గౌతముడు శ్రావస్తి కనతి దూరంలో ఉన్న పంచవటీచ్ఛాయలో విడిదిచేశాడన్న వార్త సుప్రియ చెవిన పడింది.
ఆనాటి సాయంకాలం శ్రావస్తి శ్రావస్తి అంతా పంచవటి వైపు నడిచిపోతున్నట్లే కనిపించింది. రాజులూ, రాజబంధువులూ రథాలమీద, గజాందోళికాది వాహనాల మీదా తథాగతుని సందర్శనభాగ్యం పొందాలనే తహతహతో తొందర తొందర గా వెళ్ళిపోతున్నారు. కొంద రా మహావ్యక్తి కర్పించాలని చిత్రవిచిత్రమైన కానుక లెన్నో తీసుకుపోతున్నారు. వాహన భాగ్యం లేని సామాన్యజనం కేవలం కాలినడకనే సాగిపోతున్నది.
వారందరినీ చూస్తూంటే సుప్రియ తాను కూడా బుద్ధుని సందర్శన భాగ్యం పొందాలని ఎంతో ఉబలాటపడింది. తనతో పాటు ఎలాగైనా తండ్రిని కూడా తీసుకుపోవాలని ప్రయత్నించింది. కాని రుగ్మత వల్ల అది కొనసాగలేదు.
ఇక మిగిలినవారు పసిపిల్లలు. సుప్రియ వారిద్దరికీ ఆ మాట చెప్పింది. పిల్లలిద్దరూ ఏదో ఉత్సవం చూడబోతున్నామనే ఉత్సాహంతో ఎగిరి గంతేశారు.
సుప్రియ ఎంతో కష్టపడి ఎక్కడో ఒక పోకదొన్నె సంపాదించింది. దానినిండా మేకపాలు పిండి దానిమీద లేత లేత మర్రి ఆకొకటి మూతవేసింది. ఆ దొన్నె ఎంతో జాగ్రత్తగా చేత్తోపట్టుకుని నెమ్మది నెమ్మది గా అడుగులు వేసుకుంటూ పంచవటి వైపు బయలుదేరింది. ఆ పసిపిల్లలిద్దరూ ఆమె అడుగులలో అడుగులు వేసుకుంటూ వెంట వెంటనే నడిచివెళ్ళారు.
దారిలో సుప్రియ కొకటే మథన! తా నిచ్చిన ఆ మేకపాలు ఆయన ఆప్యాయంగా స్వీకరిస్తాడా? అసలా జనసమ్మర్దంలో తాను ఆయన పాదసన్నిధికి చేరుకోగలదా?
అసలు నిరుత్సాహపడడమనేది ఆమె కలవాటే లేదు. గుండె ధైర్యం చిక్కబట్టి అలాగే మున్ముందుకు సాగిపోయింది.
సుప్రియ కెదురుగా జనం తండోపతండాలు గా మూగి ఒకరొకరిని తోసుకుంటున్నారు. ఆమె కిక అడుగే పడలేదు! ఆ పిల్లల నిద్దరినీ వెంటబెట్టుకొని ఆయనని ఒక్కమారు సందర్శించడ మెలాగ? ఉత్కంఠతో సుప్రియకు కళ్ళమ్మట నీళ్ళపర్యంతం అయింది.
📖
అప్పటికి సూర్యాస్తమానం అయింది. సందర్శనానికి వచ్చిన వారంతా మళ్ళీ తిరుగుముఖాలు పట్టారు. క్రమక్రమంగా జనం పలచబడ్డారు.
కొంచెం చీకటి పడింది. నల్లనల్లని మర్రి నీడలో పండువెన్నెల పాలవెల్లువలా ప్రవహించింది. అప్పుడు బుద్ధదేవుని చుట్టూ పరివేష్టించి కూర్చున్నవారంతా చాలావరకు పలచబడిపోయారు. అంతా కలిసి రెండు మూడు వందల మందికంటె ఎక్కువ ఉండరు.
అంతవరకూ ఎక్కడో ఒక మారుమూల నిలుచున్న సుప్రియ పసివారి నిద్దరినీ వెంటబెట్టుకొని నెమ్మదిగా బుద్ధదేవుని సమీపానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసింది. పసివారిద్దరి చేతా సాష్టాంగ నమస్కారాలు చేయించింది. తానెంతో భద్రంగా పోకదొన్నెలో సేకరించిన మేక పాలను ఎంతో భక్తిగా ఆయన పాదాలమ్రోల సమర్పించింది.
గౌతబుద్దుడవి స్వీకరించినట్లుగా కొంచెం తల పంకించి చిన్న చిరునవ్వు మెరిపించాడు. సుప్రియ కంతటితో పూర్తిగా సంతృప్తి కలిగింది. బుద్దదేవుని పాదాల కనతిదూరంగా కూర్చుని నిశ్చల దృష్టితో ఆ తేజోమూర్తి వైపే చూచింది. ఆ క్షణంలో ఆమె హృదయంలోని సంతోష సాగరతరంగాలు ఆనందబాష్పాలలో వెల్లువలై ప్రవహించాయి.
సుప్రియ బుద్ధదేవుని కెదురుగా కూర్చున్న పౌరవర్యులనందరిని పరిశీలించి చూసింది. వారిలో చాలామంది ఆమెకు చిరపరిచితులే! మొట్ట మొదటగా రత్నవర్ధన శ్రేష్ఠి ముఖం ప్రత్యక్షమయింది. ఇంకా కొంచెం దూరంలో శ్రావస్తిలో గొప్ప కృషీవలస్వామిగా ప్రసిద్ధికెక్కిన క్షీరస్వామి ప్రత్యక్షమయ్యాడు. అటుపిమ్మట ఆమెకి బుద్ధదేవుని కెదురుగా శ్రావస్తీ నగర దండనాయకుడు చండసేనుని ముఖం కనిపించింది. ఇంకా సుప్రియ గుర్తెరిగిన శ్రావస్తీనగర పౌరులెందరో తలవని తలంపుగా అక్కడ ప్రత్యక్షమయ్యారు.
ఏదైనా ధర్మ ప్రసంగం ఉపక్రమించే ముందొక అరగడియ వరకూ గౌతమ బుద్ధుడు కేవలం మౌనమే అవలంబించడం ఒక పరిపాటి. ఆ విషయం శ్రావస్తీవాసు లందరూ అంతకు పూర్వమే విన్నారు. అందుచేత సదస్యులంతా తథాగతుని ధర్మ ప్రసంగాని కెదురుచూస్తూ నిశ్చల దృష్టులతో బుద్ధదేవుని పెదవుల కదలికకు నిరీక్షిస్తూ కూర్చున్నారు.
అంతవరకూ ఆకల్లాడని మర్రికొమ్మల్లో పక్షుల కలకల రవాలప్పుడప్పుడే మేల్కొన్నాయి. పాలవెన్నెల చల్లని ప్రవాహంలో ఆ పరిసరమంతా అపూర్వానంద డోలికలలో ఓలలాడింది.
ఆ క్షణంలో సదస్యుల హృదయాలలో జీవుల జననమరణాలను గురించి, దైనందిన ధర్మాధర్మాలను గురించి, చిత్ర విచిత్రమయిన స్వర్గాదిలోకాలను గురించీ ఎన్నెన్నో జిజ్ఞాస లావిర్భవించాయి. గౌతమ బుద్ధుడందరి ముఖాలు ఒకక్షణంసేపు అతినిశితంగా పరిశీలించాడు.
ఇంకొక క్షణంలో గౌతమబుద్ధుని పెదవు లలవోకగా విడివడ్డాయి:
“నాయనలారా! నా కీవేళ శ్రావస్తీలో అంతటా అన్నార్తుల హాహాకారాలే వినిపిస్తున్నాయి!"
గౌతమబుద్ధుని పెదవుల నుండి ఒక వేడి నిట్టూర్పు వెలువడింది. సదస్యులందరూ శ్రావస్తి వైపు దృష్టులు సారించి చెవులు రిక్కించి శ్రద్ధగా విన్నారు. కాని వారికి శ్రావస్తిలో అన్నార్తుల హాహాకారా లేవీ వినిపించలేదు. మరి గౌతమబుద్ధదేవుని కెలా వినిపించాయి! ఆయనకేదో దివ్య దృష్టి ఉన్నదేమోనని వారంతా ఎంతో ఆశ్చర్యపడ్డారు! తిరిగి గౌతమ ముని గభీరవాణి మారుమోగింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"మీరంతా వారందరికి పట్టెడన్నం పెట్టించే మార్గమేదైనా ఆలోచించండి! పాపం! ఎంతమంది క్షుధార్తు లాకలి బాధకోర్వలేక అల్లల్లాడి పోతున్నారో! నాయనలారా! ఈ విషయమేమైనా ఆలోచించారా!"
సదస్యులలో శ్రద్ధాళువు లనేకులు గౌతమ దేవుని పాదధూళి సోకగానే శ్రావస్తిలో వ్యాపించిన క్షామపీడ అంతా ఒక్క క్షణం లో హరించుకు పోగలదని అనుకున్నారు!
అసలా విషయమే తలపెట్టని శ్రీమంతులు కొందరు ఆ మహాత్ముని ముఖతః ధర్మ సూక్ష్మాలేవో తనివితీరా విని తరించాలని నిరీక్షిస్తూ కూర్చున్నారు.
అంతేగాని అక్కడ కూర్చున్నవారెవరికీ అంతవరకూ ఆ జిజ్ఞాసే బయలుదేరలేదు! అందుచేత వారెవరికీ ఆ ప్రశ్న కేమని సమాధానం చెప్పాలో తెలియలేదు. అందరూ ఒకరొకరి ముఖాలకేసి చూస్తూ కూచున్నారు. అంతలో బుద్ధదేవుని గభీరవాణి ప్రతిధ్వనించింది:
"నే నింత దూరం నుంచి ఇక్కడికి వచ్చినది ప్రత్యేకం దీనికోసమే!"
తిరిగి ఆ కరుణామూర్తి పెదవుల నుండి ఇంకొక వేడి నిట్టూర్పు వెలువడింది. కొంతమంది శ్రీమంతు లిక ఆనాడు తమ తత్త్వజిజ్ఞాసలు తెలుపుడు చేసుకునే అవకాశమే లేదని చల్లచల్లగా తమ భవంతులకు జారుకున్నారు.
మరి కొంతమంది సభామధ్యంలోనించి లేచి వెళ్లడానికి వీలులేక, మరి గత్యంతరం లేక ఆవలిస్తూ, చిటికెలు వేస్తూ అలాగే కూర్చుండిపోయారు.
రత్నవర్ధనుడా సభామధ్యంలోనే కూర్చున్నాడు. అతనికి ఎటుపోవడానికి దారి కనబడలేదు. అంతలో గౌతముని దృష్టి అతనిపై పడింది. శ్రేష్ఠి కొంచెం తల వంచుకొని తన గోడు వెళ్లబోసుకున్నాడు. అతగాడు లెక్కలు కట్టడంలో గట్టిదిట్ట.
"ఈ విషయం నేను కొంచెం సావధానంగానే ఆలోచించాను. మన మహానగరంలో అనావృష్టి దోషం వల్ల అయిదారు వేల మంది దాకా అగతికులైనారు. కాటకం కాస్త మళ్ళు ముఖం పట్టేదాకా వీరందరికీ ఇంత అన్నంపెట్టి, ఆదరించాలంటే అధమంగా పూట కొక వంద గుండిగల అన్నమైనా వార్చాలి!
"ప్రస్తుతం నా ధాన్యాగారంలో ఉన్న ధాన్యం వీరందరికీ ఒక్క పూట పట్టెడన్నం పెట్టించడానికి కూడా చాలదేమోనని భయపడుతున్నాను."
శ్రేష్టి ఆపైన వంచిన తల మరి పైకెత్తలేదు! ఆపైన సదస్యులందరి చూపులూ క్షీరస్వామి మీద పడ్డాయి. అతడు తన భుజం మీద ఉత్తరీయం ఒకమారు సవరించుకొన్నాడు:
“ఒక్క చుక్కైనా వర్షం పడక ఈ ఏడాది నా పొలాలన్నీ ఒట్టి బీళ్ళుగా మారిపోయాయి. నా పురులలో ఉన్న ధాన్యం అంతా కలిపితే ఈ ఏటి కేడాదీ మా కుటుంబ గ్రాసానికే సరిపోదేమోనని భయపడు తున్నాను. నాకున్న బలగం మీకందరికీ తెలిసిందే గదా! ఏమైనా ఇంకో నాలుగు గింజలు మిగిలితే అవి విత్తనాలకైనా పనికి వస్తాయని అట్టే పెట్టించాను. నా దగ్గర మిగిలిన ధాన్యం అంతా అంతే! ఆపైన తమరందరూ ఎలా సెలవిస్తే అలాగే చేస్తాను! సెలవియ్యండి!”
ఇంకా అతడలాగే ఏదో ఘోష ప్రారంభించబోయాడు.
అంతలో చండసేనుడు తన ఒరలోని బాకు పైకిలాగి సగర్వంగా లేచినిలబడ్డాడు:
"నే నీక్షణంలో నా సైన్యాలను, ఈ అన్నార్తు లను వెంటబెట్టుకుని పరరాజన్యుల రాజ్యాలమీదికి దండెత్తిపోతాను! శత్రువు లందరినీ క్షణంలో సంహరించివేస్తాను! పది వారాలలో ప్రజలందరికీ పదిసంవత్సరాల వరకూ సరిపోయే ధాన్యరాసులు తరలించుకొని వస్తాను! సెలవిప్పించండి! వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాను!"
అతని మాటలు విన్న సదస్యులందరికీ ముచ్చెమటలు పోశాయి. కాని ప్రస్తుతం అంతకంటే గత్యంతర మేమీ లేదని వారిలో చాలమంది నిశ్చయించారు! కొందరు వెను వెంటనే సాధువాదాలు చేశారు! అంతలో గౌతమముని పెదవులు విడివడ్డాయి:
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"నాయనా! నీవు వెళ్ళి తిరిగివచ్చేవరకూ శ్రావస్తిలోని అన్నార్తులందరూ మల మల మాడిపోవసిందేనా! కొంచం శాంతించి సావధానంగా ఆలోచించుకో!"
చండసేనుని కిక ఏమనాలో తెలియలేదు. అతడలాగే దిగాలు పడి ముచ్చెమటలు కక్కుతూ కూర్చున్నాడు.
గౌతమముని మరికొంతసేపటివరకూ మౌన ముద్ర వహించి కూర్చున్నాడు. అక్కడ ఎంతసేపటికీ ఎవరూ ఇంకొక మార్గం చూపించలేకపోయారు.
గౌతముడు వుసూరుమని నిట్టూర్చి లేచి నిలుచున్నాడు. ఇక ఆయన అక్కడి నుంచి బైలుదేరి వెళ్ళిపోయేవేళ సమీపించిందనీ, ఇక ఆ మహాపురుషుడు తమ నగరంలో ఒక్క క్షణమైనా నిలవడనీ, ఆయన కిక తమ మీద దయతప్పిందనీ అందరూ భయపడ్డారు!
అంతలో సుప్రియ తన చిన్నజోలెను ఆ కరుణామూర్తి ముందుంచి జాలి తొణికిస లాడే గద్గద స్వరంతో ఇలా విన్నవించింది:
"మహాప్రభూ! మాలాంటి అన్నార్తులందరినీ ఇలా వదలి వెళ్లిపోవడం తమకు ధర్మం కాదు! ఒక్క క్షణం ఆగండి!"
"ఇక్కడ కూర్చన్నవారందరూ ఇంతో అంతో ఉన్నవారే! నా కొక్కత్తెకి మాత్రం ఏమిలేదు! కాని ఈ చిన్నజోలె, ఈ పసివాళ్లు చల్లగా ఉంటే నే నీ అన్నం లేనివారి నందరినీ ఎన్నాళ్లయినా పోషించగలను!"
కొందరు ఆమె మాటలు విని నిర్ఘాంత పోయారు! మరికొందరు ఆమెకు మతిభ్రమణమే కలిగిందని అనుకొన్నారు. అంతలో సుప్రియ మళ్ళీ విన్నవించింది:
"మీ దయ ఉంటే వీళ్లందరి ధాన్యాగారాల లోని ధాన్యము నాదన్నమాటే! నేను జోలె చేతబుచ్చుకుని బయలుదేరితే నాకందరూ తలో దోసెడు బియ్యం పెట్టకపోరని గట్టి ధైర్యమే ఉంది. మీ చల్లని చూపు కొంచెం నా మీద పడితే నేనెంతమంది నయినా, ఎన్నాళ్ళయినా పోషించగలను! మా మీద తమకింత దయకలిగితే ఈ కరువు కాటకాలొకలెక్కా?"
కరుణార్ధమయిన సుప్రియ అమృతవాణి విన్న సదస్యులందరి శిరస్సులూ ఒక్కమారుగా కిందికి వంగిపోయాయి.
ఆనందాశ్చర్య విస్ఫారితమైన గౌతమ ముని దృష్టి లీలగా సుప్రియ మీదికి ప్రసరించింది.
"తల్లీ! నీ వింతటి భాగ్యశాలినివని నేను అనుకోలేదు సుమా! నీవంటివారొక్కరు ఉంటే చాలు! ఈ శ్రావస్తి కేమిలోటు?
"రా! నేను కూడా నీవెంట వస్తున్నాను! రా!"
గౌతమబుద్ధుడు లేచి నిలుచుని ఎంతో ఆప్యాయంగా ఆమె శిరస్సు నిమిరాడు. నగరవాసు లాక్షణం నించీ తమ ఇళ్లలో దాచుకొన్న ధాన్యరాసులన్నీ సుప్రియ కెదురుగా కుప్పలుగా పోశారు.
ఆనాటి శ్రావస్తీ నగరంలోనూ, నగర పరిసరాలలోనూ ముందుగా శాక్య సింహుని అపార కరుణామృత వృష్టి కురిసింది.
ఆ పైన తొలకరి నీలమేఘా లొక్కుమ్మడిగా కుంభవృష్టి కురిపించాయి!
🤟
(రేపు మరొక కధ)
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment