Thursday, September 25, 2025

 *సేతు రహస్యం - 7*
🌊

రచన:  గంగ శ్రీనివాస్


*విహంగ వీక్షణం*

రెండు రోజుల తర్వాత ఎయిర్ పోర్టులో కలుసుకున్నారు శ్రీధర్, రాజేష్, కేట్ లు. వారితో పాటు డా॥ సోమదేవ కూడ ప్రయాణిస్తున్నాడు. వారికి సెండాఫ్ ఇవ్వటాని కి ఒక పెద్ద గ్రూపే వచ్చింది. శ్రీధర్, రాజేష్ తల్లిదండ్రులు, ఇంకా ఇతరులు చాలామంది వచ్చారు. అలాగే సూర్యనారాయణ, మోడి ఇంకా చాలామంది వచ్చారు.

ఎయిర్ పోర్టు ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని అందరి వీడ్కోలు తీసుకొని రామసేతు నిజ నిర్ధారణ కమిటీ కోర్ గ్రూప్ సభ్యులు ఫ్లైట్ లోకి చేరుకున్నారు. శ్రీధర్, రాజేష్ ఒక వైపు డా॥ సోమదేవ, కేట్ మరొక వైపు కూర్చున్నారు.

చీటికి మాటికి శ్రీధర్ కేట్ వైపు దొంగ చూపులు చూస్తుంటే రాజేష్ అన్నాడు.

"ఏరా సోమదేవను ఇటు రమ్మని అడగనా?”. 

శ్రీధర్ కాస్త మొగమాటపడి "అవసరం లేదు. ఇక్కడ బాగానే ఉంది" అన్నాడు.

కేట్ కూడా శ్రీధర్ను ఓరచూపులు చూస్తు చేతిలో మేగజైన్ తిరగేస్తూ ఉంది. శ్రీధర్ తనతో మాటలు పెంచుకోవాలనుకోవడం ఆమె కూడా గమనించింది. అతన్ని చూసినప్పటి నుండి ఆమె హృదయంలో కొత్త స్పందనలు కలుగుతున్నాయి. తన లోని మార్పును అతను పసిగడతాడేమో నని భయపడింది. కళ్ళ ముందు అక్షరాలు కనిపిస్తున్నా మనసులో అతని ఆలోచనలే. తన గురించి ఏమని అనుకుంటున్నాడో తెలుసుకోవాలనిపిస్తుంది. డా॥సోమదేవని అటు పంపించి శ్రీధర్ ను మాటల్లో పెడదామనుకుంది.

ఇంతలో డా॥ సోమదేవ రాజేష్ ను పిలిచి తన సీట్లో కూర్చోమని చెప్పాడు.

శ్రీధర్ వైపు చూసి "ఏంట్రా కెట్ అంటే సోమదేవ భయపడుతున్నాడా? లేక నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడా" అంటూ రాజేష్ మెల్లగా లేచి సోమదేవ వైపు వెళ్ళాడు. 

డా॥ సోమదేవ "థ్యాంక్స్ రాజేష్" అంటు వచ్చి శ్రీధర్ ప్రక్కన కూర్చున్నాడు. "వాట్ యంగ్ మాన్" అంటూ. శ్రీధర్ మొగమాటం గా నవ్వుతూ చూశాడు.

ఫ్లైట్ టేకాఫ్ చేయబోతున్నట్లు ఎనౌన్స్ చేశారు. సీట్ బెల్ట్ లు కట్టుకుని కిటికీలోంచి చూస్తు మౌనంగా ఉన్నాడు. డా॥ సోమదేవ పది నిముషాల తర్వాత శ్రీధర్ వైపు తిరిగి “అటు చూడు, యూనివర్సీటీ కాంపస్. పక్కనే బ్లూ కలర్లో సముద్రం” అన్నాడు చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ. ఆయన ముఖంలోని ఆనందం శ్రీధర్ని కదిలించింది. అతను కూడ మనస్ఫూర్తిగా స్పందిస్తూ 
"అవును డాక్టర్, అదే కాంపస్ లో నేను ఏడేళ్ళు చదువుకున్నాను” అన్నాడు.

"ఐ నో యంగ్ మాన్. కాని నీకో విషయం తెలుసా, నేను కూడా అదే కాంపస్ లో చదువుకున్నాను. నా ప్రియమైన భార్య శాంతిరత్నను అక్కడే మొదటిసారి కలుసుకున్నాను.” సోమదేవ కళ్ళల్లో మెరుపులు కనిపించాయి. సన్నటి నీటిపొర కళ్ళను మసక బారలా చేసిందేమో నాప్కిన్ తో కళ్ళు అద్దుకున్నాడు. 

"శాంతిరత్నను నువ్వు చూస్తే చాలా ఆశ్చర్యపోతావు. అటువంటి స్త్రీలు అరుదుగా ఉంటారు. ఆమెను ఒక్కసారి కలిసినా జీవితాంతం గుర్తుండేంత ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె లేని జీవితం నరకం. నా ప్రాణమే నన్ను విడిచి పోయినట్టనిపించింది. ఆమె చనిపోయిన రోజు నాకు జీవితమే చీకటైపోయింది. నా కూతురు ప్రియంవద బాధ్యత నా పైన పెట్టి ఆమె నావైపు చూస్తూ ప్రాణం విడిచింది. ప్రియంవద లేకపోతే నేను కూడ ఆమెతోనే వెళ్ళిపోయేవాడిని" కంఠం గద్గదమవుతూ ఉంటే మళ్ళీ మౌనంగా అయిపోయాడు.

అతన్ని ఎలా ఓదార్చాలో, ఆ సందర్భంలో ఏమి మాట్లాడాలో శ్రీధర్ కి తెలియలేదు. 

సోమదేవకు స్వాంతన లభించాలని కోరుకున్నాడు. ఒక్కోసారి మాటలాడటం కంటే కూడా మౌనం బాగా కమ్యూనికేట్
చేస్తుంది. ఆనాడు సముద్రగర్భంలో మృత్యువులా ఘోషించిన నిశ్శబ్దం ఈనాడు ఆకాశమార్గంలో మృదువైన సంగీతంలా వినిపిస్తుంది. మనసును నెమ్మది పరిచే మౌన గాయాలని మరిపించే మౌనం. అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ముందుగా డా॥ సోమదేవ మాట్లాడాడు.

"శ్రీధర్ ఇంత ఎత్తు నుంచి ఆ కాంపస్ ను చూస్తే ఎన్నో మధుర సృతులు నన్నేవో లోకాలకు తీసుకునిపోతాయి. అందుకే ఆ ఛాన్స్ మిస్ కాను.” 

శ్రీధర్ కి శాంతిరత్న గురించి అడగాలని ఉంది. ప్రశ్నలు మనసులో తయారై అంత లోనే నీటి బుడగల్లా పేలిపోతున్నాయి. సోమదేవ వైపు చూస్తు అతని ఆలోచనల్ని అందుకోవడం కోసం మనసును బ్లాంక్ చేస్తున్నాడు శ్రీధర్.

అప్పుడన్నాడు సోమదేవ " ప్రేమ అనే మధుర భావన మనసును ఎప్పుడు తాకుతుందో తెలియదు. దానిని అంది పుచ్చుకుని ఆస్వాదించాలి. అసలు మనిషి జీవితం ఒక ఉద్యోగం అనుకుంటే ప్రేమ దానికి భగవంతుడు ఇచ్చే జీతం లాంటిది. యు మస్ట్ ఎంజాయ్. వెళ్ళు, వెళ్లి కేట్ తో మాట్లాడు.” అంటూ చిన్నగా కన్నుకొట్టాడు.

"రాజేష్ ఒకసారి ఇటువస్తావా?” అని రాజేష్ ను పిలిచాడు సోమదేవ. తన మనసులోకి దూరి తనకు కేట్ పైనున్న సున్నితమైన భావాలను ఎలా తెలుసు కున్నాడో అని ఆశ్చర్యపోయాడు శ్రీధర్.

కలలో నడిచినట్లు నడిచి రాజేష్ ఖాళీ చేసిన సీట్లో కూర్చుకున్నాడు. రాజేష్ భుజం తట్టి వెళ్ళటం గమనించనేలేదు. ఎవరూ చూడటం లేదులే అని అల్లరి చేస్తున్న పిల్లవాడు, టీచర్ గమనిస్తే ఎలా బిడియపడతాడో అలా అయిపోయాడు.

కేట్ అతని వైపు ఒకసారి చూసి తను కూడ బిగుసుకుపోయింది. ఆ ముగ్గురు మగవాళ్ళు ఏదో గూడుపుఠానీ చేస్తున్నట్లుంది అనుకుంటు ఆలోచనలతో ముడుచుకుపోయింది. ఎప్పుడూ ఉల్లాసంగా కబుర్లు చెప్తూ పెద్ద ఛాటర్ బాక్స్ లా ఉండే ఆమెకు మాటలే కరువయ్యాయి.

రాజేష్ తో సోమదేవ చాలా సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్లు నటిస్తూ కేట్ వైపు చూసి.."కొంచెం ఆ మాగజైన్ ఇలా పాస్ చేస్తావా, రాజేష్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేయాలి” అన్నాడు.

కేట్ తన చేతిలో ఉన్న మాగజైన్ తీసి శ్రీధర్ కి ఇచ్చింది సోమదేవకి ఇవ్వమని. 

"సోమదేవకి ఫ్యాషన్ డిజైనింగ్ లో డౌట్స్ ఉన్నాయంట, అవి తీరుద్దామని" అన్నాడు రాజేష్.

ఎయిర్ హాస్టెస్ ట్రాలీతో వచ్చి డ్రింక్స్ ఆఫర్ చేసింది. కేట్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంది. శ్రీధర్ కూడ డిటో, రాజేష్ సోమదేవ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.

"కేట్ నీ గురించి చెప్పు” అన్నాడు శ్రీధర్.

కేట్ ఒక్కగానొక్క కూతురు. తండ్రి ఎయిర్ ఫోర్స్ లో పని చేసి కువైట్ ఆపరేషన్ లో చనిపోయాడు. తల్లి అట్లాంటా యూనివర్సిటీ లో లైబ్రేరియన్. కేట్ ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. ఆమెకి కేట్ తర్వాత బాగా నచ్చేవి పుస్తకాలే. తీరిక చేసుకుని మరీ పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఫిక్షన్, నాన్ ఫిక్షన్ రెండూ కూడా విపరీతంగా చదువుతుంది. కేట్ చిన్నప్పటి నుంచి అన్నింటా ఫస్ట్. కేట్ కి వెజిటేరియన్ ఆహారం అంటే ఇష్టం. తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడ అబ్బాయిలే. అందరూ అనుకునే రిలేషన్స్ ఏమీ బాయ్ ఫ్రెండ్స్ తో ఉండేవి కావు. ఆమె ఫ్రెండ్స్ కూడ ఆమెను అలా చూసేవారు కాదు..

తన గురించి చెప్పమని శ్రీధర్ ను అడిగింది “నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా” అని.

ఆమెకు జవాబిచ్చే ముందు ఒక క్షణం తటపటాయించాడు శ్రీధర్, తర్వాత "ఉన్నారు" అన్నాడు.

"వాళ్ళతో క్లోజ్ గా ఉండేవాడివా?” అంది.

మెల్లిగా ఆమె వైపు చూస్తూ "అవును క్లోజ్ గా ఉండేవాడిని. కాని ఒకరి తోనే, అయితే కొన్ని అనుకోని డెవలప్ మెంట్స్ వలన మా ఇద్దరికి అభిప్రాయభేదాలు చాలా తీవ్రంగా వచ్చాయి. తర్వాత మేము మాట్లాడుకో లేదు. ఒకరినొకరం ఎవాయిడ్ చేసాం. తప్పించుకుని తిరుగుతున్నాం”.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆ విషయం తన ఫ్రెండ్స్ తో కూడ శ్రీధర్ ఎప్పుడూ డిస్కస్ చేయలేదు. ఎందుకో కేట్ కి చెప్పాక అతని మనసులో ముందు ఉన్న ఆందోళన పోయి తేలికయింది.

కాని కేట్ ముఖం పై మబ్బులు ముసురుకు న్నాయి. విండో లోంచి బైటకు నీలాకాశం వైపు చూస్తు ముభావంగా ఉండిపోయింది.
శ్రీధర్ తనకు ఇచ్చిన పేపర్స్ తీసుకుని చదువుతూ ఉండిపోయాడు.

కేట్ కి తన పైన తనకే కోపం వచ్చింది. ఎంత బలహీనంగా మారిపోయింది. తన మనసు తన ప్రమేయమే లేకుండా శ్రీధర్ గురించి ఆలోచించాలని కోరుతుంది. అతను తనను గురించి తప్ప మరెవరి గురించి ఆలోచించకూడదనే పొసెసివ్ నెస్ కూడ కలుగుతుంది. ఇదంతా కేట్ కి నచ్చలేదు. వెంటనే ఐపాడ్ లో మ్యూజిక్ విందామని ముందుకు వంగి తన బాగ్ తీసింది.

"కేట్" అని మృదువుగా పిలిచి “ఎందుకు అలా ఉన్నావు?" అడిగాడు శ్రీధర్.

"ఎవరితో క్లోజ్ గా ఉండేవాడివి?" మరో ప్రశ్న అడిగి నాలుక కరుచుకుంది. 

“టైరా అని నా జూనియర్. తన ఎకడమిక్ వర్క్ కి నా హెల్ప్ తీసుకునేది.”

"క్లోజ్ గా తిరగటమంటే డేటింగ్ చేసావా?" అడక్కూడదనుకుంటూనే అడిగింది. ఆమె ప్రమేయంలేకుండా ఆమె మనసే డైరక్టుగా రంగంలోకి దిగి విషయాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఫీలయింది కేట్.

కేట్ ప్రశ్న తన మనసులో నానుతున్న గాయాన్ని తిరిగి రేపుతున్నట్లనిపించింది. కాని మనసులో ఒక వైపు డాక్టర్ దగ్గర తన బాధ చెప్పుకునే పేషెంట్లా అన్ని విషయాలు అరమరికలు లేకుండా కేట్ కి చెప్పుకోవాలనిపిస్తుంది.

అతను ఆలోచనలలో నుంచి బయటకు రాకపోయేసరికి బాగ్ నుంచి ఐపాడ్ తీసి చెవులకు తగిలించుకుంది కేట్.

"డేటింగ్ లాగా ప్రత్యేకంగా వెళ్ళలేదు. కాని చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం" అన్నాడు శ్రీధర్.

ఇంకా ఏదో చెప్పుకుపోతున్నాడు శ్రీధర్.
ఇక అతని మాటలు వినకుండా మ్యూజిక్ ఆన్ చేసి కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కి వాలింది కేట్.

ఆమె మనసు కెరటాలతో అల్లకల్లోలంగా ఉన్న సాగర జలాలను తలపింపచేస్తున్నది. కనుల నుంచి కన్నీరు ఊరి బుగ్గుల పైకి జారుతుందని అది కనబడకుండా ముఖం పై నాప్కిన్ వేసుకుంది కేట్.

ఒకవైపు టైరా గురించిన ఆలోచనలు ఇంకో వైపు కేట్ గురించి ఆలోచనలు అతని మనస్సు ను మధించివేస్తున్నాయి.

కాని ఆశ్చర్యంగా కేట్ ని చూసాక అతని మనసు ఆ వెలితి నుంచి బయటపడింది. 
కేట్ పక్కనే ఉంటే కలిగే మధురమైన భావన అతని లోని వికారాలన్నిటిని పరిహరించి ఒకరకమైన ప్రశాంతతను అతని మనసు నిండా నింపుతున్నది.
📖

లంచ్ టైమ్ కి ఎయిర్ హాస్టెస్ లంచ్ సర్వ్ చేయడానికి వచ్చింది. కేట్ ఇంకా అలానే ముఖంపై నాప్కిన్ తో ఉంది. ఆమె రూపం అలా కూడ ఆకర్షణీయంగానే ఉంది. కేట్ ని పిలిచి లంచ్ వచ్చిందని చెప్పాలనుకున్నా డు శ్రీధర్. ఆమె వైపు తిరిగి కేట్ అని పిలవాలనుకున్నాడు. అంతలోనే ముఖం పైన నాప్కిన్ తీసి శ్రీధర్ వైపు చూసి 
“పిలిచావా” అంది కేట్. ఆశ్చర్యం వేసింది శ్రీధర్ కి.

"పిలవాలనే ఇటు తిరిగాను, అంతలో నువ్వే లేచావు. లంచ్ వచ్చింది కేట్" అన్నాడు.

“నాకు తినాలనిపించటం లేదు” అంది అతని కళ్ళల్లోకి చూస్తూ.

“ప్లీజ్ కేట్, నువ్వు తినకపోతే నేను కూడా తినను" అన్నాడు. అది విని హాయిగా నవ్వుతూ  "ఎందుకు, సరేలే లంచ్ చేద్దాం ఓకె” అంది. 

ఆమె ముఖంలోని విషాదఛాయలు తొలిగిపోయాయి. శ్రీధర్ కి తనంటే ఇష్టం అనే చిన్న ఊహకే కేట్ మనసు తుళ్ళింతలు పడసాగింది. “హాయ్ గ్రెట్ వాట్ ఎబవుట్ యూ” అని రాజేష్ వైపు చూసింది.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మళ్ళీ ఉషారుగా మాట్లాడుతున్న కేట్ ని చూసి సంతోషించాడు రాజేష్.

"మేము రెడీ. బోర్ కొడుతుంటే సోమదేవని నంజుకుంటున్నా” అన్నాడు సీరియస్. డా॥ సోమదేవ నవ్వుతూ..

“రాజేష్ కి బోర్ కొట్టడానికి నేను మొదటి కారణం" అన్నాడు.

నవ్వుతూ తుళ్ళుతూ లంచ్ కానిచ్చారు అంతా.
📖

“యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి మనం” అంటూ మొదలు పెట్టాడు డా॥ సోమదేవ.

వాళ్ళు ఇండియా చేరగానే చేయవలసిన పనులు చర్చించుకున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లో సోమదేవకు బాగానే స్నేహితులున్నారు. అందువలన కావలసిన పర్మిషన్లు సంపాదించడం అంత కష్టం కాక పోవచ్చు. శ్రీధర్ ప్లాన్ ప్రకారం తవ్వకాలు రామేశ్వరం, ధనుష్కోడిలో కూడా అవసరం అవుతాయి. అది కాకుండా హిందూ మహా సముద్రంలో చేపట్టవలసిన ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన అనుమతులు కూడా సంపాదించాలి.

ఇవేగాక శ్రీలంకలో కూడా వాళ్ళకు ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారి సహకారము, అనుమతులు అవసరం అవుతాయి, వాటిని సోమదేవ హాండిల్ చేస్తాడు.

కావలసిన అనుమతులు తీసుకున్నాక ఎక్స్కవేషన్ టీమ్స్ ని తయారుచేయాలి. కనీసం తమతో పాటు మరో మూడు టీమ్ లనైనా చేయాలని శ్రీధర్ భావించాడు. అందులో ఒకటి శ్రీలంక భూభాగంలో, రెండు ఇండియా భూభాగంలో పనిచేస్తాయి. మిగిలిన ఒకటి సముద్రంలో తనతో కలిసి ఆపరేషన్స్ చేయాలి.

దీనికి కావలసిన టెక్నికల్ మాన్ పవర్ ని అంతర్జాతీయంగా ఏర్పాటు చేయడం మంచిది అని కేట్ అభిప్రాయపడింది. సోమదేవ కూడ అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
🌊
*సశేషం*  ꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment