Saturday, September 27, 2025

 *ప్రాచీన గాథాలహరి - 13*
🪷

రచన: పిలకా గణపతిశాస్త్రి


*గోపాల గవేషణ -1*
🐄

(గవేషణ - వెతకటం)

ఆవుదూడ 'అంబా' అని గొంతెత్తి అరిచింది! గోధూళివేళ అయ్యేసరికి ఆళవీ గ్రామంలో నందగోపాలుని ఆలమంద అంతా తిరిగి వచ్చివేసింది. కాని ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు.

బాగా చీకటి పడింది. అయినా ఇంకా ఆవు తిరిగి రాలేదు. గోశాలలో గోవత్సాలన్నీ తోక లెత్తిపెట్టి ఎంతో సంతోషంగా పాలు కుడుచుకుంటున్నాయి. కాని ఆ ఒక్క ఆవుదూడ మాత్రం 'అంబా' 'అంబా' అని అదేపనిగా అరవడం మొదలుపెట్టంది. ఆ దూడ పుట్టినప్పటి నుంచీ నందగోపాలుని ఇల్లంతా పాడి పంటలతో కలకలలాడింది.

అందుచేత ఆ ఆవన్నా, ఆ దూడన్నా నందగోపాలుని కెంతో యిష్టం. అది అదే పనిగా అరవడం మొదలుపెట్టేసరికి అతని కా రాత్రి మరి అన్నం సయించలేదు. రాత్రి తెల్లవార్లూ నందగోపుడు అదేమైపోయిందో అని ఆరాటపడుతూనే ఉన్నాడు.

మరునాడు తెల్లవారగట్లే లేచి, ఆవును వెదకి పట్టుకోవడం కోసం ఆళవీ గ్రామానికి సమీపంలో వున్న అడవికి బయలుదేరి వెళ్లాడు.

నందు డూరి పొలిమేర సమీపించేసరికి పొద్దుపొడిచింది. పొరుగూళ్ళజనం తీర్థ ప్రజలాగ ఆళవీగ్రామానికి నడిచి వస్తున్నారు. కాని నందు డొక్కడు మాత్రం గ్రామ సమీపంలో వున్న అడవికి బయలుదేరి పోతున్నాడు!

ఆ ప్రజానీకం ముఖాలన్నీ అరుణోదయ కాంతులలో నూతనానందావేశాలతో కలకలలాడుతున్నాయి. చిన్న చిన్న పసి పాపలను కూడా వెంటబెట్టుకొని వారంతా ఎక్కడికి వెడుతున్నారో అని నందుని హృదయాంతరాళంలో జిజ్ఞాస రేకెత్తింది. నడవలేక నడవలేక నడుస్తున్న ఓ ముసలి తాత దగ్గిరికి వెళ్ళి నెమ్మదిగా అడిగాడు:

"ఎక్కడికి తాతా! ఈ ప్రయాణం!"

"ఆళవికి పోతున్నాను బాబూ!"

"ఏమిటి విశేషం!".

"నీకింకా తెలియదా?"

"నాకేమీ తెలియదే!”

"ఈవేళ ఉదయమే గౌతమబుద్ధులు ఆళవికి విచ్చేస్తున్నారట! ఆ మహాత్ముణ్ని ఒక్కసారి కళ్లారా సందర్శించి వత్తామని బయలుదేరాను. తిరిగీ ఈ జన్మలో మరి ఆయన సందర్శన భాగ్యం కలుగుతుందో! కలగదో!" అని ఆ వృద్ధుడొక పెద్ద నిట్టూర్పు విడిచిపెట్టాడు. నందగోపుడతనిని మళ్ళీ అడిగాడు:

"వారీ వేళంతా ఆళవిలోనే ఉంటారా?"

"మధ్యాహ్న భిక్ష ముగించుకొని వెంటనే తిరిగీ శ్రావస్తీ నగరానికి వెళ్ళిపోతారట!"

"అయ్యో! అలాగా!” అని నందగోపుడు తిరిగీ నిట్టూర్పు విడిచిపెట్టాడు. ముసలి తాత అతని వాలకం చూచి ఇలా గడిగాడు:

"మీదే వూరు నాయనా?”

"ఆళవీ గ్రామమే!”

"అలాగా! అయితే పొరుగూళ్ళ జనం అంతా తీర్థప్రజలాగ ఇక్కడికే వస్తూంటే నీ వున్న గ్రామం విడిచిపెట్టి పోతావేమయ్యా!" అని ఒక చిరునవ్వు విసిరాడా ముసలి తాత నందుడతనికి తన ప్రయాణ కారణం తెలియజేశాడు. అడవిలో ఆ ఆవు ఏ పులివాత పడిందోనని భయపడుతున్నా నని కూడా అన్నాడు. ఆ మాట విన్న తరువాత ముసలి తాత మరి అతని మాట కడ్డు చెప్పలేక తన దారిని వెళ్ళిపోయాడు. అతని వెంట ఇంకా ఎందరెందరో పరిసర గ్రామస్థులా అళవీ గ్రామం వైపు నడిచి వెళ్ళారు.

అది చూడగానే నందగోపాలుని హృదయం లో ఆరాటం ప్రారంభమైంది. గోవు గొడవ విడిచిపెట్టి తాను కూడా వారి వెంటపడి పోవాలని అనుకున్నాడు. ఇక ఈ సమయంలో కాకపోతే మరింక తథాగతుని దర్శన భాగ్యమే కలగదేమోనని అతని కొక భయం పట్టుకుంది. వెంటనే వెనక్కి తిరిగి రెండు మూడడుగులు వేశాడు.

అంతలో అతని హృదయంలో లేగ దూడ 'అంబా' అని అరిచినట్టయింది. ఆవు ఒంటరిగా అడివిలో పులివాత పడిపోతున్నట్టు కనబడింది! 'అంబా' అని గుండె పగిలిపోయే టట్టరిచినట్టు వినబడింది!

అది నందగోపాలుని ఇంట పుట్టిన ఆవు. క్రమంగా అతని పాపలతో బాటే పెరిగి పెద్దదయింది. అతని పాపలందరు ఆ ఆవు పాలు తాగి క్రమంగా పెరిగి పెద్ద వారైనారు. నందుడు కూడా క్రమక్రమంగా వారితోబాటే ఆ ఆవు పాలు తాగి పెద్దవాడైనాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఇటీవల ఆ ఆవుకొక కోడెదూడ పుట్టింది. అంతవరకు పుట్టినవన్నీ పెయ్యదూడలే. కోడె పుట్టిన వేళా విశేషమేమోగాని ఆనాటి నించీ నందగోపుని ఇల్లంతా పసిపాప నవ్వులతో కలకలలాడింది. అతని గుండెలో మళ్ళీ ఆ లేగ దూడ 'అంబా' అని అరిచినట్లు వినబడింది!

నందోపాలుని ఒక కాలుసాగలేదు. ముందుగా తొందర తొందరగా అడవికి వెళ్ళి ఆవును వెదికి పట్టుకొని ఆ తరవాతే గౌతమదేవుని సందర్శించవలెనని గట్టిగా అనుకొన్నాడు. ఒకవేళ తాను తిరిగి వచ్చేసరికి తథాగతుడు గ్రామం విడిచి వెళ్ళిపోతే! ఇక మళ్ళీ ఆయన ధర్మ ప్రసంగం వినే అదృష్టమే కలుగదేమోనని నందగోపాలుని కెంతో భయం వేసింది. తాను చేసుకున్న పూర్వ పుణ్యం అంతే అనుకుని ఒక్క వేడి నిట్టూర్పు విడిచి పెట్టాడు. తొందర తొందరగా ఆవును వెదికి పట్టుకుని తిరిగి వచ్చి, అధమపక్షం గౌతమ దేవుని దర్శనభాగ్యమైనా పొందవలెనని సంకల్పించాడు. బాగా తొందరగా అంగలు వేసుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయాడు.

నందగోపుడు ఆవుకోసం అడివి అంతా గాలించేసరికి మిట్టమధ్యాహ్నం అయింది. ఎండ నెత్తి మాడ్చివేస్తూంది. లోలోపల ఆకలి దహించి వేస్తూంది. నాలుక పిడచ గట్టుకుపోతూంది. అయినా నందుడు తన పట్టు విడువలేదు.

అంతలో అడివిలో ఎక్కడో మారుమూలగా ఒక ఆర్తనాదం వినబడింది. నందునికది ఆవు 'అంబా' అని పిలిచిన పిలుపులాగే స్ఫురించింది. గబగబా చెట్టులు, పుట్టలు దాటి ఆ పిలుపు వినిపించిన ప్రదేశానికి చేరుకొన్నాడు. అక్కడ హఠాత్తుగా అతని కొక పెన్నిధి కనిపించినట్టయింది!

అది నందుడు చిన్నప్పటినించీ పెంచి పెద్ద చేసిన ఆవు! అడివిలో దారితప్పి ఎటో పడిపోతూ మాటి మాటికీ 'అంబా-అంబా' అని అరుస్తూంది. ఏ పెద్ద పులినో చూచి బెదిరి కంగారుగా పరుగెత్తి ఉండవచ్చు ననీ, అందువల్లనే అడివిలో దారి తప్పి తికమకలు పడుతూ ఉండవచ్చుననీ నందగోపాలకు డూహించాడు. వెంటనే దానిని వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరాడు.

ఆవుతోబాటతడు గ్రామం పొలిమేర చేరుకునేసరికి మిట్టమధ్యాహ్నం వేళ దాటిపోయింది. ఎంతో ఆలస్యం అయిందని నందుడిక ఇంటికి చేరుకునే సంకల్పం విరమించుకొన్నాడు. తొందర తొందరగా నడిచి వెళ్ళి బుద్ధదేవుని ధర్మబోధ వినవలెనని అనుకొన్నాడు. ఆ అదృష్టం కలిసి రాకపోతే పోనీ అధమం ఒక్కసారి కళ్ళారా ఆ మహామహుని సందర్శన భాగ్యమైనా పొందవలెనని ఉవ్విళ్ళూరి పోతూ గౌతమదేవుడు శిష్య గణంతో విశ్రమించిన వట వృక్షం వైపు సాగిపోయాడు. గోవు కూడా అతని వెంట ఒక చిన్న లేగదూడలా నడిచిపోయింది.
🐮
*సశేషం*

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*ఏడాది చందా 120/-, ఫోన్ పే & గూగుల్ పే నెంబర్ 9849656434*

*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment