233 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18
శ్లోకము 21
నిర్వాసనో నిరాలంబః స్వచ్చందో ముక్త బంధనః|
క్షిప్తః సంసారవాతేన చేష్టతే శుష్కపర్ణవత్||
సంస్కారాలు అనబడే బలమైన వాయువులు వీచటం వలన ఎగిరే ఎండుటాకు వలె జీవన్ముక్తిని జీవయాత్ర సాగుతూ ఉంటుంది. కోరికల రూపమైన బంధం లేకుండా స్వతంత్రంగా హాయిగా జీవిస్తాడు.
అనంతమైన ఆత్మ స్వరూపాన్ని తనదిగా గుర్తించిన జ్ఞానికి అల్పము పరిమితము అయిన శరీరం మీద మమకారం నశించి తీరుతుంది. అసలు ఆ ప్రత్యేక భావనతో అతనికి అవసరమే ఉండదు. ఎండుటాకు చెట్టు యొక్క బంధము నుండి విడిపోయి గాలికి ఎలా కదులు పోతుందో అదేవిధంగా జ్ఞాని దేహం కూడా బంధము నుండి బయటపడి ప్రారబ్దానుగుణంగా మిగిలి ఉన్న సంస్కారాలకు అనుగుణంగా కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. ఆ కర్మల వల్ల కొత్త వాసనలు ఏవి ఏర్పడవు. అతని మనసు శరీరము కూడా సంసార వృక్షము నుండి రాలిపోయిన ఎండుటాకుల వంటివే .అనంతమైన ఆత్మగా తనను తాను గుర్తించిన జ్ఞానికి వాటితో ఏ అవసరము ఉండదు.
చెట్టుకు బంధింపబడి ఉన్న ఆకు కంటే కూడా ఎక్కువగా కదులుతూ ఎగురుతూ గాలితో పాటుగా పోతూ ఉంటుంది ఎండుటాకు. అదేవిధంగా జ్ఞాని సామాన్యుని కంటే అధికంగా శ్రమిస్తూ నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు కనిపించవచ్చు. అయినా ఆ కర్మలు అతనికి ఏ విధంగానో బంధింపజాలవు. జీవన్ముక్తుని శరీరము పనిచేస్తున్న ఫలితాలను పొంది అనుభవించే అహంకారం అతనిలో లేని కారణంగా కర్మ ఫలాలు అతనినికి చెందజాలవు. ప్రారబ్దం అనే గాలికి ఎగిరే ఎండుటాకు వలె జ్ఞాని యొక్క
మనశ్శరీరాలు పనిచేస్తూ ఉంటాయని అష్టావక్రమ మహర్షి చెప్పడంలో ఎంతో ఔచిత్యము, అందము, అర్థము కనిపిస్తున్నాయి.
గతంలో చేసిన కర్మలు దృఢమైన వాసనలుగా ఏర్పడి ప్రస్తుత ఆలోచన విధానాన్ని ప్రత్యేక పద్ధతిలో రూపొందించి వ్యక్తి జీవితాలను నడిపిస్తూ ఉంటాయి. అనేక జన్మలుగా పోగు చేసుకున్న వాసనలన్నీ వ్యక్తిత్వాన్ని నిర్మించి జీవితాన్ని నడిపిస్తాయి. వీనినే పూర్వజన్మ వాసనలు సంస్కారాలు అంటారు. ఒక యోగి ఏకాంతంలో సమాధిలో జీవితం గడపవచ్చు, మరొక యోగి పిచ్చివాని వలె జీర్ణవస్తమును ధరించి దొరికినది తింటూ ఏ రోడ్డు పక్కనో నిద్రపోతూ జీవించవచ్చు. మరొక మహాత్ముడు సమాజాన్ని ఉద్ధరించడానికి అనేక ప్రణాళికలు వేసి వాటిని ఆచరించడానికి అంకితం కావచ్చు. వేరొక జ్ఞాని కొత్త మతాన్ని స్థాపించవచ్చు. ఉన్నత మత వ్యాప్తికి నిర్విరామంగా కృషి చేయనూ వచ్చు. తన్ను తాను తెలుసుకొని జీవన్ముక్తులైన వీరంతా ఏ పని చేసినా అది వారి ప్రారబ్ధాను గుణంగా గాలికి ఎండుటాకు వలే చలించడమే అవుతుంది. అహంకార రహితులైన వారికి ఏ కర్మలు బంధించజాలవు. మన పొగడ్తలు తెగడ్తలు కూడా వారు ఉండే స్థితిని సమీపించనైనా లేవు.
జీవన్ముక్తుని శేష జీవితాన్ని ఎండుటాకు చలనముతో పోల్చిన ఈ ఉపమానం ఎంతో అర్థవంతంగా సమర్ధనీయంగా అతని స్థితిని మన బుద్ధికి అందిస్తుంది.🙏🙏🙏
No comments:
Post a Comment