Saturday, September 27, 2025

******🛕🔔భగవద్గీత🔔🛕* _(సరళమైన తెలుగులో)_ *రెండవ అధ్యాయము* *సాంఖ్యయోగము.*

 4️⃣9️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *రెండవ అధ్యాయము* 

    *సాంఖ్యయోగము.*  

*66. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనాl* 
 *న చాభావయత: శాన్తిరశాన్తస్య కుత: సుఖమ్||*

ఇంద్రియములు, మనసు వశంలో లేని వాడికి బుద్ధికూడా నిశ్చయంగా ఉండదు. అటువంటి వాడి మనసులో పరమాత్మ గురించి ఎటువంటి ఆలోచనా కలుగదు. ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ఆలోచిస్తుంటాడు. అటువంటి వాడికి మానసిక శాంతి కరువవుతుంది. అటువంటి వాడికి సుఖం, శాంతి ఎలా లభిస్తుంది?

ప్రతి వాడూ నేను సుఖంగా, ప్రశంతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకుంటాడు. కానీ ఆ సుఖం ఆనందం ఎక్కడ ఉందో ఎలా లభిస్తుందో వాడికి తెలియదు. వాడు బయట ప్రపంచంలో లభించే సుఖం, ఆనందం అని అనుకుంటున్నది నిజంగా సుఖం, ఆనందం కాదు అన్న విషయం వాడికి తెలియదు. సంసారమే సుఖదుఃఖాల సమ్మేళనము. సుఖదుఃఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూపోతూ ఉంటాయి. మనసును ప్రాపంచిక విషయముల నుండి మరలించి ఆత్మయందు ఉంచితే అదే శాశ్వత సుఖము, దాని కోసం ఎవరూ ప్రయత్నించరు. తాత్కాలిక సుఖాల కోసం పాకులాడుతుంటారు. ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాల గురించి విషయ వాంఛల గురించి ఆలోచిస్తూ, పరమాత్మ గురించి ఆలోచించని వాడికి శాశ్వతమైన సుఖము, ఆనందము, శాంతి ఎలా లభిస్తాయి అని పరమాత్మ ప్రశ్నిస్తున్నాడు.

చాలా మంది ఊరికే టెన్షన్ పడిపోతూ ఉంటారు. కారణం ఉండదు. ధరలు పెరగక ముందే పెరుగుతాయేమో అని టెన్షన్, పెరిగిన తరువాత మరొక టెన్షన్. పదిమంది గుమిగూడి ఉంటే వాళ్లలో వాళ్లు కొట్టుకుంటారేమో, మత కలహాల లాంటివి జరుగుతాయేమో అని టెన్షన్. వాళ్లకు ఎక్కడో అలాంటిది జరిగి ఉంటుంది. దాని జ్ఞాపకాలతో సతమతమౌతుంటారు. కొంత మంది అవసరమైన విషయాలను వదిలిపెట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తుంటారు. దేవాలయానికి పరమాత్మను దర్శించడానికి, ధ్యానం చేయడానికి వెళతాము. కాని అక్కడ మూలవిరాట్టుకు, ఉత్సవిగ్రహాలకు చేసిన అలంకారాలు, వితరణ చేసే ప్రసాదాలు, దేవాలయానికి అమర్చిన రంగురంగుల దీపాలు వీటి మీదనే దృష్టి పెడతాము తప్ప పరమాత్మ గురించి తలచుకోము. ఒకొక్కక్కడు దేవాలయంలో తనకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వలేదని, తన పూజ ముందు జరగలేదనీ, తనకు హారతి ముందు ఇవ్వలేదనీ, అందరి మీదా కోపపడతాడు. ఇటువంటి వాడి మనసు ప్రతి చిన్న విషయానికి కూడా చలిస్తూ ఉంటుంది. బుద్ధి నిశ్చలంగా ఉండదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియములను, మనసును మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మనం చెప్పినట్టు నడిచేటట్టు చేసుకోవాలి. అటువంటి వాడిని యుక్త పురుషుడు అని అంటారు. ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము లేని వాడు అయుక్త పురుషుడు అయుక్త పురుషుడికి బుద్ధి నిశ్చయంగా ఉండదు. ప్రజ్ఞ లభించదు. పరమాత్మను గురించిన ఆలోచనలు వాడికి రావు. అటువంటి వాడికి పరమాత్మ భావనే ఉండదు. పరమాత్మ భావన లేనివాడికి శాంతి లభించదు. ఎల్లప్పుడూ అశాంతితో బాధపడుతుంటాడు. నిరంతరం అశాంతితో ఉన్న వాడికి సుఖం ఎలా లభిస్తుంది? అని ప్రశ్నిస్తున్నాడు పరమాత్మ. కాబట్టి అశాంతి పోవాలంటే, సుఖం కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము (శమ, దమములు) ముఖ్యము. ("శాంతము లేక సౌఖ్యము లేదు" అనే త్యాగరాజుల వారి కీర్తన కూడా ఈ విషయాన్నే ప్రతిపాదిస్తుంది అన్న విషయం ఒక సారి గుర్తుచేసుకుందాము).

*67. ఇంద్రియాణాం హి చరతాం యన్మనో2ను విధీయతేl*
 *తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివామ్బసిll*

*68. తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశఃl* *ఇంద్రియాణీన్డ్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాll*

ఓ అర్జునా! ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో, విషయవాంఛలలో మునిగి తేలేవాడి మనస్సు ప్రచండమైన గాలిలో నీటిపై తేలుతున్న నావ మాదిరి అటు ఇటు ఊగుతుంటుంది. నిగ్రహము లేని ఇంద్రియములు మానవుని బుద్ధిని అంటే విచక్షణా శక్తిని హరించివేస్తాయి. అలా కాకుండా ఇంద్రియములను, మనసును అదుపులో ఉంచుకున్న వాడి బుద్ధి, జ్ఞానము, నిశ్చయంగా, స్థిరంగా ఉంటుంది.

సాధకుడు అయిన వాడు తన ఇంద్రియములను మనస్సును ప్రాపంచిక విషయములు, విషయ వాంఛల వైపుకు పోకుండా జాగ్రత్త పడాలి. అలా కాకుండా ఇంద్రియములు, మనసు ఎటు బడితే అటు పోతుంటే, అంతులేని దుఃఖము కలుగుతుంది. ఇంకా ఎక్కువగా సంసారము అనే బావిలో కూరుకుపోతాడు. అది ఎలా అంటే సముద్రములో ఒక నావ ఉంది. దాని ఇష్టం వచ్చినట్టు దానిని పోనిస్తే, గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోతుంది. అలా కాకుండా నావను చుక్కానితో నడిపితే సక్రమ మార్గంలో నడుస్తుంది. సరి అయిన గమ్యం చేరుకుంటుంది. అలాగే మన మనసు బుద్ధి నిశ్చలంగా ఉండాలంటే ఇంద్రియములను మననును అదుపులో ఉంచుకోవడమే. దానికి కావాల్సింది వివేకము, జ్ఞానము. చాలా మంది తమకు వివేకము, జ్ఞానము ఉందనుకుంటారు. కాని వారి మనసు, ఇంద్రియములు అప్పుడప్పుడు వారి స్వాధీనములో ఉండకుండా విషయవాంఛలవైపు వరుగెడుతుంటాయి. దీనికి విశ్వామిత్రుడు ఒక మంచి ఉదాహరణ. కాబట్టి వివేకము, జ్ఞానముతో పాటు వైరాగ్యము కూడా అలవరచుకోవాలి. ఎల్లప్పుడు మనసు ఇంద్రియములను, విషయములలో దూరకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాడి జ్ఞానము స్థిరంగా ఉంటుంది. వాడి బుద్ధి ఆత్మయందు నిశ్చలంగా ఉంటుంది. మానవులు సాధారణంగా "మాకు దుఖములు పోవాలి, సంసార బంధనములు తొలగాలి. మోక్షము రావాలి" అని దేవుడిని కోరుకుంటూ ఉంటారు. ఇది ఎవరికి వారు చేసుకోవాలి కానీ దేవుడేం చేస్తాడు. మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే దుఃఖాలు రావు. అన్నీ సుఖాలే. సంసార బంధనములు ఉండవు. మోక్షము దానంతట అదే వస్తుంది. అని పరమాత్మ బోధించాడు.

సాధారణంగా మనస్సు ఏం చెబితే ఆ మాట ఇంద్రియాలు వినాలి. కాని కొంత మందికి ఇంద్రియాలు మనసును శాసిస్తుంటాయి. ఇంద్రియాలు ఎటుబోతే మనసును కూడా తమవైపు లాక్కుపోతుంటాయి. అటువంటి వాడి మనస్సు ఎలా ఉంటుంది అంటే ఒక పడవ నీటిలో తేలుతూ ఉంది. పెద్దగా గాలి వీచింది ఆ పడవ అటు ఇటు ఊగుతుంటుంది. ఎటో దిక్కుగా వెళుతుంది. తుదకు మునిగి పోతుంది. నిశ్చలంగా ఉండదు. ఇంద్రియములు ఎటు పోతుందో మనసు అటే పోతుంది. ఇంద్రియములు మనసుకు ఉన్న శక్తిని కూడా హరిస్తాయి. అప్పుడు బుద్ధి కూడా పని చేయదు. విచక్షణా శక్తి సన్నగిల్లుతుంది. చేయకూడనిపనులు చేసి కష్టాలలో పడతాడు. కాబట్టి మనసును ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. అలా అదుపులో పెట్టుకోలేని వాడి బుద్ధి పనిచేయదు. అలా కాకుండా, ఇంద్రియములను ప్రాపంచిక విషయముల నుండి వెనక్కు లాగి తన అధీనంలో ఉంచుకుంటే, మనసును అటు ఇటుపోకుండా నిగ్రహిస్తే, అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది.

కాబట్టి ఓ అర్జునా! నీ ఇంద్రియములు కూడా నీ స్వాధీనంలో ఉన్నట్టు కనపడటం లేదు. చేతులు వణుకుతున్నాయి, చెమటలుపడుతున్నాయి, గొంతు ఎండిపోతోంది, గాండీవం కిందపడిపోతోంది, అని అన్నావు కదా! నీ ఇంద్రియములు చేసే పనులకు నీవు లొంగి పోయి యుద్ధం చేయను అని అనవద్దు. నీ ఇంద్రియములను నీ స్వాధీనంలో ఉంచుకో. ఇంద్రియములు చెప్పినట్టు చేస్తే అపకీర్తి పాలవుతావు. కాబట్టి నీ మనసును, బుద్ధిని నిశ్చయం చేసుకో. ప్రజ్ఞతో, వివేకంతో ఆలోచించు. యుద్ధం చేయడానికి సిద్ధంకా! అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
(సశేషం)

     *🌹యోగక్షేమం వహామ్యహం🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                                 P129

No comments:

Post a Comment